Begin typing your search above and press return to search.

ఉద్యమకారుల తిరుగుబావుటా.?

By:  Tupaki Desk   |   9 July 2018 5:04 AM GMT
ఉద్యమకారుల తిరుగుబావుటా.?
X
గడిచిన 13 ఏళ్లుగా స్వరాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులు వాళ్లు.. అధికారంలోకి రాగానే పదవుల కోసం కొట్లాడుకోలేదు.. వెయిట్ చేశారు. ఇప్పటికీ 4 ఏళ్లు గడిచిపోయాయి. ఇక ఆగలేమంటూ అవిశ్వాసాలకు తెగబడుతున్నారు. విచిత్రమేంటంటే ఈ అవిశ్వాసాలను టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులే ప్రోత్సహించడం విశేషం.

తెలంగాణ మున్సిపాలిటీలు - పంచాయతీల్లో ఇప్పుడు కొత్త పంచాయతీ మొదలైంది. 4 ఏళ్లుగా అధికారంలో ఉన్న మున్సిపల్ చైర్మన్ - ఎంపీపీలపై అవిశ్వాస తీర్మానాలకు పెద్ద ఎత్తున నోటీసులు అందిస్తున్నారు. ఈ నోటీసులను స్వయంగా అధికార టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులే దగ్గరుండి మరీ అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు.

నాలుగేళ్లు పూర్తయ్యాయి. గెలిచిన టీఆర్ ఎస్ కౌన్సిలర్లు - ఎంపీటీసీలు సహా అసంతృప్తితో ఉన్న వారందరూ ఇప్పుడు తమకు కాంట్రాక్టులు - పనులు ఇవ్వడం లేదని.. వచ్చే ఎన్నికల్లో ఆర్థికంగా ఎలా ముందుకెళ్లాలని తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. అధికారంలో ఉన్న చైర్మన్లు - ఎంపీపీలు తమకు ఏం చేయలేదనే భావన వారిని వెంటాడుతోంది. అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు మున్సిపాల్టీలు - ప్రజాపరిషత్ - పంచాయతీల్లో అవిశ్వాసాలకు తెరలేచింది.

నాలుగేళ్ల పాలన సరిగా చేయలేని వారిని టీఆర్ ఎస్ నాయకులే తొలగించాలని ప్లాన్ చేస్తున్నారు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని.. ఎవరైతే తమ ఆర్థిక అవసరాలు తీరుస్తారో.. ముట్టజెప్పుతారో వారికే మద్దతు ఇస్తామని క్యాంపులు పెడుతున్నారు. ఉద్యమకారులు పదవులు - ప్రయోజనాల కోసం కొట్టుకోవడం.. దానికి స్థానిక టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు కూడా సహకరించడం హాట్ టాపిక్ గా మారింది.