Begin typing your search above and press return to search.

కోదండం కోసం టీఆర్ ఎస్ ఎమోష‌న‌ల్ ట్రాప్!!

By:  Tupaki Desk   |   3 Oct 2018 5:05 AM GMT
కోదండం కోసం టీఆర్ ఎస్ ఎమోష‌న‌ల్ ట్రాప్!!
X
గ‌డిచిన మూడు.. నాలుగు రోజులుగా టీఆర్ ఎస్ ముఖ్య‌నేత‌ల మాట‌ల్ని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్నారా? వారు చెప్పే మాట‌ల్లో ప్ర‌ముఖంగా వినిపించే అంశాల్లో ఒక‌టి కోదండం మాష్టారి గురించి. టీజేఎస్ పేరిట కోదండం మాష్టారు పార్టీ పెట్ట‌టం తెలిసిందే. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవ‌టానికి ఇప్ప‌టికే సానుకూలంగా ఉన్న ఆ పార్టీ ఎన్నిక‌ల్లో త‌న స‌త్తాను ప్ర‌ద‌ర్శించాల‌ని భావిస్తోంది.

అయితే.. ఆశ ఎంత ఉన్నా.. అందుకు త‌గ్గ‌ట్లు ప‌రిస్థితులు ఉండాల‌న్న విష‌యాన్ని కోదండం మాష్టారు మ‌ర్చిపోయిన‌ట్లుగా చెబుతున్నారు. ఆయ‌న పార్టీలో ఆయ‌న త‌ప్పించి.. స‌రైన నేత ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా లేర‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. నిజానికి టీజేఎస్ ఉనికి కోదండం మాష్టారి చుట్టూనే ఉంద‌న్న‌ది కాద‌న‌లేని నిజం. అలాంట‌ప్పుడు తాను త‌ప్పించి మ‌రే బ‌ల‌మైన నేత పార్టీలో లేన‌ప్పుడు.. త‌న పార్టీకి 30 సీట్లు కేటాయించ‌మ‌ని కోర‌టంలో అర్థం ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌.

ఈసారి ఎన్నిక‌లు కాంగ్రెస్‌ కు ఎంత ముఖ్య‌మో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆ మాట‌కు వ‌స్తే.. తెలంగాణ‌లో ఉనికి కోసం ఇప్పుడు పెద్ద పోరాట‌మే చేయాల్సి వ‌స్తోంది కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణను ఇచ్చిన క్రెడిట్ ను త‌మ ఖాతాలో నుంచి తీసుకెళ్లిన కేసీఆర్ కు గుణపాఠం చెప్పాల‌ని.. గెలుపుతో టీఆర్ ఎస్‌ కు భారీ షాక్ ఇవ్వాల‌న్న క‌సితో ఉంది కాంగ్రెస్‌.

అయితే.. ఎంత ఆశ ఉన్న‌ప్ప‌టికీ అందుకు త‌గ్గ‌ట్లు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు లేకుంటే ఎన్నిక‌ల్లో సానుకూల ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశ‌మే లేదు.

అందుకే.. ఓటు బ్యాంకు రాజ‌కీయాల్లో కీల‌క‌మైన ఓట్లు చీలిపోకుండా ఉండ‌టం.. కేసీఆర్ వ్య‌తిరేక ఓటు ఒక్కటి కూడా ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా ఉండేలా చేసేందుకు వీలుగా మ‌హాకూట‌మి కాన్సెప్ట్ ను తీసుకొచ్చారు. మ‌హా కూట‌మిలో కాంగ్రెస్‌.. టీడీపీ.. టీజేఎస్.. సీపీఐలు ఉండ‌నున్నాయి. ఈ నాలుగు పార్టీలు క‌లిసిక‌ట్టుగా సీట్ల స‌ర్దుబాటుకు వ‌చ్చి.. బ‌ల‌మైన అభ్య‌ర్థుల్ని బ‌రిలోకి దింపితే.. గెలుపు అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఆ విష‌యాన్ని కాస్త ఆల‌స్యంగా గుర్తించిన గులాబీ అధినాయ‌క‌త్వం.. ఇప్పుడా అంశాన్ని టార్గెట్ చేయ‌టం క‌నిపిస్తోంది. మ‌హాకూట‌మి భావ‌న వాస్త‌వంలోకి వ‌చ్చి.. సీట్ల స‌ర్దుబాటును విజ‌య‌వంతంగా పూర్తి చేస్తే.. ముప్పు త‌మ‌కేన‌న్న విష‌యాన్ని గుర్తించిన కేసీఆర్ అండ్ కో ఇప్పుడు కోదండం మాష్టార్ని టార్గెట్ చేసింది. మూడు సీట్ల కోసం ముష్టి ఎత్తుతారా? అంటూ ఏద్దేవా చేయ‌టం షురూ చేయ‌టం. కాంగ్రెస్ మ‌హాకూట‌మి లో నుంచి కోదండం మాష్టార్ని బ‌య‌ట‌కు తీసుకురావ‌టం ద్వారా త‌మ విజ‌య‌వ‌కాశాల్ని మ‌రింత ఎక్కువ చేసుకునేందుకు ప్ర‌త్యేకంగా ప్లాన్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

ఈ వ్యూహంలో భాగంగానే ఇప్ప‌టికే కోదండం మాస్టారిపై అదే ప‌నిగా కేటీఆర్ విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. భావోద్వేగానికి గుర‌య్యేలా ఆయ‌న మాట‌లు ఉంటున్నాయి. కోదండం మాష్టారి స్టేచ‌ర్ కు మూడు సీట్లు కేటాయించ‌ట‌మా? అన్న‌ట్లుగా వ్యాఖ్య‌లు చేయించ‌టం ద్వారా కూట‌మిలో కొత్త క‌ల‌క‌లాన్ని తెచ్చేలా ప్ర‌య‌త్నాలు జోరుగా సాగుతున్నాయి. మ‌రి.. ఈ ట్రాప్ లోకి కోదండం మాష్టారు ప‌డ‌తారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌గా మారింది. కేసీఆర్ లాంటి భారీ శిఖ‌రాన్ని ఢీ కొట్టాలంటే త‌న ఒక్క‌డి బ‌లం ఏ మాత్రం స‌రిపోద‌న్న వాస్త‌విక అంశాన్ని కోదండం ఎప్పుడు మిస్ అయినా కూట‌మి బీట‌లు వార‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఆ దిశ‌గా సాగుతున్న గులాబీ బ్యాచ్ ప్ర‌య‌త్నాల‌ను కోదండం మాష్టారు ఎలా ఎదుర్కొంటార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.