Begin typing your search above and press return to search.

సన్న బియ్యం... తెస్తుంది అధికారం...

By:  Tupaki Desk   |   16 Nov 2018 5:08 AM GMT
సన్న బియ్యం... తెస్తుంది అధికారం...
X
సన్నబియ్యం. సామాన్యులకు అందని ద్రాక్ష. ముఖ్యంగా పేదలు - నిరుపేదలకు మరింత దూరమయ్యే అన్నం. దొడ్డు బియ్యమే పరబ్రహ్మ స్వరూపంగా మారింది. తెలంగాణలో అయితే మరీ దారుణం. ఇక్కడి పేదలకు సన్న బియ్యం కలలో కనిపించే బ్రహ్మ పదార్ధమే. అయితే ఇదంతా గతం. గడచిన నాలుగున్నరేళ్లుగా తెలంగాణలో పరిస్థితిలో మార్పు వచ్చింది. ముఖ్యంగా సమైక్య రాష్ట్రం రెండుగా విడిపోయినా తర్వాత ఇక్కడి నిరుపేదల జీవితాల్లో మార్పు వచ్చింది. తెలంగాణ ఏర్పడి ఇక్కడి హాస్టళ్లలో విద్యార్ధులకు సన్నబియ్యంతో మెనూ ఇవ్వడం వారి జీవితాల్లో పెద్ద మార్పునే తీసుకువచ్చింది. దాని ప్రభావం డిసెంబర్ నెలలో జరిగే ముందస్తు ఎన్నికల్లో కచ్చితంగా ఉంటుందని రాజకీయ పండితులు అంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 3000 వరకూ వివిధ వర్గాలకు చెందిన విద్యార్ధుల హాస్టళ్లులున్నాయి. వీటిలో పదినుంచి పదిహేను లక్షల మంది విద్యార్ధులున్నారని ఓ అంచనా. వీరందరూ గతంలో దొడ్డు బియ్యంతోనే అన్నం తినేవారు. అవి ఉడకక - బియ్యంలో పురుగులతో నానా యాతనలు పడేవారు. అయితే తెలంగాణలో సర్కార్ మారి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని హాస్టళ్లకు దొడ్డు బియ్యం స్ధానంలో సన్న బియ్యం వచ్చి చేరాయి. విద్యార్ధుల తిండితో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడింది.

తెలంగాణలోని వివిధ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్ధులు పదిహేను లక్షల మంది వరకూ ఉంటారని అంచనా. ఈ అంచనా ప్రకారం ఒక్కో విద్యార్ధి కుటుంబంలోనూ అథమ పక్షం మూడు ఓట్లు ఉన్నాయని లెక్కలు తీసినా దగ్గర దగ్గరగా 50 లక్షల మంది ఓటర్లను ఈ విద్యార్ధులు ప్రభావితం చేయగలరు. అన్నం పెట్టిన వారిని మరచిపోకూడదనే సెంటిమెంట్ ఉన్న తెలంగాణ ప్రజలకు సన్నబియ్యంతో తమ పిల్లలకు అన్నం పెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల సానుభూతి ఉంటుందంటున్నారు. ఎన్నికల సమయంలో విద్యార్ధులంతా వారివారి స్వగ్రామాలకు వెళ్తారని - తమ హాస్టళ్లలో మారిన పరిస్థితులు తల్లితండ్రులు - ఇతర కుటుంబ సభ్యులకు చెప్పి ఓట్లు తెలంగాణ రాష్ట్ర సమితికి పడేలా వారిని ఒప్పిస్తారని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల దీమా. ఇదే జరిగితే తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలోనూ చిన్నారుల కారణంగా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధికి అథమ పక్షం ఇరవై నుంచి ముఫ్ఫై వేల ఓట్ల వరకూ వస్తాయంటున్నారు. తాము పెట్టిన సన్న బియ్యమే.... తిరిగి అధికారాన్ని తీసుకువస్తుందనే నమ్మకం అభ్యర్ధుల్లో బలంగా ఉంది.