Begin typing your search above and press return to search.

ఖర్చు లెక్క ప్రజలది..క్రెడిట్ మాత్రం కవితదా?

By:  Tupaki Desk   |   12 Oct 2016 7:19 AM GMT
ఖర్చు లెక్క ప్రజలది..క్రెడిట్ మాత్రం కవితదా?
X
దసరా సంరంభం ముగిసింది. దాంతో పాటే బతుకమ్మ హడావుడి ఈ ఏడాదికి పూర్తి అయినట్లే. తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్వహించిన బతుకమ్మ పండగ విషయంలో కీలకమైన అంశాలు రెండున్నాయి. ఇందులో మొదటిది బతుకమ్మ పండగను ధూంధాంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు రూ.15 కోట్లను విడుదల చేసింది. పండగను భారీగా నిర్వహించటం కోసం అంత పెద్ద మొత్తాన్ని విడుదల చేయటంపై భిన్నాభిప్రాయాలున్నాయి. అంత మొత్తాన్ని పండగ కోసం కాకుండా.. పేద ప్రజలకు అవసరమైన వాటి కోసం ఖర్చు చేస్తే ఫలితం ఉంటుంది కదా? అన్న విమర్శ ఉంది.

అయితే.. తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయటాన్ని అడ్డుకునే కుట్రలో భాగంగానే బతుకమ్మ పండక్కి తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న ఖర్చుపై లేని పోని విమర్శలు చేస్తున్నారని మండిపడే వారు కొందరు ఉన్నారు. సమస్యేమిటంటే.. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు సెంటిమెంట్ చుట్టూ చక్కర్లు కొడుతుంటాయి. ఏ విషయాన్ని టచ్ చేసినా.. వాటికి భావోద్వేగ అంశాల్ని ముడిపెట్టి.. ఇదంతా కొందరు చేస్తున్న కుట్రగా అభివర్ణించటం ఈ మధ్యన ఎక్కువైందన్న విమర్శ ఉంది.

అలా ఎలా చెబుతారన్న కొందరి ప్రశ్నకు తాజాగా నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమాన్ని ఉదాహరణగా చెప్పొచ్చని చెబుతారు. పేదల ప్రాణాలకు సంజీవిని లాంటి ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన బిల్లులు సకాలంలో చెల్లించక.. కొద్దికాలంగా ఈ సేవలు ఆగిపోవటం తెలిసిందే. ప్రభుత్వం ఓపక్క ఆరోగ్య శ్రీ సేవలకు ఎలాంటి అంతరాయం వాటిల్లలేదని చెబుతుంటే.. మరోవైపు ఆరోగ్యశ్రీ సేవల్ని అందించే ప్రైవేటు ఆసుపత్రులు కొన్ని.. తమ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు.. తాము అందిస్తున్న సేవలకు చెల్లించిన మొత్తంపై సమీక్ష జరపాలని.. గడిచిన కొన్నేళ్లుగా పాత ధరలకే తాము వైద్యసేవలు అందిస్తున్నామని చెబుతున్నారు. దీని వల్ల తాము విపరీతంగా నష్టపోతున్నామని.. ప్రభుత్వం కల్పించుకొని తాము చేసే సేవలకు చెల్లించే మొత్తాల్ని పెంచాలని కోరుతున్నారు.

ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టని తెలంగాణ ప్రభుత్వం.. బతుకమ్మ పండగను ఘనంగా జరిపేందుకు మాత్రం రూ.15 కోట్లు విడుదల చేయటం కనిపిస్తుంది. పోయే ప్రాణాల్ని కాపాడే విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా? పండగను ఘనంగా జరుపుకోవటానికి ప్రయారిటీ ఇవ్వాలా? అన్నది ప్రశ్న. ఇదిలా ఉంటే.. రూ.15కోట్లు ఖర్చు చేసిన బతుకమ్మ పండగలో ప్రముఖంగా కనిపించిందేమిటి? అన్నది చూస్తే.. అందరి మదిలో మెదిలేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె కవితనే. తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మ పండక్కి కొత్త ఇమేజ్ తీసుకురావటంలో ఆమె కృషిని ఎవరూ కాదనరు. కానీ.. ప్రభుత్వం చేసే కోట్ల రూపాయిల ఖర్చుకు వచ్చే పేరు ప్రఖ్యాతుల్లో సింహభాగం కవిత ఖాతాలోకి వెళుతున్నాయన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈసారి బతుకమ్మ సంబరాల సమయంలో కవిత తెలంగాణ రాష్ట్రంలోనే లేరు. ఆమె విదేశాల్లోని తెలంగాణ ప్రజల మధ్య బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కానీ.. ఆమె తెలంగాణలో ఉన్నట్లుగానే బతుకమ్మ పండగ జరిగినట్లుగా మీడియాలో కనిపించిందన్న ఆరోపణ ఉంది. టీవీ ఛానళ్ల లైవ్ లు మొదలుకొని.. పత్రికల్లో వచ్చే భారీ ఇంటర్వ్యూలతో పాటు.. బతుకమ్మ సందర్భంగా వేసే ఫోటోల్లోనూ అక్కడెక్కడో అల్లంత దూరాన ఉన్న కవితను కవర్ చేయటం.. ఆమె ఇక్కడే ఉండి బతుకమ్మ సంబరాల్ని నిర్వహించినట్లుగా కలర్ ఇవ్వటం చూసినప్పుడు అనిపించేది ఒక్కటే. బతుకమ్మ ఖర్చు ప్రజలదైతే.. క్రెడిట్ మాత్రం కవిత ఖాతాలోకి వెళ్లిందన్న విమర్శకు సంతృప్తికరంగా సమాధానం చెప్పే వారే లేరన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/