Begin typing your search above and press return to search.

ఉత్త‌మ్ బ‌చ్చా మాటేమో కానీ..కేటీఆర్ ని పొగిడేస్తున్నారు

By:  Tupaki Desk   |   21 Aug 2018 5:35 AM GMT
ఉత్త‌మ్ బ‌చ్చా మాటేమో కానీ..కేటీఆర్ ని పొగిడేస్తున్నారు
X
ఒక మాట‌కు వంద మాట‌లు అంటామ‌న్న‌ట్లుగా ఉంది తెలంగాణ గులాబీ దండు తీరు చూస్తుంటే. మంత్రి కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ ర‌థ సార‌ధి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై టీఆర్ ఎస్ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. రేపో..మాపో ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్న‌ట్లుగా చెప్పే కేటీఆర్ ను ప‌ట్టుకొని.. బ‌చ్చా అంటావా? అంటూ తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు.

ఉత్త‌మ్ బ‌చ్చా మాట‌కు.. నువ్వు బ‌చ్చా.. మీ రాహుల్ మ‌రింత పెద్ద బ‌చ్చా అంటూ తెగ తిట్టేస్తున్నారు టీఆర్ ఎస్ నేత‌లు. ఇటీవ‌ల కాలంలో ఎప్పుడూ లేనంత‌గా.. ఏ మాట‌కు రానంత రియాక్ష‌న్ ను టీఆర్ ఎస్ నేత‌ల నుంచి రావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఉత్త‌మ్ మాట‌ల్ని తీవ్ర‌స్థాయిలో త‌ప్పు ప‌డుతున్న టీఆర్ ఎస్ నేత‌లు అదే స‌మ‌యంలో మంత్రి కేటీఆర్ ను ఆకాశానికి ఎత్తేసేలా పొగిడేస్తున్న వైనం క‌నిపిస్తోంది.

మా నాయ‌కుడు కేటీఆర్ ను బ‌చ్చా అంటావా ఉత్త‌మ్.. అంటూ భ‌గ్గుమ‌న్న ప‌లువురు టీఆర్ ఎస్ నేత‌లు.. కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ పెద్ద బ‌చ్చాగా అభివ‌ర్ణించ‌టం గ‌మ‌నార్హం. కేటీఆర్ కు ద‌న్నుగా నిలిచి ప్ర‌క‌ట‌న‌లు చేసిన వారిలో ఎంపీ బాల్క సుమ‌న్‌.. మంత్రి త‌ల‌సాని.. ఎమ్మెల్యేలు గ్యాద‌రి కిశోర్ కుమార్.. కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి.. దాస‌రి మ‌నోహ‌ర్ రెడ్డిలు మాట్లాడారు. వీరితో పాటు ఎమ్మెల్సీలు రాములు నాయ‌క్.. శంభీపూర్ రాజులు మండిప‌డ్డారు.

అవినీతి రాజ‌కీయాల‌కు ఉత్త‌మ్ సీనియార్టీ ఉంద‌న్న కిశోర్ కుమార్.. ప్ర‌జ‌ల్లోకి రాలేక ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడుతున్న‌ట్లుగా మండిప‌డ్డారు.

కేటీఆర్ ఉద్య‌మం నుంచి వ‌చ్చిన నాయ‌కుడ‌ని.. అవినీతికి పాల్ప‌డ‌టం.. ఆ సొమ్ముతో ఓట్లు దండుకోవ‌టం లాంటివి కాంగ్రెస్ కు సాధ్య‌మ‌న్నారు. ఇచ్చిన హామీల్ని అమ‌లు చేయ‌టంలో టీఆర్ ఎస్ స‌ర్కారు ముందున్న‌ట్లు చెప్పారు. ఏ అంశంలోనైనా స‌రే.. కేటీఆర్ తో చ‌ర్చ‌కు ఉత్త‌మ్ రాగ‌ల‌రా? అంటూ స‌వాల్ విసిరారు. పిచ్చిప్రేలాప‌నులు మాని ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని మాట్లాడాలంటూ ఉత్త‌మ్ పై ఫైర్ అయ్యారు. ఈ విమ‌ర్శ‌ల దాడిలో కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి మ‌రో అడుగు ముందుకు వేసి.. ఉత్త‌మ్ క‌ల్లు తాగిన కోతిలా వ్య‌వ‌హ‌ర‌స్తున్న‌ట్లుగా ఫైర్ అయ్యారు. గుడ్డిగా మాట్లాడుతున్న ఉత్త‌మ్‌ కు ప్ర‌జ‌లే గ‌డ్డిపెడ‌తార‌ని హెచ్చ‌రించారు.

ఒక‌వైపు ఉత్త‌మ్ ను తిట్టేస్తున్న గులాబీ నేత‌లు.. మ‌రోవైపు మంత్రి కేటీఆర్ ను ఆకాశానికి ఎత్తేసేలా పొగిడేస్తున్నారు. మంత్రి కేటీఆర్ వ‌య‌సులో చిన్న‌వాడైనా వ్య‌క్తిత్వంలో హిమాల‌య‌మంత ఎత్తున్న వాడ‌ని దాస‌రి మ‌నోహ‌ర్ రెడ్డి అభివ‌ర్ణించారు. కేటీఆర్ పై విమ‌ర్శ‌లు చేయ‌టం ద్వారా ఉత్త‌మ్ త‌న స్థాయిని తగ్గించుకుంటున్నార‌ని.. త‌గిన రీతిలో బుద్ధి చెబుతామ‌ని మండిప‌డుతున్నారు. మొత్తానికి కేటీఆర్ మీద మాట అంటే ఒప్పుకోమ‌న్న‌ట్లుగా గులాబీ దండు ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా త‌మ మాట‌ల‌తో చెప్పేస్తూ.. యువ‌నేత మ‌న‌సుల్లో రిజిస్ట‌ర్ అవుతున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.