Begin typing your search above and press return to search.

గ్రేటర్ ప్రచారంలో కనిపించని మెట్రో

By:  Tupaki Desk   |   18 Dec 2015 4:56 AM GMT
గ్రేటర్ ప్రచారంలో కనిపించని మెట్రో
X
హైదరాబాద్ మహానగరంలోని హోర్డింగుల్లో అత్యధిక భాగం గులాబీ రంగును పులుముకోవటం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సర్కారుకు సంబంధించిన ప్రకటనలతో పాటు.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ ఎస్) పార్టీకి సంబంధించిన హోర్డింగులు కలిసిపోయాయి. ఈ రెండింటిలో ఎన్నో సంక్షేమ పథకాల ఉదరగొట్టేస్తున్నారు. ఇప్పటికే ఉన్న వాటితో పాటు.. భవిష్యత్తులో వచ్చే వాటి గురించి ఉదరగొట్టేస్తున్నారు.

నగరంలో ఏర్పాటు చేసిన వందలాది హోర్డింగుల్లో ఏ ఒక్క దాని మీదా మెట్రో రైల్ ఊసే లేకపోవటం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది అయిన సందర్భంలో జరిపిన ప్రచారంలో మెట్రో రైల్ వ్యవహారాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. చాలానే పోస్టర్లు దర్శనమిచ్చాయి. హైదరాబాద్ కు తలమానికం లాంటి మాటలు ఉపయోగించారు. అదేం సిత్రమో కానీ.. తాజాగా గ్రేటర్ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం మెట్రో ఊసే కనిపించని పరిస్థితి.

మెట్రో రైల్ కు సంబంధించి పాతబస్తీలో అలైన్ మెంట్ మార్పు వ్యవహారం వివాదంగా మారటం.. మొదట ఈ విషయం మీద తెలంగాణ అధికారపక్షం మార్పు పక్కా అని చెప్పి.. ఈ మధ్యనే పాల అలైన్ మెంట్ ను కొనసాగించాలని నిర్ణయించటంపై సుల్తాన్ బజార్ వ్యాపారులు.. పాతబస్తీకి చెందిన వారు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో రైల్ ప్రాజెక్టు ఘనతను తమ ఖాతాలో వేసుకుంటే... ఎక్కడ రివర్స్ అవుతుందోనన్న ముందస్తు జాగ్రత్తతోనే.. తమ ప్రచారంలో ఎక్కడా మెట్రో ఊసు తేవటం లేదని తెలుస్తోంది. హైదరాబాద్ రూపురేఖల్ని మార్చేయనున్న మెట్రో ఊసు గ్రేటర్ ఎన్నికల్లో కనిపించకపోవచ్చన్న మాట వినిపిస్తోంది.