Begin typing your search above and press return to search.

అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ‌ర్సెస్‌ నాయ‌కులు

By:  Tupaki Desk   |   28 March 2016 6:41 AM GMT
అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ‌ర్సెస్‌ నాయ‌కులు
X
నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో ఎమ్మెల్యేలకే సర్వాధికారాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల జరిగిన టీఆర్‌ ఎస్‌ పార్టీ ఎల్పీ - పార్లమెంటరీ సంయుక్త సమావేశంలో చెప్పిన విషయం ఆ పార్టీలో ఆందోళ‌న‌ల‌కు కార‌ణం అవుతోంది. అంతా ఎమ్మెల్యే చేతుల్లోనే పెట్టేస్తే..తాము ఉత్స‌వ విగ్ర‌హాలం అయిపోతామ‌ని మిగిలిన నేతలు త‌లలు పట్టుకుంటున్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో పాటు నలుగైదుగురు నేతలు ఉండడంతో ఒకరంటే మరొకరికి గిట్టడం లేదు. దీంతో ఆ పార్టీకి చెందిన కిందిస్థాయి కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.

2014 ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ పార్టీ తరపున 61 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ తర్వాత అన్ని నియోజకవర్గాల నుండి కాంగ్రెస్‌ - టీడీపీ - బీజేపీ - వైసీపీలకు చెందిన చాలామంది నేతలు - ఎమ్మెల్యేలు కూడా పలువురు కారెక్కిన విషయం తెలిసిందే. పాత - కొత్త నేతలతో కారులో ఉక్కబోత మొదలైందని చెప్తున్నారు. ఇలాంటి విషయాలను బహిరంగంగా మీడియా ముందు చెప్పడం కష్టమని, తమకు అనేక సమస్యలు ఉన్నాయని నాయ‌కులు అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో వాపోతున్నారు. నేతలు ఎక్కువైతే ఎలాంటి ఫలితాలు వస్తాయన్నది వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సంద‌ర్భంగా జ‌రిగింద‌ని ప్ర‌స్తావిస్తున్నారు. ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్‌ కార్పొరేషన్‌ ను స్వాధీనం చేసుకున్నప్ప‌టికీ టీఆర్ ఎస్‌ రెబల్‌ అభ్యర్థులు గెలవడమంటే అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ఉదాహరణ అని నేతలు వివ‌రిస్తున్నారు.

ఎమ్మెల్యేల సిఫార‌సుల‌ను గౌర‌విస్తూనే...పార్టీ కోసం పనిచేస్తున్న నేతలను గుర్తించాల్సిన అవసరం ఉందని నాయ‌కులు స‌ణుగుతున్నారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీ విషయంలో ఎమ్మెల్యేలకే సర్వాధికారులు అప్పగిస్తే, ఆయనకు వ్యతిరేకంగా ఉన్న మరో గ్రూపునకు ఎలా న్యాయం జరుగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పార్టీ నేత‌లు ఎవరేంటి అనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలుసుకుంటే బాగుంటుందని అంటున్నారు. గులాబీ ద‌ళ‌ప‌తి ఈ ఆవేద‌న‌ను గౌర‌విస్తారా? వేచి చూడాల్సిందే.