Begin typing your search above and press return to search.

మొన్న దానం.. ఈ రోజు కవిత.. హైకోర్టులో ఊరట

By:  Tupaki Desk   |   30 July 2021 3:34 PM GMT
మొన్న దానం.. ఈ రోజు కవిత.. హైకోర్టులో ఊరట
X
ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల లెక్క త్వరగా పూర్తి చేయాలన్న దానిపై తీసుకున్న కీలక నిర్ణయంలో భాగంగా ప్రజాప్రతినిధుల కోర్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం.. యుద్ధ ప్రాతిపదికన వారి మీద ఉన్న కేసుల విచారణను చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో.. కొన్నేళ్ల క్రితం ప్రజాప్రతినిధులుగా ఉన్న వారి మీద ఉన్న కేసుల విచారణ వేగంగా సాగుతోంది. ఇందుకోసం హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు.

గడిచిన కొన్ని నెలలుగా ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులపై విచారణ జరుపుతున్న న్యాయస్థానం కొందరిపై ఉన్న కేసుల్ని కొట్టేస్తే.. మరికొందరి విషయంలో మాత్రం శిక్షలు.. జరిమానాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి .. ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి దానం నాగేందర్ కు ఈ మధ్యనే నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆర్నెల్లు జైలుశిక్షను విధించటం తెలిసిందే.

2013లో బంజారాహిల్స్ లో నమోదైన కేసులో ఆయన దోషిగా నిరూపణ అయ్యింది. ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపర్చారన్న ఆరోపణ ఆయనపై ఉంది. దీంతో.. ఆయనకు ఆర్నెల్లు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అయితే.. ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు కోర్టు అనుమతించి.. శిక్ష అమలును నెల రోజుల పాటు వాయిదా వేసింది. దీంతో.. హుటాహుటిన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడీ అప్పీల్ మీద ఈ మధ్యనే విచారణ జరిగింది. ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు చేపట్టొద్దంటూ ఆదేశాలు ఇవ్వటంతో పాటు.. యథాతధ స్థితిని అమలు చేయాలని చెప్పింది. దీంతో.. దానంకు కాసింత ఊరట లభించింది.

ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవితపై ఉన్న కేసు విచారణలో ఆమెకు ఆర్నెల్లు జైలుతో పాటు జరిమానా విధిస్తూ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును ఇచ్చింది. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బులు పంచారన్న కేసులో ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న మాలోత్ కవిత ఓటర్లకు డబ్బు పంపిణీ చేసినట్లుగా బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనికి సంబంధించిన తీర్పును ఈ మధ్యనే కోర్టు ఇచ్చింది. దీని ప్రకారం ఆమెకు ఆర్నెల్లు జైలుతో పాటు.. పదివేల రూపాయిల జరిమానాను విధించింది. అయితే..జరిమానాను ఆమె చెల్లించటంతో కోర్టు బెయిల్ ను మంజూరు చేసింది.

తొలుత కాంగ్రెస్ లో ఉన్న ఆమె ఆ మధ్యన టీఆర్ఎస్ లో చేరి.. ఎంపీగా గెలుపొందటం తెలిసిందే. ప్రస్తుతం మహబూబాబాద్ ఎంపీస్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె.. ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లారు. హైకోర్టును ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్ లో ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ తెలంగాన రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేశారు. ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కాకుండా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఈ ఇద్దరు నేతలకు ఊరటనిచ్చాయని చెప్పక తప్పదు.