Begin typing your search above and press return to search.

టీఆరెస్ మేడిపండా?

By:  Tupaki Desk   |   10 March 2016 5:30 PM GMT
టీఆరెస్ మేడిపండా?
X
పెరుగుట విరుగుట కొరకే అన్నారు.... అయితే, ఇది అన్నివిషయాలకు, అన్ని సందర్భాలకు వర్తించకపోవచ్చు కానీ అత్యధిక అంశాల్లో మాత్రం కచ్చితంగా వర్తిస్తుంది. నిర్మాణాత్మకంగా పెరిగితే ఏదైనా పదికాలాల పాటు నిలుస్తుంది.. అలా కానప్పుడు పెరిగినంత వేగంగానే తరిగిపోతుంది. రాజకీయాల్లోనూ అదే సూత్రం వర్తిస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు ఈ సూత్రం బాగా వర్తిస్తుంది. ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ నిర్మించుకున్న జాతీయ పార్టీలు మధ్యమధ్యలో కుదుపులకు లోనైనా కూడా తట్టుకుని నిలుస్తున్నాయి... పూర్తిగా పడిపోయినా ఫినిక్స్ పక్షిలా మళ్లీ లేస్తున్నాయి. కానీ, ప్రాంతీయ పార్టీలు మాత్రం కొన్నే దీర్ఘకాలం మనగలుగుతున్నాయి. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదన్న సత్యం పార్టీలకు, వాటి గెలుపోటములకు వర్తిస్తుంది.

తెలుగువారి ఆత్మగౌరవం పేరిట నందమూరి తారకరామారావు 34 ఏళ్ళ క్రితం నెలకొల్పిన తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లోనే పెను సంచలనం. చరిత్ర సృష్టించింది. అలాంటి పార్టీ కూడా అనంతర కాలంలో ఓటమి చవిచూసింది. అంతేకాదు... విభజన తరువాత తెలంగాణలో నానా పాట్లు పడుతోంది. 1982లో టీడీపీ ఆవిర్భావానికి ముందు దేశంలో నాలుగు ప్రాంతీయ పార్టీలుండేవి. డీఎంకే - అన్నాడీఎంకే - జమ్మూకాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ - జార్ఖండ్ ముక్తి మోర్చాలు ఉండేవి. టీడీపీ ఆవిర్భావం తరువాత 1982 నుంచి ఇప్పటివరకు 50కి పైగా కొత్త ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చి ఉనికిలోకివచ్చాయి. వీటిలో 27 పార్టీలు ఇప్పటికే ఎన్నికల సంఘం గుర్తింపు పొంది దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతూ అన్ని రకాల ఎన్నికల్లో జాతీయ పార్టీలతో తలపడుతున్నాయి. మూడున్నర దశాబ్దాల క్రితం రెండంటే రెండే జాతీయ పార్టీలతో విసిగి వేసారిపోయిన జాతి జనులకు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలు మంచి అవకాశమే అయినా నిలకడలేమి... దుందుడుకు విధానాల వల్ల స్వీయపతన ప్రమాదం వాటికి ఉంది. అస్సాంలో అస్సాం గణపరిషత్ వంటి పార్టీలు దీనికి ఉదాహరణ.

ప్రస్తుతం తెలంగాణలో ఉద్యమ పార్టీ నుంచి అధికార పార్టీగా మారిన టీఆరెస్ అప్రతిహత విజయాలతో దేశాన్నే ఆశ్చర్యపరుస్తోంది. కానీ... ఈ క్రమంలో ఆ పార్టీ విధానాలు కొన్ని రాజకీయ పండితుల్లో భయాలను కలిగిస్తున్నాయి. జాతీయ పార్టీలకుగట్టి ప్రత్యామ్నాయం కాగలదని ఆశిస్తున్నా ఇలాంటి విధానాల వల్ల మనుగడ కష్టమన్న భయాన్ని వ్యక్తంచేస్తున్నారు.

పాలనలో సరికొత్త విధానాలు, మంచిమంచి పథకాలతో ముందుకెళ్తున్నా అంతా ఏకపక్షంగా ఉండడమన్నది ఏమాత్రం మంచిది కాదని వినిపిస్తోంది. ప్రతిపక్ష సభ్యులను మొత్తం తన పక్షంలో కలుపుకోవడం... రానివారిని కూడా తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడం... ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాను మేనేజ్ చేసి ''ఫీల్ గుడ్'' ఫ్యాక్టర్ తో పాలన సాగించడం దెబ్బతీస్తుందన్న వాదన వినిపిస్తోంది. వ్యాధి లక్షణం కనిపిస్తేనే చికిత్స చేసి శరీరాన్ని కాపాడుకోగలం... కానీ, వ్యాధి లక్షణం కనిపించకపోయినా... డయాగ్నసిస్ చేసి చెప్పేవారు లేకపోయినా అది ప్రమాదమే. వ్యాధి ముదిరి ప్రాణాలకే ముప్పు వస్తుంది. ఇప్పుడు తెలంగాణలో టీఆరెస్ అలాంటి ప్రమాదపుటంచుల్లోనే ఉంది. పాలనలో లోపాలు సహజం... ఆ లోపాలు అక్కడక్కడా కనిపిస్తున్నా చెప్పేవారే కరవవుతున్నారు.. దీంతో అంతా బాగుందన్నట్లుగా ఉన్నా అది మున్ముందు ఒక్కసారి దెబ్బతీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలే ఉండరాదన్నలక్ష్యంతో ఆకర్షణల వల వేసి అందరినీ పార్టీలో కలుపుకోవడం కూడా భవిష్యత్తులో అసమ్మతికి దారితీసే అవకాశాలే ఎక్కువ. ఎమ్మెల్సీ ఎన్నికలు - వరంగల్ ఉప ఎన్నిక - గ్రేటర్ ఎన్నికలు - నారాయణ్‌ ఖేడ్ ఉప ఎన్నిక... తాజాగా ఖమ్మం - వరంగల్ కార్పొరేషన్లు - అచ్చంపేటలోనూ టీఆరెస్ ఘన విజయాన్ని ఏమాత్రం తక్కువ చేసి చూడలేం. కానీ... ఆ విజయాలను సుస్థిరం చేసుకోవాలంటే పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రజా సంక్షేమం కూడా అవసరం.. కేసీఆర్ ను ఈ విషయంలోనూ మెచ్చుకోవాల్సిందే. పలు సంక్షేమ పథకాలను పెట్టి ఆయన ఆదరణ పొందుతున్నారు. కానీ, వాస్తవంగా వాటి అమలు ఎలా ఉందన్న విషయానికొస్తే మాత్రం మళ్లీ డొల్లే.

ఉదాహరణకు తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని తీసుకుంటే.. ఇంతవరకు ఎక్కడా లేనంత గొప్ప గృహ నిర్మాణ పథకమది. కానీ... ఈ పథకంలో నిర్మిస్తున్నవి సుమారు లక్ష ఇళ్లు... ఇళ్లు అవసరమైనవారు అంతకు 20 రెట్లకు పైగా ఉన్నారు. వారందరికీ దీని ద్వారా లబ్ధి కలగడం అసాధ్యం. మరోవైపు ఈ దిశగా పనులూ వేగం కాలేదు. ఇప్పటికి రెండు చోట్ల మాత్రమే ఇళ్ల నిర్మాణం మొదలైంది. కానీ, ఈ విషయాలేవీ ప్రజలకు తెలియవు. కారణం.. మీడియా. కేసీఆర్ కు వ్యతిరేకంగా కానీ, టీఆరెస్ చెప్పే అసత్యాలను బయటపెట్టేలా కానీ ఒక్క ముక్క కూడా రాసే పరిస్థితిలో లేదు. దీంతో టీఆరెస్ చెప్పిందే నిజమన్నట్లుగా ఉంది.

అదేసమయంలో కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామంలో పరిస్థితి చూస్తే దయనీయంగా ఉంది. కరీంనగర్ జిల్లా చినముల్కనూరును ఆయన దత్తత తీసుకున్నారు. అక్కడ కొత్తగా ఇళ్లు నిర్మిస్తామని చెప్పి ఉన్న ఇళ్లు తొలగించారు. వారంతా ఇప్పుడు గుడారాల్లో ఉంటున్నారు. ఉన్నదీ ఉంచుకున్నదీ రెండూ పోయినా వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీనిపై ఎక్కడా ఒక్కసారి కూడా మీడియాలో రాలేదు. ఇలాంటివన్నీ ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతాయి. బయటపడడం లేదనుకుని సంతోషిస్తున్నా ఆ వ్యతిరేకత ఎప్పటికైనా కొంపముంచేదే అన్న సత్యం గ్రహించాలి. ఇక నీటి పారుదల పనులు, ఇతర పథకాల్లోనూ అవినీతి, ప్రగతి అన్నీ కూడా చర్చిస్తే మసిపూసి మారేడు కాయ చేస్తున్నారన్న వాదనే వినిపిస్తోంది.

తెలంగాణ పరిణామాలు గురించిన ముచ్చట కనుక కేసీఆర్ ఒక విషయం గుర్తుంచుకోవాలి. సంక్షేమ కార్యక్రమాలు చూసి ఆకర్షితులై వస్తున్నామని చెప్పుకుంటున్న వారిలో అనేకులు అధికారాన్ని చూసివస్తున్నారన్న వాస్తవాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇలా చేరికలతో పెరిగే సంఖ్యాబలం పార్టీ బలోపే తానికి ఉపయోగపడితే సరే. మోయలేని భారంగా మారితే.....అప్పుడేమిటి పరిస్థితి. ప్రజలిచ్చిన పాలనా వ్యవధిలో రెండేళ్ళు చూస్తుండగానే కరిగి పోయాయి. పెట్టుకున్న లక్ష్యాల సాధ నకు మిగిలిన మూడేళ్ల సమయం బొటాబొటిగా కూడా సరిపోకపోవచ్చు. మళ్ళీ అప్పుడు ప్రజల దగ్గరికే పోవాలి. కొత్తగా అరువు తెచ్చుకున్న ఈ ప్రజాప్రతినిధులు అప్పటికి ఎంత బరువుగా మారతారో తెలియదు. ఇప్పుడు పనికి వచ్చిన అవకాశవాద అస్త్రాన్నే అప్పుడు మళ్ళీ ప్రయోగించరన్న గ్యారంటీ ఏమీ లేదు. ముందే చెప్పినట్టు వారికి చలి భయం లేదు. కాబట్టి ఇకనైనా కలలు, కల్పనల నుంచి బయటపడి వాస్తవాల్లోకి వస్తే ప్రజలకు పార్టీలకు మంచిదన్న అభిప్రాయం అనుభవజ్ఙుల నుంచి వినిపిస్తోంది.

స్వతాహాగా ప్రజా సంక్షేమం కోరుకునే కేసీఆర్ రాజకీయ వ్యూహాల్లో చతురుడు, మేధావి. అలాంటి వ్యక్తి ఇలా చిరుగుతున్న చొక్కాను ఓవర్ కోట్ తో మేనేజ్ చేయాలనుకోవడం ఆశ్చర్యకరమే. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను గ్రహించకపోతే ఎన్టీఆర్ వంటి మహా నేతల్లా దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి గులాబీ అధినేత వలసలకు తలపులు, గేట్లు తెరిచినట్లే... విమర్శలకు కూడా చిన్న కిటికీ తెరిస్తే బయట ఎంత కంపు ఉందో తెలుసుకునే వీలు కలుగుతుంది. బయట ఉన్న ఆ దుర్గంధం ఇంటిలోకి వ్యాపించకముందే దాన్ని నివారించి సువాసనలమయం చేసుకునే అవకాశమేర్పడుతుంది.