Begin typing your search above and press return to search.

అన్న‌కు త‌గ్గ‌ట్లే అక్క కూడా స్పందించింది

By:  Tupaki Desk   |   10 May 2018 4:51 AM GMT
అన్న‌కు త‌గ్గ‌ట్లే అక్క కూడా స్పందించింది
X
క‌ష్టం వ‌స్తే అన్న స్పందిస్తున్నాడు. అక్క రియాక్ట్ అవుతోంది. త‌మ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధి కాకున్న‌.. అప‌న్న‌హ‌స్తం అందించేందుకు వెనుకాడ‌టం లేదు. ఈ తీరు మంచిదే అయినా.. వ్య‌వ‌స్థ‌కు ఈ త‌ర‌హా స్పంద‌న ఏ మాత్రం మంచిది కాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. సామాజిక మీడియాలో ఏదైనా ఆస‌క్తిక‌ర అంశం క‌నిపించినా.. సాయం కోసం అభ్య‌ర్థ‌న వినిపించినా వెంట‌నే రియాక్ట్ అవుతున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌.. ఆయ‌న సోద‌రి క‌మ్ ఎంపీ క‌విత‌. తాజాగా అలానే స్పందించిన ఆమె తీరు ప‌లువురి ప్ర‌శంస‌లు పొందుతోంది.

నిజామాబాద్ జిల్లా బోధ‌న్ మండ‌లం ఊట్ప‌ల్లికి చెందిన నిరుపేద గిరిజ‌న మ‌హిళ జ్యోతి. ఆమె అక్యూట్ ఇంటెస్ట‌యిన‌ల్ అబ్ స్ట్ర‌క్ష‌న్ వ్యాధితో హైద‌రాబాద్‌ లోని స‌న్ షైన్ ఆసుప‌త్రిలో చేరారు. ఆప‌రేష‌న్ కు రూ.4ల‌క్ష‌లు అవుతుంద‌ని వైద్యులు చెప్పారు. అంత మొత్తాన్ని చెల్లించే స్తోమ‌త జ్యోతికి లేదు. దీంతో ఆమె సోద‌రుడు విజ‌య్.. త‌న అక్క ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ను ఎంపీ క‌విత‌కు ట్విట్ట‌ర్ ద్వారా స‌మాచారం అందించారు.

దీంతో స్పందించిన ఆమె.. వెంట‌నే విజ‌య్ తో ఫోన్లో మాట్లాడారు. ఓదార్చ‌టంతో స‌రిపుచ్చ‌కుండా ఆసుప‌త్రి యాజ‌మాన్యంతో మాట్లాడి శ‌స్త్ర‌చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చును చెల్లిస్తామ‌ని చెప్పారు. దీంతో.. స్పందించిన ఆసుప‌త్రి యాజ‌మాన్యం నిరుపేద జ్యోతికి శ‌స్త్ర‌చికిత్సను చేశారు. ట్విట్ట‌ర్‌లో ట్వీట్ సందేశానికి రియాక్ట్ అయిన ఎంపీ క‌విత తీరును ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు.

ఇదంతా చూసిన‌ప్పుడు ఎంపీ క‌విత‌ది ఎంత మంచి హృద‌యం అనుకోకుండా ఉండ‌లేం. ఆ మాట‌కు వ‌స్తే.. క‌విత కంటే ఎక్క‌వ‌గా మంత్రి కేటీఆర్ ఈ త‌ర‌హా సాయాల్ని చేస్తుంటారు. బాధితులు ఎవ‌రైనా.. సాయం పొందేలా వ్య‌వ‌స్థ‌లు ఉండాలే త‌ప్పించి.. కీల‌క నేత‌ల స్పంద‌న‌కు అనుగుణంగా ఉండ‌టంతోనే ఇబ్బంది. ఇంకాస్త అర్థ‌మ‌య్యేలా చెప్పాలంటే.. ఒక‌వేళ జ్యోతి సోద‌రుడికి ఎంపీ క‌విత‌కు ట్వీట్ రిక్వెస్ట్ పంపాల‌న్న ఆలోచ‌న రాకుంటే ఆమె ప‌రిస్థితి ఏంటి? అన్న ప్ర‌శ్న వేసుకుంటే భ‌యంతో వ‌ణుకు గ్యారెంటీ. ఇక్క‌డ చెప్పేదేమంటే.. క‌విత స్పంద‌న‌ను త‌క్కువ చేయ‌టం లేదు. అదే స‌మ‌యంలో.. సాయం అవ‌స‌ర‌మైన నిరుపేద‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా వ్య‌వ‌స్థ‌లు స్పందిస్తే మందికి మ‌రింత మేలు జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. కేటీఆర్‌.. క‌విత‌ల‌కు స్పందించే గుణం ఉంది కాబ‌ట్టి స‌రిపోయింది. ఒక‌వేళ‌.. వారున్న స్థానాల్లోని వారికి ఆ తీరు లేకుంటే క‌ష్టాల్లో ఉన్న వారికి ఎంత క‌ష్టం. వ్య‌వ‌స్థ‌ల్ని శాసించే స్థాయిలో ఉన్న కేటీఆర్.. క‌విత‌లు ఈ త‌ర‌హా సాయాలు చేస్తూనే.. ఇలాంటి రిక్వెస్టుల‌కు స్పందించే వ్య‌వ‌స్థ‌లను ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌రి.. వారేమంటారో?