Begin typing your search above and press return to search.

గులాబీ కంచుకోట‌లో గుచ్చుకుంటున్న ముళ్లు

By:  Tupaki Desk   |   3 Oct 2018 8:12 AM GMT
గులాబీ కంచుకోట‌లో గుచ్చుకుంటున్న ముళ్లు
X
టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌చారానికి నిజామాబాద్ నుంచి ఓ వైపు శంఖారావం పూరిస్తుంటే...గులాబీ పార్టీకి గ‌త ఎన్నిక‌ల్లో రికార్డు స్థాయిలో సీట్లు క‌ట్ట‌బెట్టిన ఈ జిల్లాలో అసంతృప్తులు అధిష్టానానికి చుక్క‌లు చూపిస్తున్నాయని అంటున్నారు. 'ఆశీర్వాద యాత్ర' పేరిట మూడు లక్షల మందితో భారీ బహిరంగ సభ పెట్టేందుకు గులాబీ ద‌ళ‌ప‌తి సిద్ధ‌మ‌వుతున్న‌ప్ప‌టికీ...ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నార‌ని చెప్తున్నారు. నిజామాబాద్‌ రూరల్‌ లో టీడీపీ బలంగా ఉండటం - కీలక సమయంలో డీఎస్‌ - భూపతిరెడ్డి ఝలక్‌ ఇవ్వటంతో బాజిరెడ్డి చెమటోడుస్తున్నాడు. అర్బన్‌ లో స్థానిక నాయకత్వం సహకరించకపోవటంతో గణేష్‌ గుప్తా నెత్తీ నోరూ బాదుకుంటున్నార‌ని అంటున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ లో అంతర్గత పోరు ఎక్కువైంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా ప్రచారానికి కార్పొరేటర్లు - నాయకులు దూరంగా ఉంటున్నారు. స్వయంగా ఎంపీ కవిత రంగంలోకి దిగినప్పటికీ.. పరిస్థితిలో మార్పు రాలేదు. ఆయన వెంట ఒకే ఒక్క కార్పొరేటర్‌ ఉన్నారు. ఎమ్మెల్సీ భూపాల్‌ రెడ్డి కారు దిగి చేయి పట్టుకోవటం - డీఎస్‌ మళ్లీ హస్తంగూటికి చేరనుండటంతో నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో టీఆర్ ఎస్‌ పార్టీ బలహీనంగా మారింది.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా టీఆర్ ఎస్‌ పార్టీ కంచు కోట. గత ఎన్నికల్లో తొమ్మిదికి తొమ్మిది సీట్లనూ కొల్ల‌గొట్టిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఆ కోట క్రమంగా బీటలు వారుతోంద‌ని అంటున్నారు. గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ త‌న‌య కవితమ్మతో పడక ఇప్పటికే ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కారు దిగి హ‌స్తం గూటికి చేరార‌ని టాక్ ఉంది. సీనియ‌ర్ నేత‌ - మాజీ ఎంపీ కూడా డీఎస్‌ కూడా దసరా లోపే మళ్లీ పాతగూటికే చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్‌-టీడీపీ కూటమి కట్టడంతో టీఆర్ ఎస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్‌ చెమటోడుస్తున్నారు. బాల్కొండలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డికి మరోసారి టికెట్‌ కేటాయించడంతో ఆ పార్టీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ జాగృతి నేత సునీల్‌ రెడ్డి రెబల్‌ గా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఒకవేళ ఎన్నికల సమయానికి అభ్యర్థిని మార్చకపోతే మరో పార్టీలో చేరి వేములను ఓడిస్తానని సన్నిహితులతో చర్చించినట్టు సమాచారం. ఎల్లారెడ్డి నియోజకర్గంలో తాజా మాజీ - ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్‌ రెడ్డి అంతర్గతపోరుతో సతమతమవుతున్నారు. 2014లో టికెట్‌ దక్కుతుందనే ఆశతో జనార్ధన్‌ రెడ్డి కాంగ్రెస్‌ కు చేయిచ్చి కారెక్కగా...అప్పుడు అతనికి రాశే ఎదురైంది. ఈసారి టికెట్‌ దక్కపోవటంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. టికెట్‌ కోసం నేటికీ అధిష్టానం వద్ద పైరవీలు చేస్తూనే చివరకు స్వతంత్రంగా బరిలోకి దిగేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

బోధన్‌ లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే షకీల్‌ కు సీటు కేటాయించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతు న్నది. వంద రోజుల్లో చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తామన్న హామీని నేటికీ నెరవేర్చకపోవటంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అడుగడుగునా షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపించకపోవటంపై వస్తున్న వ్యతిరేకతతో షకీల్‌ అల్లాడుతున్నాడు. దీనికితోడు ఎమ్మెల్యే అనుచరుల వివాదాలు - బోధన్‌ లో చోటుచేసుకున్న కోట్లాది అక్రమ రిజిస్ట్రేషన్‌ కుంభకోణం షకీల్‌ మెడకు చుట్టుకోనుందనే టాక్ ఉంది. బాన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి కుమారులపై ప్రజల్లోనూ - పార్టీలోనూ కొంత వ్యతిరేకత ఉందంటున్నారు. ఆర్మూర్‌ లో మరోసారి ఆశన్నగారి జీవన్‌ రెడ్డికి టిక్కెట్టు కేటాయించడంతో దళిత సంఘాలు గుర్రుగా ఉన్నాయి. తలారి సత్యం - చేపూరి రవి రోడ్డు ప్రమాద ఘటనలో జీవన్‌ రెడ్డి అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. పైగా కొన్నినెలల కిందట 'జీవన్‌ రెడ్డి మా ఊరికి రావొద్దు' అంటూ మాక్లూర్‌ మండల ప్రజలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సురేష్‌ రెడ్డి పార్టీలో చేరడం కొంత బలాన్నిచ్చినట్టయింది. మొత్తంగా జిల్లాలోని దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇలాంటి ప‌రిస్థితి ఉన్నందుకే టీఆర్ ఎస్‌ అధినేత - ఆపద్ధర్మ సీఎం కే.చంద్రశేఖర్‌ రావు 'కారు' రిపేరును ఇందూరు జిల్లా నుంచి ప్రారంభించినట్టు చ‌ర్చిస్తున్నారు. పార్టీని వీడితే నష్టపోతామన్న పరోక్ష సందేశాన్ని రెబల్‌ అభ్యర్థులకు ఇచ్చేలా ఈ భారీ స‌భ ఏర్పాటు చేసిన‌ట్లు చెప్తున్నారు.