Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ కు మ‌రో గుడ్ న్యూస్‌

By:  Tupaki Desk   |   15 Jun 2016 9:15 AM GMT
టీఆర్ ఎస్‌ కు మ‌రో గుడ్ న్యూస్‌
X
తెలంగాణ‌లో ప్ర‌స్తుతం టీఆర్ ఎస్ దూకుడు ఎలా ఉందంటే ఎక్క‌డ ఎన్నికలు వ‌స్తాయా అని కాచుకుని కూర్చున్న‌ట్లుంది. ఏ పార్టీకి అయినా ఎన్నిక‌లంటే ఎంతోకొంత ఆందోళ‌న ఉంటుంది. కానీ టీఆర్ ఎస్‌ కు ఇప్పుడు ఎన్ని ఎన్నిక‌లు వ‌స్తే అంత మంచిది అన్న‌ట్టుగా ఉంది. సాధార‌ణ ఎన్నిక‌ల త‌ర్వాత టీఆర్ ఎస్ స‌ర్కార్ ఒక్క న‌ల్గొండ ఎమ్మెల్సీ స్థానం మిన‌హా అన్ని ఎన్నిక‌ల్లోను విజ‌యం సాధించింది. వేరే పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మృతిచెందిన నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా టీఆర్ ఎస్ ఘ‌నవిజ‌యం సాధించి స‌త్తా చాటింది.

ఇదిలా ఉంటే తెలంగాణ‌లో రెండు లోక్‌ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు వ‌స్తాయ‌న్న చ‌ర్చ‌లు ఇప్పుడు జోరుగా జ‌రుగుతున్నాయి. తెలంగాణ ప్ర‌భుత్వం కొలువుదీరాక తెలంగాణ‌లో మెద‌క్‌ - వ‌రంగ‌ల్ లోక్‌ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు రాగా రెండు చోట్ల టీఆర్ ఎస్ తిరుగులేని ఘ‌న‌విజ‌యం సాధించింది. ఈ విజ‌యాల‌కు ప్ర‌త్య‌ర్థుల‌కు దిమ్మ‌తిరిగి పోయి మైండ్ బ్లాక్ అయ్యింది.

ఇక జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో సైతం టీఆర్ ఎస్ ఇదే దూకుడు కొన‌సాగింది. ఇక మ‌రో రెండు లోక్‌ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు వ‌స్తాయ‌న్న వార్త‌ల నేప‌థ్యంలో టీఆర్ ఎస్ ఈ రెండు ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనేందుకు చాలా ఉత్సాహంగా ఉంది. ఉప ఎన్నిక‌ల్లో వ‌స్తున్న భారీ మెజార్టీని ఎర‌గా చూపుతూ ఇత‌ర పార్టీల నాయ‌కుల‌ను చాలా సులువుగా త‌మ పార్టీలో చేర్చేసుకుంటోంది టీఆర్ ఎస్‌. ఇక తెలంగాణ‌లో మ‌ల్కాజ్‌ గిరి టీడీపీ ఎంపీ మ‌ల్లారెడ్డి - న‌ల్గొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్‌ రెడ్డి ఇద్ద‌రూ టీఆర్ ఎస్‌ లో చేరిపోయారు.

వీరిద్ద‌రితోను రాజీనామాలు చేయించి మ‌ళ్లీ ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని టీఆర్ ఎస్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌ల్లారెడ్డి ఎలా ఉన్నా గుత్తా తాను ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని కేసీఆర్‌ కు చెప్ప‌గా ఆయ‌న టైం వ‌చ్చిన‌ప్పుడు తానే చెపుతాన‌ని అప్పుడు రాజీనామా చేయాల‌ని అన్న‌ట్టు తెలుస్తోంది. గుత్తా రాష్ర్ట కేబినెట్‌ లోకి రావాల‌న్న కోరిక కేసీఆర్‌ కు తెల‌ప‌గా ఆయ‌న కొద్ది రోజుల త‌ర్వాత ఆయ‌న్ను ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌న్న‌ట్టు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. అప్పుడైనా గుత్తా త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయాల్సిందే. ఈ ప్ర‌క్రియ వ‌చ్చే నాలుగైదు నెల‌ల్లోనే జ‌రిగే ఛాన్సులు ఉన్నాయి. అదే టైంలో మ‌ల్లారెడ్డితో కూడా రాజీనామా చేయించి మ‌రోసారి ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లి భారీ మెజార్టీతో విజ‌యం సాధించి...వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల టైంకు ప్ర‌త్య‌ర్థుల‌ను మాన‌సికంగా మ‌రింత దెబ్బ‌కొట్టేందుకు కేసీఆర్ ప్లాన్ వేస్తున్న‌ట్టు స‌మాచారం.