Begin typing your search above and press return to search.

బాబు ఓ ప‌క్కింటి వ్య‌క్తి..క‌విత సెటైర్‌

By:  Tupaki Desk   |   24 Nov 2018 4:40 PM GMT
బాబు ఓ ప‌క్కింటి వ్య‌క్తి..క‌విత సెటైర్‌
X
తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు - ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై టీఆర్ ఎస్ నేత‌ల విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. టీఆర్ ఎస్ పార్టీ అగ్ర‌నేత కేసీఆర్ నుంచి మొద‌లుకొని పార్టీ ద్వితీయ శ్రేణి నాయ‌కుల వ‌ర‌కు టార్గెట్ బాబు అన్న‌ట్లుగా విమ‌ర్శిస్తున్నారు. తాజాగా టీఆర్ ఎస్ ఎంపీ కవిత నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో నిర్వ‌హించిన ర్యాలీలో చంద్ర‌బాబుపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పక్క రాష్ట్రంలో ఉండి ఇక్కడ జరిగే రాజకీయంలో చక్రం తిప్పితున్నారని వ్యాఖ్యానించారు. పక్కింటి వ్యక్తుల పట్ల ఎంత ప్రేమ - గౌరవం ఉన్నా వాళ్ల ఫొటోను మన ఇంట్లో పెట్టుకోం... కానీ, ఇక్కడ కాంగ్రెస్ వాళ్లు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటోను పెట్టు కుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఉద్య‌మం స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అడ్డుకొని... ఇప్పుడు తెలంగాణ రాజకీయంలో పని ఏంటి? అని కవిత ప్రశ్నించారు. ``పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి మన రాష్ట్రం రాజకీయంలో పని ఏంటి? అక్కడ దున్నుకోవాల్సినంత భూమి ఉంది.. అమరావతి నిర్మించాల్సిన పని ఉంది. సెక్ర‌టేరియెట్ క‌ట్టుకోవాల్సి ఉంది.. ఏపీ ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్యాలు క‌ల్పించాల్సి ఉంది...అవ‌న్నీ వ‌దిలేసి తెలంగాణ‌లో రాజ‌కీయం చేద్దామ‌ని కుట్ర‌లు చేస్తున్నాడు. ప‌క్క రాష్ట్రం నాయ‌కుడు మ‌న‌కు అవ‌స‌రం లేదు. ఉత్తర కుమారుడిగా పేరొందిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి - మ‌న ప్రాజెక్టుల‌ను ఆపేందుకు ఉత్త‌రాలు రాసే ఉత్త‌రాల బాబుల‌ను ఎన్నిక‌ల్లో ఓటు ద్వారా తిప్పికొట్టాలి. తెలంగాణ వ్య‌తిరేకుల‌కు తెలంగాణ‌లో స్థానం లేదు`` అని అన్నారు.

సోనియాగాంధీ హైదరాబాద్ వచ్చి తెలంగాణ గురించి మాట్లాడకుండా పక్క రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇస్తామని మాట్లాడుతున్నారని ఎంపీ క‌విత మండిప‌డ్డారు. ``సోనియాగాంధీ మాటలు చూస్తే చంద్రబాబు మాటలుగా ఉన్నాయి. టీఆర్‌ ఎస్ పార్టీ ఎక్కడైనా తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసమే మాట్లాడుతుంది - పోరాటం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎజెండా తెలంగాణ రాష్ట్రంలో తేవాలని కుట్ర చేస్తున్నారు. జీవన్‌ రెడ్డి కేసీఆర్‌ పై విమర్శలు తప్ప నియోజకవర్గ ప్రజలకు చేసింది ఏమీ లేదు` అని అన్నారు.