Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాలపై గులాబీ నేతల మూగనోము

By:  Tupaki Desk   |   5 Sep 2016 5:44 AM GMT
కొత్త జిల్లాలపై గులాబీ నేతల మూగనోము
X
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతలా చెలరేగిపోతారో..అధికారపక్షంగా ఉన్నప్పుడు అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాలు తప్పించి అన్నీ సందర్భాల్లోనూ విపక్షాల్ని వేసుకునే అవకాశం ఉండదు. సుదీర్ఘంగా సాగిన తెలంగాణ ఉద్యమ సమయంలోనూ.. తెలంగాణలో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తల్లో టీవీల్లో జరిపే చర్చల సందర్భంగా విపక్షాలపై ఓ రేంజ్ లో విరుచుకుపడే వారు గులాబీ నేతలు.

వారి జోరు చూసిన చాలామంది వారి అదృష్టానికి అసూయపడేవారు. అధికారపక్షంగా ఉండి కూడా ఎంత ధీమాగా ఉన్నారని ఫీలయ్యేవారు. అలాంటివి తమకు రావే అని అనుకోవటం కనిపించేది. అయితే.. అలాంటి పరిస్థితులు ఎక్కువ కాలం ఉండవన్న రాజకీయ పరిశీలకుల అంచనాలు నిజమయ్యాయి. కాలం గడిచే కొద్దీ.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో.. చేసే తప్పులతో ప్రతిపక్షాలపై విరుచుకుపడి మాట్లాడే పరిస్థితి ఉండని పరిస్థితి. తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు అంశం తెలంగాణ రాష్ట్రాన్ని ఊపేస్తోంది. కొత్త జిల్లాల ఎంపిక మొత్తం ముఖ్యమంత్రి కనుసన్నల్లో జరుగుతుందని.. ఆయనకు ఇష్టం వచ్చినట్లగా కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తున్నారని.. ఇందుకు శంషాబాద్ జిల్లా ఏర్పాటు ఒక నిదర్శనంగా విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

కొత్త జిల్లాల ఏర్పాటుపై తమకున్న అభ్యంతరాల్ని వారు భారీగా బయటపెడుతున్నారు. వీటికి సమాధానాలు చెప్పలేక.. కన్వీన్స్ చేయలేక గులాబీ నేతలు కిందామీదా పడే పరిస్థితి. మొన్నటి వరకూ టీవీలో చర్చలు అంటే చాలు లోడ్ చేసిన తుపాకీల మాదిరి వ్యవహరించే గులాబీ నేతలు ఇప్పుడు బుల్లెట్లు లేని తుపాకీ మాదిరిగా మారిపోయినట్లుగా వారి వైఖరి ఉండటం గమనార్హం. కొత్త జిల్లాల ఏర్పాటు వెనుకున్న ప్రాతిపదికను సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పలేని గులాబీ నేతలు మూగనోము పట్టినట్లుగా వ్యవహరించటం చూసినప్పుడు.. అధికారపక్షానికి ఉండే పరిమితులు టీఆర్ఎస్ నేతలకూ అర్థమవుతున్నట్లుగా కనిపిస్తోందని చెప్పక తప్పదు.