Begin typing your search above and press return to search.

అన్యాయాన్ని అన్ని వేదికలపై నిలదీస్తాం ... న్యాయ పోరాటమే : సీఎం కేసీఆర్ !

By:  Tupaki Desk   |   17 July 2021 9:46 AM GMT
అన్యాయాన్ని అన్ని వేదికలపై నిలదీస్తాం ... న్యాయ పోరాటమే : సీఎం కేసీఆర్ !
X
కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలు, హక్కులకు ఏమాత్రం భంగం కలిగినా సహించేదే లేదని. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను బోర్డుల అధీనంలోకి తీసుకునేలా కేంద్రం వెలువరించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ పై ఇంజనీర్లు అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్రం హక్కులు, దక్కాల్సిన వాటాల్లో ఎలాంటి అన్యాయం జరిగినా న్యాయ పోరాటం చేస్తాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. రాజ్యాంగ స్ఫూర్తికి, విభజన చట్టానికి భిన్నంగా కృష్ణా, గోదావరి బోర్డులను నోటిఫై చేసి ఉంటే అన్ని వేదికలపై నిలదీయాల్సిందేనని పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

శుక్రవారం ప్రగతి భవన్‌లో టీఆర్‌ ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఇరిగేషన్‌ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ కుమార్, ఈఎన్‌ సీ మురళీధర్‌ కూడా హాజరైన ఈ సమావేశంలో కృష్ణా జలాలు, బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్, పార్లమెంట్‌ లో లేవనెత్తాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్‌ పలు సూచనలు చేశారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయంపై పార్లమెంట్‌ లో గట్టిగా తమ వాణిని వినిపించాలని ఎంపీలను ఆదేశించారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరిపే వరకు కొట్లాడాలని సూచించారు.

కృష్ణా జలాల్లో తెలంగాణకు తొలి నుంచీ అన్యాయం జరిగిందని.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ గొంతును వినిపించే అవకాశం లేక న్యాయం జరగలేదని, ఇప్పుడు న్యాయం చేయాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నట్టు తెలిసింది. జల వివాదాలు తలెత్తినప్పుడు కేంద్రం ఇరు రాష్ట్రాలను కూర్చోబెట్టి మధ్యవర్తిత్వం చేయాల్సిందిపోయి చోద్యం చూస్తూ కూర్చుందని, అందుకే సమస్యలు జటిలం అవుతున్నాయని వ్యాఖ్యానించినట్టు సమాచారం. కృష్ణా నీళ్లను వాడుకునేలా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ చేస్తున్న ఆరోపణలు, శ్రీశైలంలో విద్యుదుత్పత్తి విషయంగా తెలంగాణపై చేసిన ఫిర్యాదులపై సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి.

రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన వాటాల్లోంచే నీటిని వినియోగించుకుంటున్నాం. అదనంగా ఒక్క చుక్క నీటిని వాడుకోవడం లేదు. దుర్వినియోగం చేయడం లేదు. తెలంగాణ అక్రమంగా నీటిని వినియోగిస్తోందన్న వాదన అబద్ధం. సాగునీటి ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్‌ కోసమే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేస్తున్నాం. ఎత్తిపోతల పథకాలు నడపాలన్నా, సాగుకు నీరు అందించాలన్నా హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టుల నుంచి పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేయడం తప్ప మార్గం లేదు. కానీ ఈ అంశాన్ని వక్రీకరించి తెలంగాణను బద్నాం చేస్తున్నారు..అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నట్టు వెల్లడించాయి. అదనంగా నీటిని వాడుకునేలా కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారనే అభిప్రాయం తప్పు అని.. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోల ఆధారంగానే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామన్న అంశాన్ని తెలియజెప్పాలని ఎంపీలకు కేసీఆర్‌ సూచించినట్టు సమాచారం. పార్లమెంట్‌ సమావేశాలు మొదలయ్యాక మూడు, నాలుగు రోజుల్లో ఢిల్లీకి వస్తానని.. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తానని ఎంపీలకు చెప్పినట్టు సమాచారం. కేంద్రం ఖరారు చేసిన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి అంశంపైనా కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు సీఎం కేసీఆర్‌. జల వివాదం విషయంలో పార్లమెంట్‌ లో ఎలా ముందుకు వెళ్లాలనే దానికిపై టీఆర్‌ఎస్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కాగా… అటు ఏపీ తరపున పార్లమెంట్‌ లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై వైసీపీ యోచిస్తోన్న సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కృష్ణా,గోదావరి నదీ జలాల బోర్డుల పరిధి, నిర్వహణపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ప్రకారం రెండు రాష్ట్రాల్లో ఈ నదులపై చేపట్టిన ప్రాజెక్టులు,విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి వెళ్తాయి.నీటి కేటాయింపులు,విద్యుత్ ఉత్పత్తిని బోర్డులే నియంత్రిస్తాయి. బోర్డుల నిర్వహణ వ్యయాన్ని రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది.గెజిట్ విడుదలైన రెండు నెలల్లో ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు చొప్పున రెండు రాష్ట్రాలు డిపాజిట్ చేయాలి. అనుమతులు లేకుండా చేపట్టిన ప్రాజెక్టులకు ఆర్నెళ్ల లోగా అన్ని అనుమతులు తీసుకోవాలి. ప్రాజెక్టులన్నీ బోర్డుల పరిధిలోకి వెళ్లడంతో నీటి కేటాయింపులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.