Begin typing your search above and press return to search.

కేటీఆర్ ఫోన్ వ‌స్తే ప‌రుగులు పెడుతున్నారట‌!

By:  Tupaki Desk   |   10 Jan 2019 5:44 AM GMT
కేటీఆర్ ఫోన్ వ‌స్తే ప‌రుగులు పెడుతున్నారట‌!
X
రాజ‌కీయాలు మ‌హా చిత్రంగా ఉంటాయి. పైకి క‌నిపించే అంశాల‌కు.. లోప‌ల జ‌రిగే అంశాల‌కు అస్స‌లు సంబంధం ఉండ‌దు. రాజ‌కీయాల్లో బ‌య‌ట‌కు క‌నిపించే వాటి వెనుక చాలానే జ‌రిగి ఉంటుంది. లింకుల‌న్నీ అర్థ‌మైన‌ప్పుడు మాత్ర‌మే అస‌లు విష‌యం అర్థ‌మ‌వుతుంది.

తెలంగాణ‌రాష్ట్రంలో.. అందునా టీఆర్ ఎస్ పార్టీలో ఇప్పుడో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని ప‌లువురు చెబుతున్నారు. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌విని కేటీఆర్ చేప‌ట్టిన నాటి నుంచి ప‌లువురు సీనియ‌ర్ నేత‌ల న‌డ‌వ‌డిక‌లో చాలా మార్పు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. గ‌తంలో కేటీఆర్ నోట‌.. అన్నా అని పిలిపించుకున్న సీనియ‌ర్లు కొంద‌రి తీరులో ఇప్పుడు బోలెడంత మార్పు వ‌చ్చిన‌ట్లుగా స‌మాచారం.

గ‌తంలో కేటీఆర్ నుంచి ఫోన్ వ‌స్తే.. కులాశాగా మాట్లాడిన వారు కాస్తా.. ఇప్పుడు అందుకు భిన్నంగా విన‌య విధేయ‌త‌ల‌తో మాట్లాడుతున్న వైనం ఒక‌టైతే.. గ‌తంలో కేటీఆర్ నుంచి క‌ల‌వాల‌న్న క‌బురు వ‌స్తే కాస్త నిమ్మ‌ళంగా క‌లిసిన వారు.. ఇప్పుడు మాత్రం ఉరుకులు ప‌రుగులు పెడుతున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

అన్నా.. ఇప్పుడెక్క‌డున్నారు? ఎంత‌సేప‌ట్లో క‌ల‌వొచ్చు అన్న మాట‌కు ఇప్పుడు వ‌స్తున్న స‌మాధానం పూర్తిగా మారిన‌ట్లుగా చెబుతున్నారు. కేటీఆర్ అంటే మొద‌ట్నించి గౌర‌వం ఉన్నా.. కేసీఆర్ త‌ర్వాతే అన్న‌ట్లుగా ఉండేది. మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో పార్టీ.. ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల‌న్నింటిని త‌న క‌నుసైగ‌తో కేటీఆర్ కంట్రోల్ చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

గ‌తంలో కేటీఆర్ ను క‌లిసే టైంకు కాస్త అటు ఇటు అయినా ఫ‌ర్లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన సీనియ‌ర్ నేతంలా ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా.. చెప్పిన టైంకు పావుగంట ముందే వాలిపోతున్న పరిస్థితి. అన్నా.. మొన్న‌టి వ‌ర‌కూ ఆయ‌న మా కొలీగ్‌. కేసీఆర్ కొడుకు అయినా.. కేసీఆర్ త‌ర్వాతే అన్న‌ట్లు ఉండేది. ఇప్పుడు సీన్ మారిపోయింది. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నేప‌థ్యంలో ఆయ‌న పోస్టుకు మ‌ర్యాద ఇవ్వాల్సిందే. అన్నీ ఆయ‌నే అయిన‌ప్ప‌డు మార్పు త‌ప్ప‌దు క‌దా? అందుకే.. ఇప్పుడు కేటీఆర్ నుంచి ఫోన్ వ‌స్తే చాలు ఉరుకులు ప‌రుగులు పెట్టాల్సి వ‌స్తోందంటూ తాజా ప‌రిస్థితి గురించి లోగుట్టుగా చెప్పుకొచ్చారో సీనియ‌ర్ నేత‌.