Begin typing your search above and press return to search.

గులాబీ పార్టీలో అసంతృప్తి కార‌ణాలేంటి?

By:  Tupaki Desk   |   10 July 2018 7:09 AM GMT
గులాబీ పార్టీలో అసంతృప్తి కార‌ణాలేంటి?
X
గులాబీ పార్టీలో ముసలం రానుందా... అంటే అవుననే అంటున్నారు రాజ‌కీయ పండితులు. 2014 సంవ‌త్స‌రంలో భారీ మెజారిటీ తో విజయం సాధించి అందలం ఎక్కిన టీఆర్‌ ఎస్ పార్టీకి అసమ్మతి సెగ తగులుతోంది. టిఆర్ ఎస్ పార్టీ అధికారంలో ఉన్న మున్సీపాల్టీలలో ఆ పార్టీ కౌన్సెల‌ర్‌ లు అవిశ్వాం ప్రతిపాదిస్తున్నారు. ఆ పార్టీ కి చెందిన కౌన్సిలర్లు - కార్పొరేటర్లు అసంత్ర‌ప్తి, ఆవేద‌న‌తో రగలిపోతున్నారు. ఇప్పటికే భువనగిరి - బెల్లంపల్లి - బోధన్ తో పాటు మరికొన్ని మున్సిపాల్టీలలో అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. మిగతా జిల్లాలకు కూడా ఈ అసమ్మతి సెగ పాకినట్లు సమాచారం. ఆయా జల్లాలోని కార్పొరేష‌న్లు - మరి మిగతా మున్సిపాల్టీల్లో కూడా అవిశ్వానికి రంగం సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం.

టీఆర్‌ ఎస్ పార్టీలో క్రమశిక్షణ‌ పూర్తిగా లోపించిందని, పదవి ఉన్నప్పటికీ ఎటువంటి అధికారాలు లేవని తెలంగాణ ఆర్టీసీ చైర్మ‌న్ సోమారపు సత్యనారయణ మండిపడ్డారు. ఎవరు అడ్డువచ్చిన అవిశ్వాసం ఆగదని ఆయన అన్నారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో అధిక శాతం మంది కాంగ్రెస్ - టిడిపి - బిజేపి ఓటు బ్యాంకుతో గెలిచి ఆ త‌ర్వాత టిఆర్‌ ఎస్‌ లో చేరారు. టిఆర్‌ ఎస్ కు పెద్దగా మెజారిటి దక్కలేదు.

ప్రస్తుతం ప‌లు జిల్లాలలోని ఎంఎల్‌ ఎలకు - మేయర్లు - కార్పొరేటర్లకు మ‌ధ్య విబేధలు రావడంతో ఈ పరిస్థితి నెలకొందని సమాచారం. పార్టీ అధిష్టానం మాత్రం అస‌మ్మ‌తుల‌కు అనుమతించటంలేదు. తన సొంత పార్టీ నేతలపైన అవిశ్వానికి అనుమతించవద్దని నాయకులకు సూచించినట్టు సమాచారం. మ‌రోవైపు సీనియ‌ర్ నాయ‌కుడు - రాజ్యసభ సభ్యుడు డీ. శ్రీనివాస్ కూడా పార్టీ ప‌ట్ల అసంత్ర‌ప్తితో ఉన్నారు. కాంగ్రెస్‌ లోకి మారాలంటూ కార్య‌క‌ర్త‌లు ఆయ‌నపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే కంగారు ప‌డ‌వ‌ద్ద‌ని ముఖ్యమంత్రి నిర్ణయం కోసం వేచి చూడాలని శ్రీనివాస్‌ అనుచరులకు చెప్పారు. నిజామాబాద్‌కు చెందిన కొందరి ముఖ్యనేతలతో ఆయన రహస్యంగా సమావేసమైనట్టు తెలిసింది. నిజామాబాద్ కు చెందిన టిఆర్‌ ఎస్ నాయకులు డీఎస్ పై అధిష్టానికి లేఖ రాసారు. ఒక వేళ ఆ లేఖ ఆధారంగా తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే - అప్పుడు కాంగ్రెస్ గూటికి చేరాలని ఆయన తన అనుచరులతో అన్నట్టు సమాచారం.

చాలా జిల్లాల్లో శాస‌న‌స‌భ్యులు అసంత్ర‌ప్తితో ఉన్న‌ట్లు స‌మాచారం. త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌ర్వే పేరుతో త‌మ‌పై నిఘా ఏర్పాటు చేయ‌డాన్ని వారు త‌ట్టుకోలేక‌పోతున్నారు. అలాగే కెసీఆర్ కుటుంబ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని, దీంతో ముందే స‌ర్దుకుంటే మేల‌నే అలోచ‌న‌లో కొంద‌రు ఎమ్మెల్యేలున్నార‌ని అంటున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్‌ - తెలుగుదేశం పార్టీలు క‌లుస్తాయ‌ని ఉహాగానాలు వ‌స్తున్న నేప‌థ్యంలో ముందుగా మేలుకొంటే మంచిద‌ని వారు భావిస్తున్న‌ట్లు స‌మాచారం.