Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్ల‌తో అలా ఉండాల‌ని కేసీఆర్ చెప్పార‌న్న క‌విత‌!

By:  Tupaki Desk   |   5 Aug 2018 5:27 AM GMT
ఆంధ్రోళ్ల‌తో అలా ఉండాల‌ని కేసీఆర్ చెప్పార‌న్న క‌విత‌!
X
క‌లిసి ఉండి విడిపోయిన‌ట్లు ఉండే బ‌దులు.. విడిపోయి క‌లిసి ఉందామన్న మాట తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో విప‌రీతంగా వినిపించేది. విభ‌జ‌న‌ను వ్య‌తిరేకించే ఆంధ్రోళ్ల‌ను ఉద్దేశించి విడిపోయి క‌లిసి ఉందామ‌నే నినాదం అంద‌రి నోటా వచ్చేది. తెలంగాణ ప్ర‌జ‌లు అనుకున్న‌ట్లే ఏపీ రెండు ముక్క‌లైంది. ఎవ‌రి బ‌తుకులు వారు బ‌తుకుతున్న ప‌రిస్థితి. విభ‌జ‌న‌తో ఏపీకి ఎంత న‌ష్టం జ‌రిగిందో.. తెలంగాణ‌కు ఎంత లాభం జ‌రిగిందో ప్ర‌త్యేకించి చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. ఈ విష‌యాల మీద అంద‌రికి బాగానే అవ‌గాహ‌న ఉంది.

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఢిల్లీలోని ఆంధ్రా.. తెలంగాణ ఎంపీల మ‌ధ్య సంబంధాలు అంత చ‌క్క‌గా ఉండేవి కావు. ఉద్య‌మం పీక్స్ లో వెళ్లిన‌ప్పుడు.. రాజ‌కీయాల‌కు అతీతంగా ఉన్న స్నేహ‌బంధాలు సైతం ఇబ్బందుల్లో ప‌డ‌టం.. త‌మ స్నేహం రాజ‌కీయ భ‌విష్య‌త్తును ఇబ్బందుల్లో పెడుతుంద‌న్న భ‌యంతో కొంత‌మంది.. భిన్న వాద‌న‌ల న‌డుమ ఆంధ్రా.. తెలంగాణ ఎంపీల మ‌ధ్య స‌ఖ్య‌త క‌నిపించేది కాదు.

మ‌రి.. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఎంపీల మ‌ధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? వారి. మ‌ధ్య అనుబంధాల మాటేమిటి? అన్న ప్ర‌శ్న‌ల్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమార్తె క‌మ్ టీఆర్ ఎస్ ఎంపీ క‌విత ఆస‌క్తిక‌ర అంశాన్ని చెప్పుకొచ్చారు. విభ‌జ‌న ఉద్య‌మ వేళ‌లో రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఎంపీలు కాస్త అంటీముట్ట‌న‌ట్లుగా ఉండేవారని.. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేద‌న్నారు.

తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత త‌మ అధినేత (కేసీఆర్) ఒక మాట చెప్పారంటూ.. "నిన్న‌టి వ‌ర‌కూ ఒక అధ్యాయం. రేప‌టి నుంచి మ‌రొక‌టి. తెలంగాణ వ‌చ్చే వ‌ర‌కు మ‌న ప్ర‌జ‌ల గురించి మాత్ర‌మే మ‌నం ఆలోచించాం. ఇప్పుడు మ‌న ప్ర‌జ‌ల్ని.. మ‌న రాష్ట్రాన్ని దేశంలో అంతా గౌర‌వించాలి. అంటే.. అంద‌రితో మ‌నం బాగుండాలి. అంద‌రి కంటే ముందు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు.. అక్క‌డి ప్ర‌జాప్ర‌తినిధుల‌తో బాగుండాలి" అని చెప్పిన‌ట్లుగా తాజాగా ఒక మీడియా సంస్థ‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

క‌విత మాట‌లే నిజం అనుకుంటే.. ఏపీకి ప్రాణ‌వాయువు అయిన ప్ర‌త్యేక హోదా మీద ఇన్ని నీతులు చెప్పిన కేసీఆర్ ఎందుకు మ‌డ‌త పేచీ పెడుతున్న‌ట్లు? అలా అని.. ప్ర‌త్యేక హోదా మీద కేసీఆర్ మొద‌ట్నించి వ్య‌తిరేకిస్తుంటే.. అరే.. నిజ‌మే క‌దా.. మొద‌ట్నించి ఈ పెద్ద‌మ‌నిషి హోదాను వ్య‌తిరేకిస్తున్నాడుగా అనుకోవ‌చ్చు. కానీ.. నిన్న‌టి వ‌ర‌కూ ఆ విష‌యం మీద సానుకూలంగా మాట్లాడి.. ఈ రోజున ఏపీకి హోదా ఇస్తే.. తెలంగాణ‌కు కూడా ఇవ్వాల‌ని చెప్ప‌టంలో మ‌ర్మ‌మేంది?

ఏపీ ప్ర‌జ‌ల‌తో స‌ఖ్య‌త‌గా ఉండాల‌న్న అభిలాషే అంత ఎక్కువ ఉంటే.. ఏపీ సోద‌రుల‌కు తీవ్రంగా న‌ష్టం వాటిల్లేలా హోదా అంశంపై కేసీఆర్ ఎందుకు వ్యాఖ్య‌లు చేస్తున్న‌ట్లు? ఏపీకి హోదా వ‌స్తే.. త‌మ సోద‌రుల క‌ష్టాలైనా త‌గ్గుతాయ‌న్న భావ‌న ఎందుకు లేదు? అన్న‌ది ప్ర‌శ్న‌. ఇంట‌ర్వ్యూల‌లో ఏపీతో తాము క‌లిసి ఉంటామంటూ గొప్ప‌లు చెప్పే తీరుకు భిన్నంగా చేత‌లు ఎందుకు ఉంటున్నాయ‌న్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. దీనికి క‌విత స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?