Begin typing your search above and press return to search.

వామ్మో.. క‌విత ఏమిటిలా మాట్లాడుతున్నారు?

By:  Tupaki Desk   |   19 May 2018 4:32 AM GMT
వామ్మో.. క‌విత ఏమిటిలా మాట్లాడుతున్నారు?
X
కొంత‌మంది అధినేత‌ల వార‌సుల‌తో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు చాలా సౌక‌ర్య‌వంత‌మైన ప‌రిస్థితుల్లో ఉన్నార‌ని చెప్పాలి. కొడుకు.. కూతురు ఇద్ద‌రికి ఇద్ద‌రే అన్న‌ట్లుగా చెప్పాలి. మాట‌కారిత‌నం.. ప్ర‌త్య‌ర్థుల‌పై రాజ‌కీయ దాడి.. వ‌ర్త‌మాన రాజ‌కీయాల‌పై విశ్లేష‌ణ లాంటి అంశాల్లో కేసీఆర్ సంతాన్ని త‌ప్పు ప‌ట్టే ప‌రిస్థితి దాదాపుగా ఉండ‌దు.

తాము మాట్లాడే మాట‌ల విష‌యంలో కేటీఆర్.. క‌విత‌లు ఇద్ద‌రూ ఆచితూచి అన్న‌ట్లే వ్య‌వ‌హ‌రిస్తారే త‌ప్పించి.. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడిన‌ట్లు అస్స‌లు క‌నిపించ‌రు. మ‌రి.. అలాంటి క‌విత నోటి నుంచి తాజాగా వ‌చ్చిన వ్యాఖ్య‌లు చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. ఈ మ‌ధ్య‌న న్యూస్ ను ఆమె స‌రిగా ఫాలో కావ‌ట్లేదా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. క‌ర్ణాట‌క‌లోని తెలుగువారు జేడీఎస్ కు ఓటు వేయాలంటూ పిలుపును ఇవ్వ‌టం తెలిసిందే.

తాను స్టార్ట్ చేసిన ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు సంబంధించిన వివ‌రాల్ని మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌తో షేర్ చేసేందుకు వెళ్లిన కేసీఆర్ ఆ సంద‌ర్భంగా లంచ్ చేశారు. క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలుగువారంతా జేడీఎస్ కు ఓటు వేయాల‌న్నారు. మ‌రి.. కేసీఆర్ నోటి నుంచి అంత నేరుగా ప్ర‌క‌ట‌న వ‌చ్చిన త‌ర్వాత జేడీఎస్ కు జ‌రిగిన లాభం చూస్తే.. అంతంత మాత్ర‌మేన‌ని చెప్పాలి. బీజేపీకి.. జేడీఎస్ కు లోగుట్టుగా సంబంధాలు ఉన్న‌ట్లుగా ఎన్నిక‌ల పోలింగ్ ముందు జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. దీనికి త‌గ్గ‌ట్లే జేడీఎస్ కు పెద్ద‌గా సీట్లు రాలేదు.

పోలింగ్ కు ముందు జేడీఎస్ కు 40 ప్ల‌స్ సీట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెప్పినా.. అంతిమంగా ఆ పార్టీకి 38 సీట్లు మాత్ర‌మే ద‌క్కాయి. వీటిలో కుమార‌స్వామి గెలిచిన రెండు స్థానాల్లో ఒక్క‌టి మాత్ర‌మే ఆయ‌న త‌న‌తో ఉంచుకునే వీలు ఉండ‌టంతో జేడీఎస్ వాస్త‌వ బ‌లం 37 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే.

ఇదిలా ఉంటే.. తాజాగా నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఎంపీ క‌విత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చెప్పిన‌ట్లే క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌ కు అనుకూలంగా తీర్పు ఇచ్చిన‌ట్లు చెప్పి ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. ఫెడ‌ర‌ల్ ప్రంట్ పేరును కేసీఆర్ చెప్పినా.. ఇప్ప‌టికి దానికో విధివిధానాలు.. కార్య‌క్ర‌మాలు అంటూ జ‌రిగింది లేదు. ఏదో రెండు.. మూడు రాష్ట్రాల‌కు వెళ్లి ఆయాపార్టీల అధినేత‌ల‌తో మాట్లాడారే త‌ప్పించి.. అంత‌కు మించిన కార్య‌క్ర‌మం ఏదీ జ‌ర‌గ‌లేదు.

నిజానికి ఎంపీ క‌విత మాట‌లు వింటే.. కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ వ‌ర్క్ వుట్ అయితే.. బీజేపీకి చెందిన నేత ఎందుకు ముఖ్య‌మంత్రి అవుతారు? ఆ మాట‌కు వ‌స్తే.. క‌ర్ణాట‌క‌లో ఇప్పుడున్న లొల్లి ఏమీ ఉండేది కాదు. కేసీఆర్ చెప్పిన త‌ర్వాత తెలుగు ఓట‌ర్లు ప్ర‌భావం చూపించే ప్రాంతాల్లో జేడీఎస్ కు వ‌చ్చిన సీట్లు అంతంత మాత్ర‌మే. అలాంటి వేళ‌.. త‌న తండ్రి నోటి వెంట అప్పుడ‌ప్పుడు వ‌చ్చిన ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు భారీగా స్పందించి తీర్పు ఇచ్చార‌ని చెప్ప‌టం ఎంత‌మాత్రం అత‌క‌దు. అంతే కాదు.. ఈ త‌ర‌హా మాట‌ల కార‌ణంగా ఎంపీ క‌విత మాట మీద ఉండే విలువ కూడా త‌గ్గుతుంద‌న్న విష‌యాన్ని గుర్తిస్తే మంచిది.