Begin typing your search above and press return to search.

లిస్టులో ప‌ట్నం ఒక్క‌రే!..మిగిలిన ఇద్ద‌రూ కొత్తొళ్లే!

By:  Tupaki Desk   |   12 May 2019 5:07 PM GMT
లిస్టులో ప‌ట్నం ఒక్క‌రే!..మిగిలిన ఇద్ద‌రూ కొత్తొళ్లే!
X
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించి టీఆర్ ఎస్ జాబితాపై నెల‌కొన్న ఆస‌క్తికి టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు తెర దించేశారు. మూడు స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసిన కేసీఆర్‌... గ‌డ‌చిన నాలుగైదు రోజులుగా కొన‌సాగుతున్న స‌స్పెన్స్‌ కు తెర దించేశారు. ఈ మూడు స్థానాల‌కు ఎవ‌రిని ఎంపిక చేస్తార‌న్న అంశంపై టీఆర్ ఎస్ నేత‌లు ఆస‌క్తిగా ఎదురు చూశారు. మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలై - నిన్న‌టి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో టికెట్ల ద‌క్క‌ని సీనియ‌ర్లు ఎమ్మెల్సీ అవ‌కాశంపై గంపెడాశ‌లు పెట్టుకున్నార‌నే చెప్పాలి.

అయితే ఏ ఒక్క‌రూ ఊహించ‌ని విధంగా వ్య‌వ‌హారాన్ని న‌డిపిన కేసీఆర్‌... అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ సీనియ‌ర్ల‌లో ఒక్క‌రికి మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పించి మిగిలిన రెండు సీట్ల‌ను కొత్త నేత‌ల‌కు ఇచ్చి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. ఇక మూడు ఎమ్మెల్సీ టికెట్లు ఎవ‌రికి ద‌క్కాయ‌న్న విష‌యానికి వ‌స్తే.. రంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పట్నం మహేందర్ రెడ్డిని ఖరారు చేసిన కేసీఆర్‌... నల్గొండ నియోజకవర్గ అభ్యర్థిగా తేరా చిన్నప రెడ్డిని - వరంగల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస రెడ్డిని ఖరారు చేశారు.

ఇదిలా ఉంటే... ఈ మూడు సీట్ల‌లో మాజీ మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు - అజ్మీరా చందూలాల్ - జూపల్లి కష్ణారావు - నాయిని న‌ర్సింహారెడ్డిల‌కు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని - వీరిలో ఎవ‌రినో ఒక‌రిని ప‌క్క‌న‌పెట్టేసి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి చోటు ద‌క్కుతుంద‌ని అంతా ఆశించారు. అయితే ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి ఒక్క‌రికే అవ‌కాశం క‌ల్పించిన కేసీఆర్‌.. తుమ్మ‌ల‌ - చందూలాల్‌ - జూప‌ల్లి - నాయినిల‌ను ప‌క్క‌న‌పెట్టేశారు. మొత్తంగా ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక‌లో కేసీఆర్ త‌న‌దైన మార్కును చూపార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి తుమ్మ‌ల‌ - చందూలాల్‌ - జూప‌ల్లి - నాయినిల‌కు ఏ త‌ర‌హా అవ‌కాశాలు ద‌క్కుతాయన్న అంశంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసింద‌నే చెప్పాలి.