Begin typing your search above and press return to search.

అలాంటి సీన్ గులాబీ పార్టీలో ఉంద‌ట‌!

By:  Tupaki Desk   |   10 Jan 2019 5:04 AM GMT
అలాంటి సీన్ గులాబీ పార్టీలో ఉంద‌ట‌!
X
అధికారం అర‌చేతిలో ఉంటే ఇలాంటి ప‌రిస్థితే ఉంటుంది. టీఆర్ ఎస్ పార్టీలో అంత‌ర్గ‌త క్ర‌మ‌శిక్ష‌ణ ఎంత‌న్న‌ది బ్ర‌హ్మ ప‌దార్థ‌మే. గెలుపు మీద గెలుపు వ‌చ్చి ప‌డుతున్న వేళ‌.. మ‌న‌సులో కిలోల కొద్దీ అసంతృప్తి ఉన్న‌ప్ప‌టికీ ముఖంలో చెర‌గ‌ని చిరున‌వ్వుతో అధినాయ‌క‌త్వానికి జైజేలు కొడుతున్న ప‌రిస్థితి.

సీనియ‌ర్ నుంచి జూనియ‌ర్ వ‌ర‌కూ అంద‌రిలోనూ దాదాపు ఇలాంటి మైండ్ సెట్‌ లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. తెలుగు నేల మీద అన్ని ర‌కాల రాజ‌కీయ ద‌రిద్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా చెప్పే తెలుగుదేశంలోని ముక్కే టీఆర్ ఎస్‌ గా ప‌లువురు అభివ‌ర్ణిస్తారు. నిజానికి ఆ వ్యాఖ్య‌లో ఎలాంటి త‌ప్పు లేదు. కాకుంటే.. టీడీపీ లీడ‌ర్ల‌కు తోడుగా కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు గులాబీ కారులో ఉన్నారు.

ఈ కార‌ణంతోనే అధినాయ‌కుడికి ఎంత‌లా అణిగి మ‌ణిగి ఉండాల‌న్న దానిపై ఎవ‌రికి ప్ర‌త్యేకంగా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవ‌స‌ర‌మే లేదు. వారి డీఎన్ ఏలోనే ఆ తీరు ఉండ‌టం ఇప్పుడా పార్టీకి పెద్ద క‌లుసుబాటుగా మారింది. ఇన్ని సుగుణాలు ఉన్న‌ప్ప‌టికీ.. మ‌న‌సులోని అసంతృప్తిని ఎంత దాచాల‌న్నా.. దాచ‌లేని ప‌రిస్థితిని గులాబీ పార్టీ ముఖ్య‌నేత‌లు ఎదుర్కొంటున్న‌ట్లుగా చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌పై టీఆర్ ఎస్ పార్టీ ముఖ్య‌నేత‌లంతా తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. త‌న‌కు తోచిందే వేద‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేసీఆర్ తీరును కాద‌న‌లేక‌.. ఆ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌లేక కిందా మీదా ప‌డుతున్నార‌ట‌. చేతిలో ఎంత ప‌వ‌ర్ ఉంటే మాత్రం.. నోరు క‌ట్టేసుకొని కూర్చోవ‌టం మ‌హా క‌ష్టంగా ఉంద‌న్న మాట‌ను కొంద‌రు నేత‌లు త‌మ అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో వాపోతున్నారు.

అధినేత‌ను క‌లిసే అవ‌కాశం లేని ప‌రిస్థితితో పాటు.. త‌మ క‌ష్టాలు చెప్పుకునే వేదిక లేక కిందా మీదా ప‌డుతున్నార‌ట‌. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ పెద్దాయ‌నను న‌మ్ముకున్న వారి పరిస్థితి ఇప్పుడు మ‌హా ఇబ్బందిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. చిన్నాయ‌న‌తో ఎలాంటి పేచీ లేన‌ప్ప‌టికీ.. త‌మ లాంటి సీనియ‌ర్లు ఇప్పుడు చిన్నాయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌టం ఇబ్బందిగా మారిన‌ట్లు చెబుతున్నారు.

తాము వెళితే మ‌ర్యాద‌గా మాట్లాడ‌టం.. త‌మకు సానుకూలంగా స్పందిస్తున్నప్ప‌టికీ.. అదంతా తమ‌కు తాముగా వెళితే మాత్ర‌మే కావ‌టాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పార్టీ కొత్త చీఫ్ చేతుల్లోకి పార్టీ మారినప్ప‌టికీ.. సీనియ‌ర్లు కొంద‌రు ఈ ప‌రిస్థితికి ఇంకా అల‌వాటు ప‌డ‌లేదు. దీంతో.. వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లుగా తెలుస్తోంది.

పార్టీలో ఇటీవ‌ల చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తున్న ఒక సీనియ‌ర్ నేత మాట్లాడుతూ.. పార్టీని క‌నుసైగ‌తో శాసించి.. త‌న మాటే వేదంగా పార్టీని న‌డిపించిన దివంగ‌త త‌మిళ‌నాడు అమ్మ జ‌య‌ల‌లిత‌కు అప్ గ్రేడెడ్ వెర్ష‌న్ కేసీఆర్ గా చెప్పుకొచ్చారు. క‌ల‌వ‌టం అవుటాఫ్ క్వ‌శ్చ‌న్ అని.. క‌ష్టాలు చెప్పుకోవ‌టం సాధ్యం కానిదిగా మారింద‌ని.. త‌మ ట‌ర్న్ ఎప్పుడు వ‌స్తుంద‌న్నది ఆశ‌గా చూడ‌టం త‌ప్పించి మ‌రింకేమీ ఉండ‌ద‌ని ఆయ‌న చెబుతూ.. ఇలాంటి రాజ‌కీయాన్ని తెలంగాణ‌లో తాను చూస్తాన‌ని ఎప్పుడూ అనుకోలేద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.