Begin typing your search above and press return to search.

కేంద్రం చేస్తున్న చిత్రాలేంటో చెప్తున్న క‌విత‌క్క‌

By:  Tupaki Desk   |   26 April 2018 5:31 AM GMT
కేంద్రం చేస్తున్న చిత్రాలేంటో చెప్తున్న క‌విత‌క్క‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య‌, నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌త్య‌ర్థుల‌పై ఎదురుదాడి చేయ‌డం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేని సంగతి తెలిసిందే. అవకాశం దొరికితే త‌మ విప‌క్షాల‌ను చెండాడుతుంటారు. ఇటీవ‌లి కాలంలో త‌న తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో ముందుకు సాగుతున్న నేప‌థ్యంలో దేశ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు కావాల‌ని కోరుతున్న క్ర‌మంలో క‌విత సైతం క్రియాశీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా కేంద్రంపై కొత్త పాయింట్‌తో ఎదురుదాడి చేశారు.

కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా తెలంగాణ రాష్ట్రం సరిగ్గా వాడుకోవడం లేదని నిజామాబాద్ జిల్లా పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించడంపై ఎంపీ క‌విత‌ స్పందించారు. కేంద్రం రాష్ర్టాలకు స్వేచ్ఛనివ్వడం లేదని ఎంపీ కవిత ఆరోపించారు. కేంద్రం అమలు చేస్తున్న కొన్ని పథకాలలు సమీక్షిస్తే, చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. పేరు పెద్ద.. ఊరు దిబ్బ అన్న చందంగా పథకాల పేర్లు మార్చారే గానీ, అమలు తీరు మాత్రం మారలేదని ఆమె విమర్శించారు. ముందున్న పాత స్పిరిట్ లేకుండా పోయిందన్నారు. కొన్ని పథకాల అమలు దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంకొన్ని విచిత్రంగా ఉన్నాయన్నారు. శ్మశానవాటికల నిర్మాణంలో ఉత్తర భారతదేశానికి సంబంధించిన డిజైన్‌ లను రూపొందించారని - దక్షిణ భారతదేశ శ్మశానాలు - మన అవసరాలు - మన డిజైన్‌ లు వేరే రకంగా ఉంటాయన్నారు. దీంట్లో కూడా మనకు స్వాతంత్య్రం లేదన్నారు. వాళ్లిచ్చిన నిధులు సరిపోకపోతే తెలంగాణ ప్రభుత్వం కొన్నినిధులు వేసుకొని కట్టించే పరిస్థితి ఉందన్నారు. పథకాలను ఆయా రాష్ర్టాలు - ఆయా జిల్లాలకు అనుగుణంగా అమలు చేసుకునేలా కేంద్రం స్వేచ్ఛనివ్వాలన్నారు. కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో అమలుకావడం లేదన్నారు.

వెయ్యేళ్ల పాటు గుర్తుండి పోయేలా టీఆర్ ఎస్ పాలన కొనసాగుతోందని ఎంపీ కవిత అన్నారు. కాకతీయులు నిర్మించిన చెరువులను తదితర అభివృద్ధి పనులను వెయ్యేళ్ల‌ తర్వాత కూడా చూస్తున్నామని అదే రీతిలో టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి కూడా కాకతీయుల లాగే వెయ్యేళ్ల‌ పాటు గుర్తుండిపోతుందన్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని గుర్తించి, అందుకు కృషి చేస్తున్న తెలంగాణ బిడ్డ కేసీఆర్ అందులో విజయవంతమైతే తెలంగాణకు గర్వకారణంగా నిలిచిపోతుందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులు అంతర్జాతీయంగా ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. యునిసెఫ్ - వరల్డ్ బ్యాంకు లాంటి సంస్థల ప్రతినిధులు ఎన్నో సార్లు ప్రశంసలు కురిపించారని గుర్తు చేశారు. తెలంగాణను గాడిలో పెట్టిన కేసీఆర్, దేశ రాజకీయాల్లో మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు.