Begin typing your search above and press return to search.

గవర్నర్‌ విందులో బాగా ఇబ్బంది పడిన టీ నేతలు

By:  Tupaki Desk   |   1 July 2015 4:52 AM GMT
గవర్నర్‌ విందులో బాగా ఇబ్బంది పడిన టీ నేతలు
X
రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్‌ దంపతులు నిర్వహిస్తున్న విందు విషయంలో తెలంగాణ అధికారపక్ష సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నాయకుడు వెంట ఉంటే ఆ ఉత్సాహమే వేరుగా ఉంటుంది. దళపతి వెనుక నడిచే సైన్యానికి ఉండే ఆత్మవిశ్వాసానికి.. చొరవకు భిన్నమైన పరిస్థితి తెలంగాణ అధికారపక్షానిది. గవర్నర్‌ విందులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కావటంతో.. తమ్ముళ్లు ఉత్సాహంగా కనిపిస్తే.. తెలంగాణ అధికారపక్షం నేతలది అందుకు భిన్నమైన పరిస్థితి.

తమ అధినేత అనారోగ్యం కారణంగా హాజరు కాకపోవటంతో తెలంగాణ అధికారపక్షం నేతలు.. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఒక జట్టుగా ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రితో అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. కాస్త ఎడం ప్రదర్శించారనే చెప్పాలి. తమ్ముళ్లు ఉత్సాహంగా ఉంటే.. తెలంగాణ అధికారపక్షం నేతలు కాస్త బిడియంగా ఉన్నట్లు కనిపించింది.

వాస్తవానికి ఇలాంటి పరిస్థితి గతంలో కూడా ఒకసారి చోటు చేసుకుంది. అప్పట్లోనూ గవర్నర్‌ ఇచ్చిన విందునకు కేసీఆర్‌ హాజరుకాకపోవటం.. ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న అలీ తదితరులు హాజరయ్యారు. అప్పట్లో చంద్రబాబు చొరవ తీసుకొని.. తెలంగాణ అధికారపక్ష నేతలతో మాట్లాడటం.. అంటీముట్టనట్లుగా ఉండే.. మీ బాస్‌ ఏమీ అనుకోరంటూ చురకలు వేయటం తెలిసిందే.

మొత్తానికి ఉన్నత స్థాయిలో జరిగే ఇలాంటి విందులకు అధినేత హాజరైతే.. అనుచర వర్గంలో ధీమా వేరుగా ఉంటుందని.. తమ పరిస్థితి తల్లి లేని పిల్లల మాదిరిగా ఉందని.. ఓ పక్క చంద్రబాబు అన్నీ తానై చెలరేగిపోతుంటే.. ప్రోటోకాల్‌లో ఆయనకంటే తక్కువగా ఉన్న తామేం చేయగలమని.. బిక్కుబిక్కుమంటూ వచ్చామా? వెళ్లామా? అన్నట్లుగా వ్యవహరించాల్సి వచ్చిందంటూ ఒక నేత పేర్కొనటం గమనార్హం.