Begin typing your search above and press return to search.

రేపు మా మీద దాడి జరిగినా పరిస్థితి ఇంతేనా?

By:  Tupaki Desk   |   4 Feb 2016 11:30 AM GMT
రేపు మా మీద దాడి జరిగినా పరిస్థితి ఇంతేనా?
X
టీఆర్ ఎస్ నేతలు పరిస్థితి మహా ఇబ్బందికరంగా ఉంది. ప్రత్యర్థి ఎవరైనా దూసుకెళ్లిపోవటం.. ఎంతటి వారిపైనైనా వెనుకాముందు చూసుకోకుండా వ్యాఖ్యలు చేయటం అలవాటు. అసలే ఉద్యమ పార్టీ అందునా.. తెలంగాణ సాధన కోసం కంకణం కట్టుకున్నపార్టీగా.. మిగిలిన రాజకీయ పార్టీల కంటే భిన్నంగా కాస్తంత ప్రత్యేకంగా చూసేవారు. భావోద్వేగంతో ఒక మాట అన్నా.. ఏదైనా చర్య చేపట్టినా మీడియా మొదలు అందరూ ఆచితూచి వ్యవహరించే వారే తప్పించి.. ఎవరూ తప్పు పట్టటం.. విమర్శలు చేయటం లాంటివి చేసే వారు కాదు.

నిజానికి ఒక రాజకీయ పార్టీని ప్రత్యేకంగా చూడటం చాలా చాలా అరుదు. కానీ.. ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఇలాంటి పరిస్థితి ఉండేది. ఇలా తమకు నచ్చిన రీతిలో వ్యవహరించిన టీఆర్ఎస్ నేతలకు తాజాగా చోటు చేసుకున్న ఒక పరిణామం అస్సలు మింగుడు పడటం లేదు. హోదా పరంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవే పెద్దది. అలాంటి ఉప ముఖ్యమంత్రి పదవిని నిర్వహిస్తున్న ఒక నేత ఇంటిపై దాడికి పాల్పడటం.. స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి.. ఆయన్ను ఒక ఎమ్మెల్యే తోసేసి దాడి చేయటం.. ఉప ముఖ్యమంత్రి కుమారుడిపైనా దాడి చేయటం గులాబీ నేతల్ని రగిలిస్తోంది.

ఇంత జరిగినా.. ఏమీ అనకుండా.. అసలేం జరిగినట్లుగా ఫీల్ కాకుండా ఉండటం వారికేం మాత్రం నచ్చటం లేదు. అయితే.. మిత్రుడి విషయంలో తొందర వద్దంటూ అధినాయకత్వం నుంచి వస్తున్న సంకేతాలు అందరి నోటికి తాళాలు పడేలా చేస్తున్నాయి. చిన్న విషయానికే మూకుమ్మడిగా మాటల దాడికి దిగే తీరుకు భిన్నంగా తెలంగాణ అధికారపక్ష నేతలు వ్యవహరిస్తున్న తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. అయితే.. ఈ మౌనం అంతా వ్యూహాత్మకమని.. తొందరపడకూడదన్న ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే.. తమకేమాత్రం అలవాటులేని ఈ తీరుపై గులాబీ నేతలు పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు డిప్యూటీ సీఎం అని.. రేపొద్దున తామే బాధితులమైతే పరిస్థితి ఇలానే ఉంటుందా? అన్న ప్రశ్న పలువురి మాటల్లో రావటం గమనార్హం. అయితే.. ఇవన్నీ పార్టీ పరపతిని దెబ్బ తీస్తాయన్న ఉద్దేశ్యంతో అంతర్గత సమావేశాల్లోనే పార్టీ నేతలు వాపోతున్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా చూస్తే.. పాతబస్తీలో మజ్లిస్ రెచ్చిపోవటం.. తమ పార్టీ ముఖ్యనేత ఇంటిపై దాడికి పాల్పడటం.. అయినప్పటికీ మౌనంగా ఉండటం.. అసలేమీ జరగనట్లుగా వ్యవహరించటం లాంటివి టీఆర్ఎస్ నేతలు లోలోపలే కుతకుతలాడిపోయేలా చేస్తున్నట్లు చెబుతున్నారు.