Begin typing your search above and press return to search.

రాజకీయం వద్దన్నప్పుడు లీకులేల కవితమ్మా?

By:  Tupaki Desk   |   12 Aug 2016 1:43 PM GMT
రాజకీయం వద్దన్నప్పుడు లీకులేల కవితమ్మా?
X
కరుడుగట్టిన నేరస్తుడు నయిం ఎన్ కౌంటర్ జరగటం.. అనంతరం పెద్ద ఎత్తున సోదాలు జరగటం.. అతని అనుచరులు పలువుర్ని అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. ఈ సందర్భంగా భారీగా డాక్యుమెంట్లు.. నగలు.. నగదు బయటపడ్డాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా.. నయిం వెనుక మాజీ మంత్రి ఉన్నారంటూ ప్రభుత్వం నుంచి లీకులు వచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. భువనగిరికి చెందిన మాజీ మంత్రి ఒకరు నయిం వెనుక ఉన్నారని.. సదరు నేతకు.. నయింకు మధ్య వందల కొద్దీ ఫోన్ కాల్స్ వెళ్లినట్లుగా పోలీసులు వర్గాలు ఖరారు చేసుకున్నట్లుగా అన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. మరికొన్ని మీడియా సంస్థలైతే.. ఉత్సాహంతో ఒక అడుగుముందుకేసి అదంతా మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డేనంటూ ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన ఆమె.. తెలంగాణ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఫోన్ కాల్స్ గురించి చెప్పిన మాటల్లో నిజం ఎంత ఉందో తేల్చటానికి.. కాల్ డేటా బయటపెట్టాలంటూ డిమాండ్ చేసిన ఉమా మాధవరెడ్డి తమ ఇమేజ్ ను చెడగొట్టటానికే ఇదంతా చేస్తున్నట్లు ఆరోపించారు. సిట్ విచారణ కాదని.. నయిం ఉదంతం మీద జ్యూడియల్ ఎంక్వయిరీకి ఆదేశిచాలంటూ డిమాండ్ చేశారు. ఉమా మాధవ రెడ్డి ప్రెస్ మీట్ అయ్యిందో లేదో తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి తెర మీదకు వచ్చి.. తమ మీద అనవసర ఆరోపణలు చేసే వారిని ఊరికే వదిలిపెట్టమని హెచ్చరించారు.

ఉమా మాధవరెడ్డి మీద ఈగ వాలినా బాగోదంటూ మండిపడిన ఆయన.. తెలంగాణ సర్కారు కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. నయిం వ్యవహారంలో తెలంగాణ సర్కారుకు మైలేజీ వచ్చినా.. నయింకు మాజీ మంత్రి అండ ఉందంటూ లీకులు ఇచ్చి తప్పు చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమా మాధవరెడ్డి తెర మీదకు వచ్చి తన వాదనను స్పష్టంగా.. సూటిగా వెల్లడించిన నేపథ్యంలో కేసీఆర్ సర్కారు వైపు పలువురు వేలెత్తి చూపించే పరిస్థితి. ఆధారాలు ఉంటే అవి చూపించాలే తప్పించి.. ఇలా ఆరోపణలు చేయటం ఏమిటన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే.. నయిం ఎన్ కౌంటర్ మొదలు ఇప్పటివరకూ ఈ విషయం మీద పెదవి విప్పని టీఆర్ ఎస్ నేతలకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎంపీ కవిత స్పందించారు.

నయిం ఎన్ కౌంటర్ ను రాజకీయం చేయొద్దని ఆమె రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఆరాచక శక్తుల ఆట కట్టించే సమయం ఆసన్నమైందన్న ఆమె.. మాజీ మంత్రులు.. ఎవరి ప్రమేయం ఉన్నా విచారణలో తేలుతుందంటూ వ్యాఖ్యానించారు. అదే నిజమైతే.. విచారణ పూర్తి కాక ముందే లీకుల రూపంలో మాజీ మంత్రి ఉందన్న వార్తలు రావాల్సిన అవసరం ఏముందన్నప్రశ్నకు కవితమ్మ ఏం సమాధానం చెబుతారన్న ప్రశ్న ఎదురవుతుంది. ఎన్ కౌంటర్ ను మిగిలిన కేసుల మాదిరే వ్యవహరిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. అందుకు భిన్నంగా రాజకీయ నేతల హస్తం ఉందంటూ లీకుల రూపంలో తేకపోతే ఈ రోజు కవితమ్మ నోరు విప్పాల్సిన అవసరం ఉండదు కదా..?