Begin typing your search above and press return to search.

ఫుల్‌ అలెర్ట్‌లో తెలంగాణ అధికారపక్షం

By:  Tupaki Desk   |   12 Jun 2015 11:30 AM GMT
ఫుల్‌ అలెర్ట్‌లో తెలంగాణ అధికారపక్షం
X
ఒకటి తర్వాత ఒకటిగా బయటకు వస్తున్న తమ తప్పుల పుణ్యమా అని తీవ్ర ఒత్తిడిలో ఉన్న తెలుగుదేశం పార్టీ.. ప్రతీకారం తీర్చుకోవటం కోసం తహతహలాడిపోతోంది. ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్‌ తమకు దక్కాలే కానీ.. తామేంటో చూపిస్తామంటూ తమ్ముళ్లు తెగ ఆవేశపడుతున్నారు. తప్పులు అందరూ చేస్తున్నా.. తమ తప్పులు మాత్రమే బయటకు రావటం.. మిగిలిన వారంతా సత్యసంధులుగా కనిపిస్తున్నారంటూ వారు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఇందులో భాగంగా.. తమను ఇరికించిన వారిని ఇరికించి ప్రతీకారం తీర్చుకోవటంతోపాటు.. రాజకీయంగా దెబ్బ తీయాలన్న తలంపుతో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.

ఇలాంటి సమాచారాన్ని అందుకున్న నిఘా వర్గాలు తెలంగాణ ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు. ప్రభుత్వంలోని వారు ఎవరూ అజాగ్రత్తగా ఉండరాదని.. ఎవరు ఎలాంటి ప్రతిపాదన తీసుకొచ్చినా తొందరపడకూడదని.. ముఖపరిచయం లేని వ్యక్తుల విషయం జాగ్రత్తగా ఉండాలని.. పరిచయస్తుల విషయంలోనూ ఈ జాగ్రత్తలు తప్పవని చెబుతున్నారు.

ఏ చిన్న అవకాశం వచ్చినా చెలరేగిపోవటానికి టీడీపీ సిద్ధంగా ఉందన్న హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తమ మంత్రివర్గ సభ్యులతో పాటు.. పార్టీ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అండ్‌ కో చాలా జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం జాగ్రత్తగా ఉండాలన్న సూచన వెళ్లినట్లు చెబుతున్నారు. మొత్తంగా.. కేసుల్లో ఇరుకున్నవారు దాని నుంచి ఎలా బయటపడాలన్న అంశంపై తీవ్ర ఒత్తిడిలో ఉంటే.. కేసులేమీ లేని తెలంగాణ అధికారపక్షం.. ఏ నిమిషానం ఏం కొంప మునుగుతుందో.. అదే జరిగితే ఇప్పటివరకూ ఉన్న అధిక్యం పోతుందన్న టెన్షన్‌ అధికారపక్షంలోనూ కనిపిస్తున్న పరిస్థితి.