Begin typing your search above and press return to search.

ప్రెస్ మీట్ పెట్టిన నాగంపై గులాబీ దండు దాడి?

By:  Tupaki Desk   |   3 July 2016 5:04 AM GMT
ప్రెస్ మీట్ పెట్టిన నాగంపై గులాబీ దండు దాడి?
X
తెలంగాణ అధికారపక్ష పార్టీ నేతలు.. కార్యకర్తల తీరు చిత్రంగా మారుతోంది. అధికార పక్షాన్నివిమర్శించినా.. వారు చేసే పనుల్ని తప్పు పట్టినా.. వారిని వేలెత్తేలా చూపినా తీవ్రంగా అసహనం చెందటం ఈ మధ్యన తరచూ కనిపిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శలు మామూలే. ఈ లెక్కన విపక్షంలో ఉన్న సమయంలో నేటి తెలంగాణ అధికారపక్ష నేతలు ఎన్నెన్ని విమర్శలు చేసేవారు. నాటి అధికారపక్షాలపై ఎంత ఘాటుగా మండిపడేవారో చెప్పాల్సిన అవసరమే లేదు.

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వ్యవధిలో టీఆర్ ఎస్ ఎంత బలపడిందన్న విషయం తెలిసిందే. బలపడటం వరకూ బాగానే ఉన్నా.. తాము తప్పించి మరెవరూ తమను విమర్శించకూడదన్నట్లుగా వ్యవహరించటం ఇప్పుడు చర్చగా మారింది. మొన్నామధ్య రేవంత్ రెడ్డి ఇష్యూలో టీడీపీ పార్టీ ప్రధాన కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పై దాడి చేసేందుకు ప్రయత్నించారు.

ఇదిలా ఉంటే.. తాజాగా మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ అధికారపక్ష వైఖరిని విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఆరోపణలు సంధిస్తున్నాయి. పాలమూరు ఎత్తిపోతల పథకంపై తెలంగాణ అధికారపక్ష వైఖరిని తప్పు పడుతున్న బీజేపీ నేతలపై గులాబీ దండు దాడి చేసే యత్నం చేయటం ఇప్పుడు చర్చగా మారింది. మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ నేత.. మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. టీఆర్ ఎస్ సర్కారు తీరును పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.

అదే సమయంలో టీఆర్ ఎస్ నేతలు మీడియా సమావేశంలోకి చొచ్చుకొచ్చి నాగంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తూ.. దాడికి యత్నించారు. దీంతో అక్కడే ఉన్న బీజేపీ నేతలు.. కార్యకర్తలు నాగంకు రక్షణగా నిలిచారు. ఒక పార్టీ నేత మీడియా సమావేశం పెడితే.. మరోపార్టీ కార్యకర్తలు వచ్చి దాడి చేసే యత్నం చేసే తీరును టీఆర్ ఎస్ అధినేతగా కేసీఆర్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే.. ఇదో విష సంస్కృతిలా మారి.. భవిష్యత్తులో ఆయనకు సైతం ఇబ్బందులకు గురి చేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.