Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను సీఎంగా ఒప్పుకోని గులాబీ విధేయుడు

By:  Tupaki Desk   |   6 Aug 2017 9:15 AM GMT
కేసీఆర్ ను సీఎంగా ఒప్పుకోని గులాబీ విధేయుడు
X
అధినేత మీద అభిమానం మామూలే. కానీ.. కొంద‌రు నేత‌లుతీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. త‌మ‌కున్న అభిమానాన్ని వారు చెప్పే మాట‌లు అప్పుడ‌ప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారి.. అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటాయి. తాజాగా క‌రీంన‌గ‌ర్ టీఆర్ ఎస్ ఎంపీ వినోద్ ఇదే రీతిలో వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు అత్యంత విధేయుడైన ఆయ‌న‌.. టీఆర్ ఎస్ మొద‌ట్నించి అధినేత‌కు అత్యంత ఆప్తుడిగా పేరుంది. మంచి వ‌క్త అయిన వినోద్‌.. తెలంగాణ ఉద్య‌మంలో భాగంగా ఉద్య‌మ వాద‌న‌ను త‌న‌దైన శైలిలో వినిపించేవారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం అలుపెర‌గ‌కుండా పోరాడిన కేసీఆర్ ను ఉద్య‌మ స‌మ‌యంలో చాలామంది హ్యాండ్ ఇచ్చినా.. వినోద్ మాత్రం ఆయ‌న్ను వ‌దిలిపెట్ట‌కుండా ఉన్నార‌ని చెప్పాలి.

తాజాగా ఆయ‌న ఒక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. కేసీఆర్ ను సీఎం అంటే తాను ఒప్పుకోన‌ని అన్నారు. కేసీఆర్ ఎప్ప‌టికీ ఉద్య‌మ నేత‌నే అని ఆయ‌న వ్యాఖ్యానించారు. తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగితే కేసీఆర్ స‌హించ‌ర‌ని.. ఏన్డీయే ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థికి ఉద‌యం ఓటు వేసి.. సాయంత్రం జీఎస్టీకి వ్య‌తిరేకంగా నినాదం ఇచ్చామ‌న్న ఆయ‌న‌.. తెలంగాణ‌ను ఎవ‌రూ ఇవ్వ‌లేద‌న్నారు.

తెలంగాణ‌ను కోట్లాడి సాధించుకున్నామ‌ని చెప్పిన వినోద్‌.. ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ విష‌యంలో మాత్రం కొంద‌రి మ‌న‌సుల్ని చివుక్కుమ‌నే మాట‌ను అనేశారు. తెలంగాణ సిద్ధాంత‌వేత్త ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సారు.. కేసీఆర్ ను వెతుక్కుంటూ వ‌చ్చార‌ని.. త‌మ అధినేత ఎప్పుడూ ఉద్య‌మ నేత‌నేన‌ని అభివ‌ర్ణించారు. కేసీఆర్ ను ఎత్తేసేందుకు.. ఆయ‌న మీద త‌న‌కున్న వీర‌విధేయ‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌టం కోసం తెలంగాణ సిద్ధాంత‌క‌ర్త జ‌య‌శంక‌ర్ సారుకు కాస్తంత త‌క్కువ చేసి మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉందా వినోద్‌? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. కేసీఆర్ ను పొగ‌డొద్ద‌ని ఎవ‌రూ అన‌రు కానీ.. జ‌య‌శంక‌ర్ సార్ ను కాస్తంత త‌గ్గించే ప్ర‌య‌త్నం చేయ‌టం ఏ మాత్రం స‌రికాద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.