Begin typing your search above and press return to search.

పోలింగ్ నాటికి విశ్వరూపమే

By:  Tupaki Desk   |   13 Dec 2015 5:42 AM GMT
పోలింగ్ నాటికి విశ్వరూపమే
X
ఎన్నికలు వచ్చాయంటే.. పోటీ.. ప్రచారం.. పోలింగ్.. ఫలితాలు లాంటి ప్రక్రియలు ఉంటాయి. కానీ.. గులాబీ బాస్ పుణ్యమా అని వీటిల్లో చాలానే దశలు అసలు లేకుండానే పోతున్నాయి. ఆపరేషన్ స్మాష్ అన్నట్లు చేస్తున్న ప్రయత్నాలతో.. ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులు హ్యాండ్ ఇవ్వటం.. మరికొన్ని చోట్ల అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశమే లేకుండా పోయింది. దీంతో.. మొత్తం 12 స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అయ్యే సమయానికి ఆరు చోట్ల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.

తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు 12 స్థానాలకు జరుగుతున్న మండలి ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలు.. వరంగల్.. మెదక్.. అదిలాబాద్.. నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్క స్థానంలో ఏకగ్రీవం అయ్యాయి. ఇక.. పోటీ జరగనున్న ఆరు నియోజకవర్గాలు జిల్లాల వారీగా చూస్తే.. రంగారెడ్డి జిల్లాలో 2,మహబూబ్ నగర్ లో 2 స్థానాలు.. నల్గొండ.. ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరిగిపోయాయి.

మొత్తం ఆరు స్థానాలకు జరిగే పోలింగ్ కు 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీటిల్లో రంగారెడ్డి.. మహబూబ్ నగర్.. ఖమ్మం జిల్లాల్లో ఐదుగురు చొప్పున అభ్యర్థులు ఉంటే.. నల్గొండ జిల్లాలో నలుగురు అభ్యర్థులు తుదిపోటీలో నిలిచారు. మండలికి జరిగే స్థానిక ఎన్నికల్లో యాభై శాతం స్థానాలు ఏకగ్రీవం కావటంతో టీఆర్ ఎస్ ఖాతాలోకి సగం గెలుపు వెళ్లిపోయింది. పోలింగ్ కు ముందే.. తనదైన శైలిలో షాకిచ్చిన తెలంగాణ అధికారపక్షం దెబ్బకు.. తెలంగాణ విపక్షాలు విలవిలాడుతున్న పరిస్థితి. నామినేషన్ల సమయంలోనే తానేమిటన్నది చూపించిన టీఆర్ ఎస్ పోలింగ్ లో విశ్వరూపం చూపించటం ఖాయమని చెబుతున్నారు.