Begin typing your search above and press return to search.

ఆ ప‌ద‌వి మాకొద్దంటూ గులాబీ నేత‌ల లాబీయింగ్‌!

By:  Tupaki Desk   |   20 Dec 2018 7:50 AM GMT
ఆ ప‌ద‌వి మాకొద్దంటూ గులాబీ నేత‌ల లాబీయింగ్‌!
X
సాధార‌ణంగా ఎక్క‌డైనా.. ఎవ‌రైనా.. ప‌ద‌వి ద‌క్కించుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తారు. తోచిన రీతిలో లాబీయింగ్ చేస్తారు. పీఠం త‌మ‌కే ద‌క్కేలా తుదికంటా పోరాడుతారు. తెలంగాణ‌లో మాత్రం ఇప్పుడు ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఓ ప‌ద‌వి త‌మ‌కు వ‌ద్దే వ‌ద్దంటూ టీఆర్ ఎస్‌ నేత‌లు దూరంగా ప‌రిగెత్తుతున్నారు. అస‌లు ఆ పీఠం పేరు చెప్తేనే వ‌ణికిపోతున్నారు. త‌మ‌కు ఆ ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట వ‌ద్దంటూ అగ్ర‌నాయ‌క‌త్వానికి మొర‌పెట్టుకుంటున్నారు.

ఇంత‌లా గులాబీ నేత‌ల‌ను జ‌డిపిస్తున్న ఆ పోస్టు.. శాస‌న‌స‌భ‌లో అత్యున్న‌త ప‌ద‌వి - స్పీక‌ర్‌. కొంప‌దీసి త‌మను స్పీక‌ర్ గా చేస్తారేమోన‌ని తాజా ఎన్నిక‌ల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలామంది ఆందోళ‌న చెందుతున్నార‌ట‌. వారి ఆందోళ‌న‌కు కార‌ణాలు లేక‌పోలేదు. స్పీక‌ర్ ప‌ద‌వికి సంబంధించిన ఓ సెంటిమెంట్ అంద‌ర్నీ క‌ల‌చివేస్తోంది. ఆ ప‌ద‌విని అలంక‌రించిన వారంద‌రి రాజ‌కీయ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌కంగా మారుతుండ‌ట‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ తోపాటు తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత కూడా ఈ సంప్ర‌దాయం కొన‌సాగింది.

గ‌తంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో స్పీక‌ర్లుగా ప‌నిచేసిన శ్రీ‌పాద‌రావు - సురేశ్ రెడ్డి - ప్ర‌తిభా భార‌తి - నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. ఇలా అంద‌రూ త‌ర్వాతి ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాల‌య్యారు. రాజ‌కీయంగా దాదాపు క‌నుమ‌రుగ‌య్యారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ఇదే సంప్ర‌దాయం కొన‌సాగింది. స‌భాప‌తి మ‌ధుసూద‌నాచారి తాజా ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం చ‌విచూశారు. దీంతో స్పీక‌ర్ ప‌ద‌వి చేప‌ట్టేందుకు గులాబీ నేత‌లు వ‌ణికిపోతున్నారు.

తెలంగాణ నూత‌న అసెంబ్లీ త్వ‌ర‌లోనే భేటీ కానుండ‌టంతో కొత్త స్పీక‌ర్ గా ఎవ‌రిని ఎంపిక చేయాల‌నే విష‌యంపై గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ తీవ్రంగా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. అయితే - ఆయ‌న ఆలోచన‌ల్లో త‌మ పేరు ఉంద‌ని తెలిస్తే చాలు.. ఆ నేత‌లు నేరుగా హైద‌రాబాద్ లో వాలిపోతున్నారు. త‌మ‌కు ఆ ప‌ద‌వి వ‌ద్దంటూ మొర‌పెట్టుకుంటున్నారు. మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కున్నా ప‌ర్లేదు.. మామూలు ఎమ్మెల్యేగా ఉంటాం. కానీ స్పీక‌ర్ పోస్టు మాత్రం వ‌ద్దంటూ విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

క‌రీంన‌గ‌ర్ కు చెందిన ఓ సీనియ‌ర్ ఎమ్మెల్యేకు స్పీక‌ర్ పోస్టు ఇస్తారంటూ ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగింది. దీంతో ఆ ఎమ్మెల్యే భాగ్య‌న‌గ‌రానికి హుటాహుటిన వ‌చ్చేశారు. తాను స‌భాప‌తిగా ప‌నిచేయ‌న‌ని స్ప‌ష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి పేరు స్పీక‌ర్ ప‌ద‌వికి ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న‌ట్లు వార్త‌లు రావ‌డంతో.. ఆ నేత నేరుగా కేటీఆర్ ను క‌లిసి మొర‌పెట్టుకున్నారు. తాను ఆ ప‌ద‌విని తీసుకోలేన‌ని తేల్చిచెప్పారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ ఎమ్మెల్యే పేరు కూడా ఈ ప‌ద‌వికి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. అయితే - ఆ ప‌ద‌వికి తాను ఒప్పుకునే ప్ర‌స‌క్తే లేద‌ని స‌ద‌రు ఎమ్మెల్యే అనుచ‌రుల వ‌ద్ద స్ప‌ష్టం చేశార‌ట‌. మెద‌క్ జిల్లాకు చెందిన మ‌హిళా ఎమ్మెల్యే కూడా త‌న‌కు స్పీక‌ర్ గా ప్ర‌మోష‌న్ వ‌ద్ద‌ని మొర‌పెట్టుకున్నార‌ట‌. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో కేసీఆర్ స్పీక‌ర్ గా ఎవ‌రిని ఎంపిక చేస్తారు? వారిని ఎలా ఒప్పిస్తారు? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.