Begin typing your search above and press return to search.

జానారెడ్డి లేని లోటు టీఆరెస్ కు తెలుస్తోంది!

By:  Tupaki Desk   |   15 Sep 2019 1:30 AM GMT
జానారెడ్డి లేని లోటు టీఆరెస్ కు తెలుస్తోంది!
X
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఏర్పడిన మొట్టమొదటి ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా టీఆరెస్ పాలక పార్టీగా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. అప్పుడు ఆ పార్టీ శాసనసభా పక్ష నేతగా సీనియర్ నేత జానారెడ్డి వ్యవహరించారు. కానీ - గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డి ఓటమి పాలయ్యారు. టీఆరెస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య 7,771 ఓట్ల తేడాతో గెలిచారు. దీంతో జానా రెడ్డి ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయారు. జానా రెడ్డి లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ మల్లు భట్టి విక్రమార్కను శాసనసభా పక్ష నేతగా నియమించింది.

అసెంబ్లీలో జానారెడ్డి కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఉన్నప్పటి తో పోల్చితే ఇప్పుడు పాలక టీఆరెస్ పార్టీ ఆటలు సాగుతున్నట్లుగా లేవు. అందుకు శుక్రవారం నాడు సభలో నెలకొన్న పరిస్థితులే ఉదాహరణ. కాంగ్రెస్ సీఎల్పీ లీడర్‌ గా ఉన్న భట్టి ఈ రోజు బడ్జెట్‌ పై మాట్లాడుతూ నేరుగా సీఎం కేసీఆర్‌ ని నిలదీస్తూ ఉక్కిరిబిక్కిరి చేశారు. భట్టిని ఎదుర్కోవడం కేసీఆర్‌ కు కూడా కష్టమైంది.

గతంలో జానారెడ్డి సీఎల్పీ లీడర్‌ గా ఉన్నప్పుడు కేసీఆర్ సహా టీఆరెస్ నేతలు ఆయన్ను తెలివిగా మేనేజ్ చేసేసేవారు. దాంతో ఆయన స్వయంగా ప్రభుత్వాన్ని ఏమీ అనకపోవడంతో పాటు తమ పార్టీ నేత లెవరైనా నిలదీసినా కూడా వారిని ఆపేసేవారు. సీనియర్ నేతగా పెద్దరికాన్ని కోరుకునే జానారెడ్డిని కేసీఆర్ - ఆ పార్టీ నాయకలు తెలివిగా మేనేజ్ చేసేవారు. ఆయన జోలికి వారు వెళ్లేవారు కాదు.. పైగా అతి వినయం నటించేవారు. ప్రతిపక్ష నేత అయినప్పటికీ ఎంతో సీనియర్ కాబట్టి తాము సైతం గౌరవిస్తున్నామని చెబుతూ... నిత్యం ‘పెద్దలు జానారెడ్డి గారు’ అంటూ ఆయన్ను ప్రశంసల్లో ముంచెత్తేసేవారు.

ఆ ఆనందంలో ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు కాదు. ఈ సంగతి అర్థం చేసకున్న ఇతర కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేసినా ‘‘పద్ధతి పద్ధతి’’ అంటూ జానారెడ్డి సొంత పార్టీ నేతలకే సర్దిచెప్పేవారు. దీంతో కేసీఆర్ తొలి ప్రభుత్వ కాలంలో సభలో టీఆరెస్‌ కు అడ్డే లేకుండా పోయింది. కానీ.. ఇప్పుడు భట్టి పీసీసీ ప్రెసిడెంట్ అయిన తరువాత పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మిగతా రోజుల్లో కేసీఆర్ - టీఆరెస్‌ కు ముళ్ల బాట తప్పదని అర్థమవుతోంది.