Begin typing your search above and press return to search.

మంత్రిని.. కలెక్టర్ ను ఇబ్బంది పెట్టటానికే రోడ్డును తవ్వించా.. టీఆర్ఎస్ నేత ఫోన్ క్లిప్ లీక్

By:  Tupaki Desk   |   11 Sep 2022 4:00 AM GMT
మంత్రిని.. కలెక్టర్ ను ఇబ్బంది పెట్టటానికే రోడ్డును తవ్వించా.. టీఆర్ఎస్ నేత ఫోన్ క్లిప్ లీక్
X
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి సంబంధించిన ఛోటా నేత ఒకరు వ్యవహరించిన తీరు ఇప్పుడు షాక్ కు గురయ్యేలా చేసింది. కరీంనగర్ కు చెందిన గులాబీ నేత.. ఒక వ్యక్తితో మాట్లాడిన వివాదాస్పద ఫోన్ క్లిప్ బయటకు వచ్చి.. వివాదాస్పదంగా మారింది. అతడి తీరు సొంత పార్టీ నేతలు సైతం కన్నెర్ర చేసేలా ఉంది. రాజకీయంగా గొడవలు ఉండొచ్చు కానీ.. సొంత పార్టీకి చెందిన కీలక నేతను ఇబ్బంది పెట్టేలా.. ఉన్నత స్థాయి అధికారికి సమస్యలు క్రియేట్ చేసే తీరును ప్రదర్శించిన అతనిపై తాజాగా కేసు కూడా బుక్ అయ్యింది.

అసలేమైందంటే.. కరీంనగర్ కార్పొరేషన్ కు చెందిన కమల్ జిత్ కౌర్ భర్త సోహన్ సింగ్. టీఆర్ఎస్ పార్టీకిచెందిన ఈ ఛోటా నేతకు చెందిన ఆడియోక్లిప్ ఒకటి బయటకు వచ్చింది. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల విషయంలో ఒక వ్యక్తి సోహన్ సింగ్ తో మాట్లాడిన సందర్భంలో మంత్రిని.. కలెక్టర్ ను ఇరకాటంలో పడేసేందుకే తాను కావాలని సమస్యల్ని క్రియేట్ చేస్తున్నట్లుగా చెప్పుకున్నారు. తానే రోడ్డును తవ్వించి అసౌకర్యానికి గురి చేసినట్లుగా చెప్పిన ఆడియో క్లిప్ బయటకు వచ్చి వైరల్ గా మారింది. టీఆర్ఎస్ నేతలకు షాకిచ్చింది.

అంతేకాదు మంత్రిని 'వాడు' అంటూ సంబోధించటంతో పాటు గణేష్ నిమజ్జనం తర్వాతి రోజున కలెక్టరేట్ ఎదుట తాను ఆందోళన చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ఆ ఫోన్ సంభాషణలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీకి చెందిన కార్పొరేటర్లు అంతా సమావేశమై.. కార్పొరేటర్ భర్త తీరును తీవ్రంగా తప్పు పట్టారు. అంతేకాదు.. పార్టీ జిల్లా అధ్యక్షుడు మంత్రి గంగుల కమలాకర్ ను కలిసి.. సోహన్ సింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఉద్యోగి ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్న కరీంనగర్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే వివాదానికి మూలకారణమైన సోహన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను మంత్రిని అగౌరవ పదజాలంతో మాట్లాడలేదని.. పార్టీలో ఎదుగుతున్న తనను ఇబ్బందికి గురి చేసేందుకే.. ఇలాంటి ఆరోపణలతో ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా ఆరోపించారు.