Begin typing your search above and press return to search.

క‌శ్మీర్‌ -అయోధ్య ప‌రిష్కారాలు...కేసీఆర్‌ తోనే సాధ్యం

By:  Tupaki Desk   |   27 Feb 2019 1:55 PM GMT
క‌శ్మీర్‌ -అయోధ్య ప‌రిష్కారాలు...కేసీఆర్‌ తోనే సాధ్యం
X
జ‌మ్ముక‌శ్మీర్ నియంత్ర‌ణ రేఖ‌...భార‌త‌దేశాన్ని ఇర‌కాటంలో ప‌డేసేందుకు ఉగ్ర‌వాదులు ఎంచుకుంటున్న ప్రాంతం. స‌రిహ‌ద్దులోని ఈ రాష్ట్రం నిత్యం ఉద్రిక్త‌భ‌రితంగానే ఉంటుంద‌న‌డం అతిశ‌యోక్తి కాదు. అయోధ్య వివాదం...దేశంలో అంత‌ర్గ‌తంగా ఉద్రిక్త‌త‌లు పెరిగేందుకు కార‌ణం అవుతున్న అంశం. పాల‌కులు మారినా....ఈ రెండు చోట్ల ఉద్రిక్త‌త‌లు చల్లార‌డం లేదు. స‌మ‌స్య‌కు స‌మ‌గ్ర ప‌రిష్కారం దొర‌క‌డం లేదు. అయితే, ఈ రెంటికీ ప‌రిష్కారం చూపే ఒకే వ్య‌క్తి తెలంగాణ సీఎం - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అట‌. ఈ మాట చెప్పింది టీఆర్ ఎస్‌ పార్టీ ఎంపీ బూర న‌ర్స‌య్య‌గౌడ్‌.

తెలంగాణ భవన్లో టీఆర్ ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మీడియాతో మాట్లాడుతూ పుల్వామా ఘటనకు దీటయిన జవాబిచ్చిన భారత వాయుసేనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామ‌ని, ఇలాంటి చర్యలకు టీఆర్ ఎస్‌ మద్దతు ఉంటుందన్నారు. కాశ్మీర్ సమస్యకు మూల కారణం కాంగ్రెస్ పార్టీయేన‌ని - ఈ సమస్యను రాచపుండులా చేసింది జవహర్ లాల్ నెహ్రు విధానాలే అని మండిప‌డ్డారు. ``కశ్మీర్‌ కు తెలంగాణకు పోలికలు ఉన్నాయి. కశ్మీర్‌ లాగే తెలంగాణ సమస్యకు కారణమైంది నెహ్రుయే. పటేల్ సమర్ధత వల్లే అపుడు తెలంగాణ భారత్‌లో విలీనమయ్యింది ..లేదంటే కాశ్మీరులాగే తెలంగాణ రగిలేది. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఎంతకైనా దిగజారుతుంది`` అని తెలిపారు.

``కశ్మీరు సమస్యకు శాశ్వత పరిష్కారం కేసీఆర్ లాంటి విజనరీ వల్లే సాధ్యమవుతుంది. అయోధ్య సమస్యకు పరిష్కారం కూడా కేసీఆర్ లాంటి నాయకుడి వల్లే సాధ్యమవుతుంది. కేసీఆర్ పంచసిద్ధుడు. సిద్దులకుండే గొప్ప లక్షణాలు కేసీఆర్‌ కు ఉన్నాయి. ...కాశ్మీర్ సమస్య శాశ్వత పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు టీఆర్ ఎస్ మద్దతునిస్తుంది`` అని వెల్ల‌డించారు.