Begin typing your search above and press return to search.

అక్కడ ఫుల్ సైలెంట్ : టీయారెస్ ఎంపీలు ఇంతేనా...?

By:  Tupaki Desk   |   19 Aug 2022 2:30 AM GMT
అక్కడ ఫుల్ సైలెంట్ : టీయారెస్ ఎంపీలు ఇంతేనా...?
X
చట్ట సభలకు వెళ్ళే భాగ్యం ఏ కోటి మందిలో ఎవరో ఒకరికి దక్కుతుంది. అలాంటి గోల్డెన్ చాన్స్ దక్కించుకున్న వారు అక్కడ పెదవి విప్పాలి. పదవికి న్యాయం చేయాలి. కోటానుకోట్ల మంది జనం బాధను చట్ట సభలో గట్టిగా వినిపించాలి. కానీ అలా జరుగుతోందా అంటే లేదు అనే చేదు జవాబు వస్తోంది. లోక్ సభ సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. ఇక రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్షంగా సాగుతుంది.

ఇక పెద్దల సభలో అడుగుపెట్టే వారు ఎంతో బాధ్యతగా ఉండాలి. వారు వివిధ రంగాలలో నిష్ణాతులు అని నమ్మే సభకు పంపిస్తారు. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో టీయారెస్ నుంచి కొత్తగా ఎంపిక అయిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఒక్కటి అంటే ఒక్క ప్రశ్న కూడా వేయలేదని చెబుతున్నారు.

వారు అలా సభకు వెళ్ళి ఇలా వచ్చేశారు అని అంటున్నారు. దీని మీద నెటిజన్ల కామెంట్ ఎలా ఉంది అంటే వెళ్ళామా వచ్చామా అన్నట్లుగా అని అంటున్నారు. ఇక ఇదే సభలో బీజేపీ తరఫున యూపీ కోటాలో రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక అయిన లక్ష్మణ్ అయితే ఏకంగా ఇరవై ఆరు ప్రశ్నలను వేసి శభాష్ అనిపించుకున్నారుట. ఆయన తొలి ప్రయత్నంలోనే ఇన్నేసి ప్రశ్నలు వేయడం అంటే ఇక రానున్న ఆరేళ్ళలో ఇరగదీస్తారేమో చూడాలి అంటున్నారు.

ఇక టీయారెస్ లో సీనియర్ రాజ్యసభ సభ్యుడు కూడా ఒకరు ఉన్నారు. ఆయనే సంతోష్. ఆయన నెగ్గి చాలా కాలం అయినా ముచ్చటగా మూడు ప్రశ్నలు కూడా సభలో వేయలేదుట.

మూడు అయితే అసలు బాగుండదు అనుకున్నారేమో రెండంటే రెండు ప్రశ్నలు అడిగేసి మమ అనిపించేశారుట. నాటి నుంచి నేటి వరకూ మళ్ళీ ఆయన కొత్తగా ప్రశ్న అడిగిన పాపాన పోలేదని అంటున్నారు. అంటే మన ఎంపీలు తెలంగాణా సమాజం గురించి ఇంతటి బాధ్యతగా ఉంటున్నారా అని నెటిజన్లే కామెంట్స్ చేస్తున్నారు.

అందునా అధికార పార్టీకి చెందిన ఎంపీలు. కేంద్రంతో లడాయి పెట్టుకుంటున్న టీయారెస్ కి చెందిన వారు అంత గప్ చుప్ గా ఎలా ఉంటున్నారు అన్నదే చిత్రంగా ఉంది అంటున్నారు. మరి తొలి సమావేశాలు కాబట్టి జాగ్రత్తగా అన్నీ గమనించి ఊరుకుంటున్నారా రెండవ సమావేశాలలో ఏమైనా గట్టిగా నిగ్గదీసి ప్రశ్నలు అడుగుతారా అన్నది చూడాలి. అడగకపోతే మాత్రం నెట్టింట కడిగేయడానికి నెటిజన్లు సిద్ధంగా ఉన్నారు మరి. సో ఎంపీలు ఫుల్ సైలెంట్ వద్దు, నోరు విప్పండి అంటున్నారు జనాలు.