Begin typing your search above and press return to search.

కేటీఆర్ పిలిచినా గులాబీనేతలు లైట్ తీసుకున్నారా?

By:  Tupaki Desk   |   4 Sep 2019 5:07 AM GMT
కేటీఆర్ పిలిచినా గులాబీనేతలు లైట్ తీసుకున్నారా?
X
కేటీఆర్ ఏమైనా మామూలు వ్యక్తా? ఆయన తెలంగాణ అధికార పక్షమైన టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అంతేనా? రాబోయే రోజుల్లో కాబోయే బిగ్ బాస్. కేసీఆర్ రాజకీయ వారసుడిగా ఇప్పటికే డిసైడ్ అయిన ఆయన మాటకు ఎంత విలువ ఉండాలి? కానీ.. అందుకు భిన్నంగా కేటీఆర్ మాటను సైతం పిచ్చ లైట్ గా తీసుకునేంతగా గులాబీ నేతలు ముదిరిపోయారా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల కాలంలో జిల్లాల వారీగా పార్టీ నేతలతో మీటింగ్స్ పెడుతున్న కేటీఆర్ కు ఊహించనిరీతిలో సాక్ తగిలినట్లుగా చెబుతున్నారు. తాజాగా హైదరాబాద్.. రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశం కావాలని డిసైడ్ అయ్యారు. అయితే.. ఈ మీటింగ్ కు హాజరు కావాల్సిన టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పలువురు గైర్హాజరు కావటం కేటీఆర్ కు షాక్ తగిలేలా చేసింది.

ఓవైపు బీజేపీ.. కాంగ్రెస్ పార్టీలు అంతకంతకూ దూకుడుగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వంపై విమర్శల పరంపరను పెంచేస్తున్న వేళ.. మరింత అప్రమత్తంగా ఉండాల్సింది పోయి.. అందుకు భిన్నంగా తాను పెట్టిన మీటింగ్ కు డుమ్మా కొట్టటంపై విస్మయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకిలా జరిగింది? ఎందుకింతమంది ప్రజాప్రతినిధులు తన మీటింగ్ కు హాజరు కాలేదో తెలుసుకోవాలంటూ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి కి కేటీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. సీరియస్ మీటింగ్ పెడితే.. సింఫుల్ గా గైర్హాజరుకావటం ఏమిటని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం.

కేటీఆర్ లాంటి నేతతో మీటింగ్ అంటే.. ఉన్న పనుల్ని పక్కన పెట్టేసి మరీ గంటల కొద్దీ వెయిట్ చేసే తీరుకు భిన్నంగా.. పలువురు గైర్హాజరు కావటం వెనుక మర్మం ఏమిటి? లోలోపల ఏం జరుగుతుందన్నది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిపేందుకు మీటింగ్ పెడితే డుమ్మా కొట్టటం ఏమిటన్న అసహనాన్ని కేటీఆర్ వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. నిజమే.. కేటీఆర్ లాంటి నేత పిలిస్తే.. పరుగులు తీసే గులాబీ నేతల తీరుకు భిన్నంగా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటం చిన్న బాస్ కు ఒళ్లు మండిపోయిందన్నది తాజా కబర్. ఎందుకిలా జరిగిందన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర తీసింది.