Begin typing your search above and press return to search.

ఆ పదవులు మాకు వద్దు బాబోయ్!!!

By:  Tupaki Desk   |   15 Dec 2018 6:22 AM GMT
ఆ పదవులు మాకు వద్దు బాబోయ్!!!
X
తెలంగాణలో టీఆర్ ఎస్ ప్రభుత్వం రెండో సారి ఏర్పడిన తరువాత మంత్రి పదవులు సహా మరికొన్ని పదవులను భర్తీ చేయడం మిగిలి ఉంది. అయితే... నాయకులు మాత్రం కొన్ని పదవులు ఇచ్చినా తీసుకోవడానికి ఇష్టపడడం లేదట. కేసీఆర్ - మహమూద్ అలీలతో ఇప్పటికే కేబినెట్ ఏర్పడడంతో మంత్రి పదవులకు ఇంకా కేవలం 16 మందికే చాన్సుంది.. సో... స్పీకర్ - ఇతర కార్పొరేషన్ పదవులు వంటివే నేతలకు పంచిపెట్టడానికి మిగిలి ఉన్నాయి. కానీ, మంత్రి పదవి కాకుండా వేరే పదవి అంటేనే నేతలు భయపడుతున్నారు. అందుకు గత చరిత్రే కారణమని తెలుస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి చరిత్ర చూసుకుంటే కొన్ని పదువులు నాయకుల రాజకీయ భవిష్యత్తును సమాధి చేశాయి. అలాంటి పోస్టుల్లో మొదట చెప్పుకోవాల్సింది స్పీకర్ పోస్టు. ఉమ్మడి రాష్ట్ర చరిత్ర నుంచి తెలంగాణ వరకు అనేక మంది స్పీకర్ గా పనిచేసిన వారు ఆ తరువాత టెర్మ్ లో రాజకీయంగా ఇబ్బంది పడ్డ చరిత్ర ఉంది.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిభా భారతి స్పీకర్‌ గా పనిచేసిన తరువాత రాజకీయంగా ఇక ఎదగలేకపోయారు. వరుస ఓటమిలతో ఇప్పుడు ప్రాభవం కోల్పోయారు. కే.ఆర్ సురేశ్ రెడ్డి స్పీకర్ గా పనిచేసి తర్వాత ఓటమిపాలయ్యారు. ఇప్పటి వరకు ఆయన పాలిటిక్స్ లో సైడ్ అయిపోయారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ అయ్యారు. కానీ ఆయన తదుపరి సిఎం అయినా చివరకు రాజకీయంగా ఉనికిలో లేకుండా పోయారు. నాదెండ్ల మనోహర్ స్పీకర్ అయిన తరువాత ఓడిపోయారు.. ఇప్పుడు పవన్ కల్యాణ్‌ తో కలిసి నడుస్తూ రాజకీయంగా ఏమైనా పట్టుచిక్కుతుందేమో అని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

ఇక తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి కూడా ఈసారి ఎన్నికల్లో ఓటమిచెందారు. అందుకే స్పీకర్ పదవి నాకొద్దంటే నాకొద్దంటున్నట్లు చర్చ సాగుతోంది. ఏ పోస్టు వచ్చినా మంచిదే కానీ ఆ పోస్టు మాత్రం తీసుకోవద్దు అని నాయకుల అనుచరులు ఒత్తిడి తెస్తున్నారట.

ఇలాంటిదే ఇంకో పదవి ఆర్టీసీ చైర్మన్ పోస్టు. ఈ పదవి చేపట్టినవారంతా ఆ తరువాత రాజకీయంగా కనుమరుగైపోవడమో.. లేదంటే నామమాత్రమైపోవడమో జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసి ఛైర్మన్ గా గోనె ప్రకాష్ రావు ఉన్నారు. తర్వాత రాజకీయంగా కనుమరుగయ్యారు. కటకం మృత్యుంజయానిదీ అదే పరిస్థితి. ఎం సత్యనారాయణరావు ఆర్టీసి ఛైర్మన్ పదవి తీసుకున్న తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసి ఛైర్మన్ పదవిని చేపట్టిన సోమారపు సత్యనారాయణ పరిస్థితి కూడా అలాగే ఉంది. తెలంగాణలో కారు జోరు కొనసాగినా సోమారపు సత్యనారాయణ మాత్రం రామగుండంలో సొంత పార్టీ రెబల్ చేతిలోనే ఓటమిపాలయ్యారు.

ఇక ప్రతిపక్షానికి ఇచ్చే పదవుల విషయంలోనూ సెంటిమెంట్లు భయపెడుతున్నాయి. ఏ ప్రభుత్వంలోనైనా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికి దక్కుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అలా పీఏసీ చైర్మన్లుగా పనిచేసిన వారు మరణించడం వల్ల ఇదో నెగటివ్ సెంటిమెంటుగా మారింది. తెలంగాణ తొలుత ఈ పదవిని తీసుకున్న వ్యక్తి నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి. కానీ ఆయన 2015 ఆగస్టులో గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత అదే పోస్టు తీసుకున్న ఖమ్మం జిల్లా పాలేరు సభ్యుడు రాంరెడ్డి వెంకట్ రెడ్డి కూడా 2016 మార్చిలో అనారోగ్యంతో మరణించారు. అంతేకాదు ఆతర్వాత ఆ పదవి గీతారెడ్డి తీసుకున్నారు. గీతారెడ్డి ఈసారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో పీఏసీ చైర్మన్ పదవి అంటే చాలు నేతలు భయపడుతున్నారు.