Begin typing your search above and press return to search.

రేవంత్, కాంగ్రెస్ లపై తెరాస మైండ్ గేమ్!

By:  Tupaki Desk   |   30 Oct 2017 4:39 AM GMT
రేవంత్, కాంగ్రెస్ లపై తెరాస మైండ్ గేమ్!
X
మైండ్ గేమ్ ఆడుతూ ప్రత్యర్థులలో ఉండే ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టడం, వారి మీద ప్రజలకు ఉండే నమ్మకాన్ని కూడా దెబ్బకొట్టడం.. ఇవాళ్టి ఆధునిక యుద్ధనీతి. తెలంగాణ రాష్ట్ర సమితి... కొత్త శక్తులతో కలిసి తమ మీద దాడికి సిద్ధం అవుతున్న పాత శత్రువు విషయంలో ఇలాంటి మైండ్ గేమ్ నే ఆశ్రయిస్తోంది. రేవంత్ రెడ్డి బలం అనేది కొడంగల్ నియోజకవర్గంలో కూడా పూర్తిగా పలచబడిపోయిందనే అభిప్రాయాన్ని అందరిలోకి తీసుకువెళ్లడానికి నానా తపన పడుతోంది. తాజాగా కూడా కొడంగల్ నియోజకవర్గంలో తెలుగుదేశం ముద్ర ఉన్న కొందరు కార్యకర్తలను తెరాసలో చేర్చుకున్నారు. రేవంత్ రాజీనామా ప్రకటన వచ్చిన తర్వాత.. ఇది రెండోసారి.. తెదేపా నాయకుల చేరికల పర్వం. ఆ రకంగా రేవంత్ స్థయిర్యాన్ని దెబ్బతీయాలని వారు ప్లాన్ చేస్తున్నారు. ఇంత చిన్న నాయకుల చేరికలకు ఏకంగా మంత్రి వచ్చి నిర్వహించడం అంటే అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్ర కాంగ్రెస్ లో ఎన్ని లుకలుకలు ఉన్నప్పటికీ.. రేవంత్ రెడ్డి తమ పార్టీలోకి రావడంపై కాంగ్రెస్ అధిష్టానం మాత్రం చాలా ఆశలే పెట్టుకుని ఉంది. ఆయన వస్తే పార్టీకి కొత్త జవసత్వాలు వస్తాయని, కొత్త ఊపు వస్తుందని వారు భావిస్తున్నారు. ఆయన పార్టీలో చేరిన తర్వాత.. రాష్ట్రస్థాయి కీలకమైన పదవులను కట్టబెట్టే ఆలోచన కూడా చేస్తున్నారు. అయితే.. మీరు రేవంత్ రెడ్డిని రాష్ట్రస్థాయి నేతగా చూస్తే మీకే నష్టం.. ఆయనకు తన సొంత నియోజకవర్గంలోనే నిలకడైన బలం లేదు అని సంకేతాలు ఇవ్వడానికి తెరాస నానా ప్రయత్నాలు చేస్తోంది.

సొంత నియోజకవర్గం కొడంగల్ లో తెలుగుదేశం శ్రేణులే ఆయన మీద భక్తితో పార్టీలో కొనసాగడం లేదని, ఆయన పార్టీ మారిపోతుండగా... ఏకంగా తెరాసలోకి వచ్చేస్తున్నారని అంటే.. ఆయనకేమీ అక్కడ హవా లేదని ఇండికేషన్లు ఇవ్వడానికి వారు ప్రయత్నిస్తున్నారు. కొడంగల్ లో తెలుగుదేశం నాయకుల్ని విడతలు విడతలుగా తెరాసలో చేర్చుకుంటున్నారు. రాహుల గాంధీ రాష్ట్రానికి రావడం - రేవంత్ కు ఆ పార్టీలో పదవులు కట్టబెట్టడానికంటె ముందుగానే.. కొడంగల్ లో ఓ భారీ బహిరంగసభను కేటీఆర్ తో నిర్వహించి.. రేవంత్ కు సొంత ఊరిలోనే బలం లేదని చాటడం అవసరం అనేది తెరాస వ్యూహంగా ఉన్నట్లు తెలుస్తోంది.