Begin typing your search above and press return to search.

సాగ‌ర్‌పై టీఆర్ ఎస్.. `కొడంగ‌ల్` అస్త్రం..!

By:  Tupaki Desk   |   15 April 2021 3:41 AM GMT
సాగ‌ర్‌పై టీఆర్ ఎస్.. `కొడంగ‌ల్` అస్త్రం..!
X
ఈ నెల 17న అంటే.. మ‌రో రెండు రోజుల్లో తెలంగాణ‌లోని నాగార్జున సాగ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. 2018లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి మాజీ క‌మ్యూనిస్టు.. నోముల న‌ర‌సిం హ‌య్య హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. దీంతో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఇది టీఆర్ ఎస్‌కు సిట్టింగ్ సీటు కావ‌డంతో గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో నేత‌లు ఉన్నారు. వాస్తవానికి ఇలాంటి సంద‌ర్భాల్లో.. గ‌తంలో ఇత‌ర పార్టీలు పోటీకి దూరంగా ఉండేవి. అయితే,, రానురాను ఇలాంటి సంప్ర‌దాయాల‌కు మంగ‌ళం పాడారు. దీంతో ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పోటీ జ‌రుగుతోంది.

ఇక‌, ఇప్పుడు ఇక్క‌డ సాధార‌ణ పోటీ కాకుండా.. టీఆర్ ఎస్‌-కాంగ్రెస్ మ‌ధ్య భారీ ఎత్తున పోటీ జ‌రుగుతోం ది. కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి జానా రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో ఆయ‌నకు సింప‌తీ పెరుగుతోంది. పైగా.. టీఆర్ ఎస్ నుంచి నోముల ‌కుమారుడు రంగంలోకి దిగారు. ఆయ‌న‌కు అనుభ‌వం లేక‌పోవ‌డంతో మెజారిటీ ప్ర‌జ‌లు.. జానా వైపు ఉన్నార‌నే స‌ర్వేలు వెల్ల‌డిస్తున్నాయి. దీంతో అలెర్ట‌యిన‌.. టీఆర్ఎస్ నేత‌లు.. భారీ ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఎక్క‌డో తేడా కొడుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికే రెండు కీల‌క ఎన్నిక‌ల్లో(దుబ్బాక ఉప పోరు-గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్‌) పార్టీకి చేదు అనుభ‌వాలు ఎదుర‌య్యాయి.

ఈ నేప‌థ్యంలో టీఆర్ ఎస్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ హ‌వా స‌న్న‌గిల్లింద‌నే విశ్లేష‌ణ‌లు సైతం వ‌స్తున్నాయి. ఈ ప‌రిణామాల‌ను అంచ‌నా వేసుకున్న టీఆర్ ఎస్ అధినేత‌లు.. గ‌త 2018లో కొడం గ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో అనుస‌రించిన వ్యూహాన్నే సాగ‌ర్‌లోనూ అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. అక్క‌డ ఏం జ‌రిగిందంటే.. కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్ నేత‌ రేవంత్‌రెడ్డి పోటీ చేశారు. అయితే.. ఆయ‌న గెలుపున‌కు ఎడ్జ్ ఉంద‌ని అంచ‌నాలు రావ‌డంతో టీఆర్ ఎస్ అలెర్ట‌యింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను నిలువ‌రించేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసింది.

టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ భారీ ఎత్తున స‌భ పెడుతున్నారంటూ.. ఎన్నిక‌ల‌కు రెండు రోజుల ముందు హ‌డావుడి చేసి.. అప్ప‌టి ప్ర‌త్య‌ర్థి నేతల‌ను ఆ ఖ‌రుకు.. రేవంత్‌రెడ్డిని సైతం రాత్రికి రాత్రి అరెస్టులు చేయించారు. ఈక్ర‌మంలోనే ఓట‌ర్ల‌కు న‌గ‌దు పంపిణీ చేశార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో అత్యంత కీల‌క‌మైన కొడంగ‌ల్‌లో సైతం కేసీఆర్ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంది. అంటే.. తాము గెలుస్తామా? లేదా? అనే సందేహం ఉన్న నియోజ‌క‌వ‌ర్గంపై టీఆర్ ఎస్ అనుస‌రించే వ్యూహం అన్న‌మాట‌. ఇప్పుడు కూడా సాగ‌ర్‌లో ఇలాంటి వ్యూహ‌మే అమ‌లు చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

ఇక్క‌డ కాంగ్రెస్ గెలిచే అవ‌కాశాలే ఎక్కువ ఉన్నాయ‌ని కొన్ని స‌ర్వేలు తేల్చ‌డంతో.. ఎక్క‌డిక‌క్క‌డ కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఉప ఎన్నిక పోలింగ్ రెండు రోజులే ఉండ‌టంతో.. ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టే కార్య‌క్ర‌మాలు మొద‌లైన‌ట్టుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో కాంగ్రెస్ కీల‌క నేత‌ల‌ను అదుపులోకి తీసుకోవ‌డం లేదా ఇత‌ర ప్రాంతాల‌కు చెందిన కాంగ్రెస్ నేత‌లు ఇక్క‌డ అడుగు పెట్ట‌కుండా చూడ‌డం లాంటి కార‌ణాల‌తో పోల్ మేనేజ్‌మెంట్‌లో పై చేయి సాధించాల‌ని అధికార పార్టీ చాప‌కింద నీరులా ప్లాన్ చేస్తోంది. దీంతో అటు కాంగ్రెస్ నేత‌లకు ఇప్పుడు కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది.