Begin typing your search above and press return to search.

కేసీఆర్ సాబ్‌..మీవాళ్ల ఆవేద‌న జ‌ర చూడు

By:  Tupaki Desk   |   5 Aug 2017 8:38 AM GMT
కేసీఆర్ సాబ్‌..మీవాళ్ల ఆవేద‌న జ‌ర చూడు
X
స‌బ్బండ వ‌ర్గాల‌ను క‌లుపుకొని పోతా...బంగారు తెలంగాణ సాధిస్తా అని ప‌దే ప‌దే చెప్తున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ పై ఇప్పుడు ఆ పార్టీలోనే ఒకింత అసంతృప్తి మొదలువుతోంద‌ని తెలుస్తోంది. ప్ర‌తిప‌క్షాలు బ‌ల‌హీనప‌డటం, ప్ర‌భుత్వ ప‌రంగా పాజిటివ్ స్పంద‌న‌ ఉన్న‌ప్ప‌టికీ పార్టీ నేత‌లుగా త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని గులాబీ నేత‌లు వాపోతున్నారు. సాక్షాత్తు బాస్ కేసీఆర్ ఇచ్చిన మాట నిలుపుకొనేందుకు మూడు నెల‌ల స‌మ‌యం వేచిచూసిన‌ప్ప‌టికీ ఇంకా నిరీక్ష‌ణ త‌ప్ప‌డం లేదంటున్నారు. ఇదంతా పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్న టీఆర్‌ ఎస్ నాయకులు - క్యాడర్ ఆవేద‌న‌!

గులాబీద‌ళ‌ప‌తి కేసీఆర్ తెలంగాణ ఏర్పడక ముందు చివరి సారిగా పూర్తి స్థాయి రాష్ట్ర కమిటీ వేశారు. ఆ తరువాత మూడు ప్లీనరీలు జరిగినా కమిటీల ఊసే లేదు. చివరి సారిగా ఈ ఏడాది ఏప్రిల్ 21న హైదరాబాద్‌ లో జరిగిన ప్లీనరి సందర్భంగా నిబంధనావళిలో మార్పులు చేసి, కమిటీల కాలపరిమితి రెండు నుండి నాలుగేళ్ళకు పెంచారు. అదే ప్లీనరీలో త్వరలోనే టీఆర్‌ ఎస్ అధినేత కేసీఆర్ స్వ‌యంగా...``ఇప్పటివరకు ప్రభుత్వ పనిలో బిజిగా ఉన్నాను. ఇక పార్టీ క్యాడర్ వైపు దృష్టి సారిస్తా. వారిని అదుకునే విషయంపై మంత్రులతో మాట్లాడతా. వెంటనే పార్టీ కమిటీలు - నామినేటెడ్ పదవులను ప్రకటిస్తా` అని ప్రకటించారు. అయితే ప్లీనరీ తరువాత నాలుగు నెలలవుతున్నా, ఇదిగో, అదిగో అంటూ కమిటీలపై కాలయాపన చేస్తున్నారు. మార్కెట్, దేవాలయ కమిటీలు దాదాపు పూర్తయ్యాయి. అయితే అడపాదడపా కార్పొరేషన్ చైర్మన్ - ఇతర నామినేటెడ్ పోస్టులకు నియామకాలు చేసినా, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అటు పార్టీ, ఇటు నామినేటెడ్ పదవులు కలిపి, మొత్తం నాలుగైదు వేలు ఉంటాయని కేసీఆర్ గతంలో పదే పదే ఊరించారు. కాని వాటి భర్తీ మాత్రం ఆస్థాయిలో లేదు. కార్పొరేషన్‌ లకు చైర్మన్‌ లు నియమించినా, ఇంకా డైరెక్టర్‌ లను వేయలేదు. మధ్యలో ఒక సారి ఒకే రోజు నామినేటెడ్ పదవులన్నీ ప్రకటిస్తామని, వెంటనే జాబితాలు ఇవ్వాల్సిందిగా ఎంఎల్‌ ఏలు - మంత్రులకు ఆదేశాలు వెళ్ళాయి. ఆ మేరకు జాబితాలు సిద్ధం చేసినా, కార్యరూపం మాత్రం దాల్చలేదు. జాబితాల్లో కొందరికి పదవులు వచ్చినా చాలా మంది ఆశావాహులకు ఆ భాగ్యం దక్క‌లేదు.

ఇక పార్టీ కమిటీల ఏర్పాటు అనేక మలుపులు తిరిగింది. తొలుత ప్లీనరీకి ముందే గత ఏడాదిలో అన్ని జిల్లాలకు కమిటీలు వేసేందుకు జాబితాలు సిద్ధమయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో కమిటీల ప్రకటనే తరువాయి అనుకున్న తరుణంలో డీమానిటైజేషన్ వచ్చి పడడంతో పార్టీ పదవుల ప్రకటన అటకెక్కింది. ఆ తరువాత అకస్మాత్తుగా అధినేత మదిలో కొత్త ఆలోచన వచ్చి జిల్లా కమిటీల స్థానంలో నియోజకవర్గ కమిటీలు వేయాలని, వాటికి ఎంఎల్‌ఏలనే అధ్యక్షులుగా నియమించాలని, జిల్లాలకు సమన్వయకర్తలను వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్లీనరీలో పార్టీ నిబంధనావళిని సవరించారు. సాధారణంగా పార్టీ కమిటీలు వేశాక, అనుబంధ సంఘాల కమిటీలు ప్రకటిస్తుండడం ఆనవాయితీ. కాని ప్లీనరీ తరువాత ఇటీవల అనుబంధ సంఘాలకు అధ్యక్షులను ప్రకటించారు. ఒక్క విద్యార్థి విభాగానికి మాత్రమే పూర్తి స్థాయి కమిటీలు వేశారు. మిగతావాటికి వేయాల్సి ఉంది. పార్టీ కమిటీలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. వరంగల్ బహిరంగ సభ కాగానే ప్రకటిస్తారన్న కమిటీలు, ఆ తరువాత ఆషాడం ముగియగానే ప్రకటిస్తారన్నారు. శ్రావణం మాసం సగం పూర్తయినా ఇంకా రేపు మాపు అంటూ సాగదీస్తున్నారు. దీంతో పదవుల కోసం టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్ళు దాటిందని, ఎన్నికలకు రెండేళ్ళే గడువుందని, ఇంకా పదవులు ఎప్పుడిస్తారని వారు లోలోపల మథన పడుతున్నారు. కేసీఆర్ సాబ్ త‌న వాళ్ల‌ను కూడా కాస్త ప‌ట్టించుకోవాల‌ని గులాబీ నేత‌లు కోరుతున్నారు.