Begin typing your search above and press return to search.

గ్రేట‌ర్ టీఆర్ ఎస్‌ లో స‌న్ స్ట్రోక్‌

By:  Tupaki Desk   |   15 Dec 2015 6:52 AM GMT
గ్రేట‌ర్ టీఆర్ ఎస్‌ లో స‌న్ స్ట్రోక్‌
X
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక‌ల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి దూకుడుగా ముందుకువెళుతూ మేయ‌ర్ పీఠంపై క‌న్నేస్తోంది. అధికారంలో ఉండ‌టం మిగ‌తా రాజ‌కీయ‌ప‌క్షాల‌న్నికంటే క‌లిసివ‌చ్చే అంశం అయిన నేప‌థ్యంలో గులాబీ పార్టీలో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన స‌మీక‌ర‌ణ తెర‌మీద‌కు వ‌స్తోంది. టీఆర్ ఎస్ జోరుగా సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలోనే రాష్ర్ట‌ మంత్రులు - ఎమ్మెల్యేలు - రాష్ట్ర నాయకుల కుమారులు రాజకీయ తెరపైకి శరవేగంగా దూసుకొస్తున్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న జీహెచ్‌ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో వీరు ప్రచారంలోకి రావడం పార్టీ గ్రేటర్ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది.

వివిధ పండుగ‌లు - బోనాలు - వినాయక నవరాత్రి ఉత్సవాల్లో వీరి పేర్లు వారి నియోజక వర్గాల వీధివీధిలో దర్శనమిచ్చిన‌పుడు టీఆర్‌ ఎస్ శ్రేణుల్లో ఒకింత ఆస‌క్తి - కొంత అయోమయం క‌లిగింది. అయితే తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో ముఖ్య నాయ‌కుల వారసులు రాజకీయ అరంగేట్రం చేస్తారనే ప్రచారం నగరంలో జోరుగా సాగుతోంది. గతంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నగర మేయర్ పదవిని వెనుకబడిన తరగతుల వారికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం పత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలులోకి వస్తుందా..? రాదా..? అనేది న్యాయపరమైన విషయం ఇది ప‌క్కనపెడితే. రానున్న గ్రేటర్ మేయర్ పదవిపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు దృష్టిసారించినట్టు మాత్రం టీఆర్‌ ఎస్‌ లో గుసగుసలు మొదలయ్యాయి.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కార్పోరేషన్‌ కు ప్రప్రథమ ఎన్నికలు అయినందున నగరానికి చెందిన అమాత్యులు - ఎమ్మెల్యేలు - నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఆ క్రమంలోనే తెలంగాణలో హైదరాబాద్ మొదటి మేయర్ తన కుమారుడేనని గొప్పగా చెప్పుకునే క్రమంలో వారు తమతమ తనయులను పోటీకి సిద్ధంచేస్తున్నట్టు టీఆర్‌ ఎస్ శ్రేణుల్లో వినిపిస్తోంది. తమ వారసులను రాజకీయాల్లో ప్రవేశింపచేసేందుకు అమితంగా ప్రోత్సహిస్తున్నట్టు గ్రేటర్‌ లో చర్చ జరుగుతోంది. జీహెచ్‌ ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా అమాత్యులు - ఎమ్మెల్యేలు - రాష్ట్ర నాయకులు నజర్ పెట్టినట్టు ప్రచారం ఉంది.

సనత్‌ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తూ టీడీపీ నుంచి టీఆర్‌ ఎస్‌ లో చేరి రాష్ట్ర మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్‌ యాదవ్ కుమారుడు సాయియాదవ్ - సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర మంత్రి టి.పద్మారావు కుమారుడు పరమేశ్వర్‌గౌడ్ - ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి తనయుడు ప్రశాంత్‌ రెడ్డి - మల్కాజిగిరికి చెందిన పార్టీ రాష్ట్ర నాయకుడు - మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ కుమారుడు ఆకుల శివ - అదే నియోజకవర్గానికి చెందిన బద్దం హేమంత్‌ రెడ్డిలతో పాటు ఇతర నాయకుల వంశోద్ధారకులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్టు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

రానున్న గ్రేటర్ ఎన్నికల్లో మంత్రి తలసాని కుమారుడు సాయియాదవ్‌ ను మారేడుపల్లి లేదా సనత్‌ నగర్ నియోజకవర్గంలోని ఏదేని డివిజన్ నుంచి పోటీ చేయించనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రి పద్మారావు తనయుడు పరమేశ్వర్‌ గౌడ్‌ ను బౌద్దనగర్ - సీతాఫల్‌ మండి లేదా బస్తీలు అధికంగా ఉండే డివిజన్ నుండి ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు సీనియర్ కార్యకర్తలు వెల్లడిస్తున్నారు. మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి పుత్రుడు ప్రశాంత్‌ రెడ్డి గతంలో ఐఎస్ సదన్ డివిజన్ నుండి కార్పోరేటర్‌ గా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈమారు ఆ పరిసర ప్రాంత డివిజన్ నుండి పోటీకి సై అంటున్నారనేది బహిరంగ రహస్యం. అలాగే, పార్టీ రాష్ట్ర నాయకుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ కుమారుడు ఆకుల శివ మల్కాజిగిరిలోని ఓల్డ్ మల్కాజిగిరి లేదా మౌలాలీ డివిజన్ నుండి ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు టీఆర్‌ ఎస్‌ లో చర్చ వినిపిస్తోంది. అదే నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ ఎస్ రాష్ట్ర బద్దం పరశురామిరెడ్డి తనయుడు హేమంత్‌ రెడ్డి సఫిల్‌ గూడ లేదా ఆనంద్‌ బాగ్ ప్రాంతంలోని డివిజన్ నుండి గ్రేటర్‌ కు పోటీచేస్తారని, ప్రచార కార్యక్రమాలు సిద్ధం చేసుకుంటున్నట్టు కార్యకర్తలు వెల్లడిస్తున్నారు.

మంత్రులు - ఎమ్మెల్యేలు - రాష్ట్ర నాయకుల వారసులే రంగంలోకి దిగితే పార్టీకి ఆవిర్భావం నుండి పనిచేస్తున్న మా పరిస్థితి ఏమిటనే అయోమయంలో కార్పోరేటర్‌ గా పోటీచేయాలనుకునే ఆశావాహులు ఉన్నట్టు టీఆర్‌ ఎస్ సీనియర్లు వెల్లడిస్తున్నారు. వీరిని చూసిన మరికొందరు నాయకులు కూడా తమతమ కుమారులను రంగంలోకి దింపే అవకాశాలు లేకపోలేదని, దీంతో తమకు టిక్కెట్టు ఖాయమని భావిస్తున్న వారికి వీరి ప్రచారంతో గొంతులో వెలక్కాయపడినట్టవుతోందని పలువురు వివరిస్తున్నారు. పార్టీ అధిష్టానం పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్నవారికి జీహెచ్‌ ఎంసీ ఎన్నికల్లో తగిన ప్రాధాన్యతనివ్వాలని కోరుతున్నారు. మొత్తంగా మరో నెలరోజుల్లో టీఆర్‌ ఎస్ పార్టీ గ్రేటర్ శ్రేణుల్లో రసవత్తర రాజకీయాలు చోటుచేసుకోబోతున్నట్టు వీరి ప్రచారం వెల్లడిస్తోంది.