Begin typing your search above and press return to search.

సోనియాస‌భ‌..కాంగ్రెస్‌ లో చేరిన టీఆర్ ఎస్ నేత‌లు

By:  Tupaki Desk   |   24 Nov 2018 5:44 AM GMT
సోనియాస‌భ‌..కాంగ్రెస్‌ లో చేరిన టీఆర్ ఎస్ నేత‌లు
X
ప్రజాకూటమి అభ్యర్థుల గెలుపును ఆకాంక్షిస్తూ మేడ్చల్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యం భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. ఈ సభకు ముఖ్య అతిథిగా యూపీఏ చైర్‌ ప‌ర్స‌న్‌ సోనియాగాంధీ హాజ‌ర‌య్యారు. తెలంగాణ ఏర్పాటు అంశం కష్టంగా అనిపించిందని - విభజన సమయం లో ఆంధ్రప్రదేశ్‌ - తెలంగాణ ప్రజల యొక్క బాగోగులు తన కళ్ల‌ ముందు మెదిలాయని చెప్పారు. అంత క్లిష్ట పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రజల పోరాట పటిమ - ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామని చెప్పా రు. భ‌విష్య‌త్తు లోనూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తామ‌న్నారు. ఇదిలా ఉండ‌గా - ఈ స‌భ వేదిక‌గా టీఆర్ ఎస్ పార్టీకి షాక్ త‌గిలింద‌ని పేర్కొన‌వ‌చ్చు.

కాగా - యూపీఏ ఛైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ సమక్షంలో ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఇటీవలే పార్టీ నుంచి వైదొలిగిన ఆ పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి - మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌ రెడ్డి సైతం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, ఈ చేరిక కంటే ముందే...పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా రంటూ ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి బహిష్కరించింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్టు అందులో పేర్కొంది. యాద‌వ‌రెడ్డి కాంగ్రెస్‌ లో చేర‌డం గురించి స్ప‌ష్ట‌త ఉండ‌టం వ‌ల్లే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

ఇదిలాఉండ‌గా - బహిష్కరణ వేటుపై యాదవరెడ్డి స్పందించారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలకూ పాల్పడలేదన్నారు. తనను పార్టీ నుంచి బహిష్కరించారనే విషయం మీడియా ద్వారానే తెలిసిందన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి తాఖీదులూ అందలేదని చెప్పారు. నోటీసులు అందాక కార్యకర్తలతో చర్చించి భవిష్యత్తు నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. టీఆర్ ఎస్‌ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతున్నదని వ్యాఖ్యానించారు. కేవలం ఒకరిద్దరు చేతుల్లోనే పార్టీ నడుస్తున్నది ఆరోపించారు.