Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్‌:ఇప్పుడు కొంగ‌ర క‌లాన్ ద‌గ్గ‌ర ఏం జ‌రుగుతోంది?

By:  Tupaki Desk   |   1 Sep 2018 5:41 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్‌:ఇప్పుడు కొంగ‌ర క‌లాన్ ద‌గ్గ‌ర ఏం జ‌రుగుతోంది?
X
జ‌న సంద్రాన్ని త‌ల‌పించేలా భారీ స‌భ‌ను ఏర్పాటు చేయాల‌ని.. పాతిక ల‌క్ష‌ల మందితో స‌భ మొత్తం నిండిపోవాల‌న్న ఆలోచ‌న కేసీఆర్ కు ఎప్ప‌టి నుంచో ఉంది. తెలంగాణ ఆవిర్భావ స‌మ‌యంలోనూ.. ఆ త‌ర్వాత ప‌లు సంద‌ర్భాల్లో ఇదే విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. మంచిగా స‌భ పెట్టుకుందామ‌న్న మాట ఆయ‌న నోటి నుంచి త‌ర‌చూ వ‌చ్చేది. దానికి త‌గ్గ‌ట్లుగా.. తాజాగా నిర్వ‌హిస్తున్న ప్ర‌గ‌తి నివేద‌న స‌భ చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆదివారం మ‌ధ్యాహ్నానానికి 20 ల‌క్ష‌ల మార్క్ ను దాటేలా జ‌న‌స‌మీక‌ర‌ణ కోసం టీఆర్ ఎస్ నేత‌లు భారీ ఎత్తున ప్ర‌య‌త్నాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే.. శుక్ర‌వారం రాత్రికి స‌భ నిర్వ‌హిస్తున్న కొంగ‌ర క‌లాన్ ఎలా ఉంది? అక్క‌డ ఎంత‌మంది ఉన్నారు? స‌భ‌కు 36 గంట‌ల ముందు కొంగ‌ర గ్రౌండ్ రిపోర్ట్ ఏమిటి? అన్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానాలు వ‌స్తున్నాయి.

ఆదివారం సాయంత్రం జ‌రిగే స‌భ కోసం ఇప్ప‌టికే కొంద‌రు వ‌చ్చేయ‌టం విశేషం. వీరి సంఖ్య వేల‌ల్లో ఉంది. ఒక‌టిన్న‌ర రోజుల ముందే వారెందుకు వ‌చ్చారంటే.. టీఆర్ ఎస్ మీద వారి అభిమానం అలాంటిది. ఇక‌.. స‌భ కోసం కేటాయించిన పోలీసులు సైతం పెద్ద ఎత్తున స‌భా ప్రాంగ‌ణం వ‌ద్ద‌కు చేరుకున్నారు.

అప్ప‌టిక‌ప్పుడు వేలాది మంది సిబ్బందిని త‌ర‌లించ‌టం క‌ష్టం కావ‌టంతో శుక్ర‌వారం రాత్రికే అధికారుల్ని స‌భా వేదిక వ‌ద్దకు చేరుకునేలా ప్లాన్ చేశారు. చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా స‌భ‌ను నిర్వ‌హించాల‌ని త‌పిస్తున్న సీఎం కేసీఆర్ క‌ల‌ను నిజం చేసేందుకు పెద్ద ఎత్తున కూలీలు.. ఇత‌ర విభాగాల‌కు చెందిన వారు పెద్ద ఎత్తున ప‌నులు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. శుక్ర‌వారం రాత్రికి 20 వేల మంది వ‌ర‌కూ సభాప్రాంగ‌ణం వ‌ద్ద ఉండి.. అదో జాత‌ర‌ను త‌ల‌పించేలా ఉంది.

ఇక‌.. శ‌నివారం ఉద‌యం నాటికి ఈ సంఖ్య 30 నుంచి 40వేల మంది వ‌ర‌కూ ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఇక‌.. ట్రాక్ట‌ర్ల‌లో ఊళ్ల నుంచి బ‌య‌లుదేరే వారంతా శ‌నివారం సాయంత్రం.. అంటే ఒక రోజు ముందే స‌భా ప్రాంగ‌ణానికి చేరుకుంటార‌ని చెబుతున్నారు. ఇక‌.. స‌భ‌ను నిర్వ‌హిస్తున్న కొంగ‌ర క‌లాన్ ఇప్పుడెలా ఉంద‌న్న విష‌యాన్ని చూస్తే..

+ ప్ర‌ధాన వేదిక గులాబీ రంగులో ఇల్లులా త‌యారైంది. వంద‌లాది కుర్చీలు వేదిక మీద ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు అవ‌స‌ర‌మైన కుర్చీలు వ‌చ్చేశాయి.

+ స‌భ భారీత‌నాన్ని తెలియ‌జేసే మైకులు వ‌చ్చేశాయి. అంతేనా.. సీసీ కెమేరాలు ఏర్పాటు.. పార్కింగ్ స్లాట్ రెఢీ అయిపోయింది.

+ ఇవాల్టి రోజు ఏం ఉన్నా లేకున్నా.. చేతిలో సెల్ ఫోన్ ఉండాల్సిందే. మ‌రి.. ల‌క్ష‌లాది మంది సెల్లులు ప‌ని చేయాలంటే మాట‌లా? అందుకే.. నాలుగు సెల్ ట‌వ‌ర్ల‌ను ప్ర‌త్యేకంగా స‌భ కోసం నిర్మిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. స‌భ‌కు హాజ‌ర‌య్యేందుకు వివిధ ప‌ల్లెల నుంచి శుక్ర‌వారం రాత్రి నుంచే జ‌నం త‌ర‌లింపు మొద‌లైంది.

+ స‌భా ప్రాంగ‌ణం మొత్తం గులాబీ రంగుతో నిండింది. ద్వారాలు.. రాఖీలు.. బెలూన్లు.. జెండాలు.. పోస్ట‌ర్లు.. కటౌట్లు.. ఇలా ఒక‌టి ఉంది.. ఒక‌టి లేద‌న్న‌ట్లు కాకుండా మొత్తంగా గులాబీ రంగుతో స‌భా ప్రాంగ‌ణం నిండిపోయింది. స‌భా ప్రాంగ‌ణంలో అడుగ‌డుగునా.. నాలుగున్న‌రేళ్ల‌లో కేసీఆర్ స‌ర్కారు సాధించిన విజ‌యాలను ప్ర‌ద‌ర్శించారు.

+ ఇప్ప‌టివ‌ర‌కూ ఇంత భారీ స్థాయిలో స‌భ‌ను ఏర్పాటు చేయ‌ని నేప‌థ్యంలో.. ఎలాంటి గంద‌ర‌గోళానికి గురి కాకుండా ఉండేందుకు ప్రాంగ‌ణాన్ని సెక్టార్లుగా విభ‌జించి.. బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఒక్కో సెక్టార్ కు ఒక్కో ఎస్పీ స్థాయి అధికారికి బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

+ స‌భ మొత్తం 1600 ఎక‌రాల్లో జ‌రుగుతుండ‌గా.. ఇందులో 1200 ఎక‌రాల్ని కేవ‌లం పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు. ఇంత‌కీ.. ఈ స‌భ కోసం సేక‌రించిన 1600 ఎక‌రాలు ఎవ‌రివి? అంటే.. ప్ర‌భుత్వానికి కొంత అయితే ప్రైవేటు వ్య‌క్తుల‌కు కొంత‌. వారి భూమిని వాడుకుంటున్నందుకు వీలుగా వారికి కొంత మొత్తాన్ని ప‌రిహారంగా ఇవ్వ‌నున్నారు.

+ మొత్తంగా 11 ప్రాంతాల్లో పార్కింగ్ లాట్స్ ఏర్పాటు చేశారు. 500 మీట‌ర్ల దూరంలోని దృశ్యాల్ని సైతం స్ప‌ష్టంగా రికార్డు చేసే సామ‌ర్థ్యం ఉన్న‌200 సీసీ కెమెరాలు.. 4 మౌంటెయిన్డ్ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. స‌భా ప్రాంగ‌ణంలోని ప్ర‌తి దృశ్యాన్ని స్ప‌ష్టంగా రికార్డు చేసేలా కెమెరాల ఏర్పాటు ఉంది.

+ సీసీ కెమేరాల ఫుటేజ్ ను ప‌ర్య‌వేక్షించేందుకు వీలుగా భారీ కంట్రోల్ సెంట‌ర్ ను ఏర్పాటు చేశారు.

+ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల కోసం 30 అంబులెన్స్ లు ఏర్పాటు చేశారు.

+ ఒక లైటింగ్ కోసం 130 స్తంభాల్ని ఏర్పాటు చేశారు. ఒక్కో స్తంభానికి భారీ ఎత్తున 28 లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. స్పీక‌ర్ల కోసం 30 స్తంభాల్ని ఏర్పాటు చేసి.. ఒక్కో స్తంభానికి 10 లౌడ్ స్పీక‌ర్ల‌ను ఏర్పాటు చేశారు.

+ స‌భ‌కు వ‌చ్చే వారి దాహాన్ని తీర్చ‌టానికి 3.5ల‌క్ష‌ల తాగునీటిని త‌ర‌లిస్తున్నారు. ఇందులో 2 ల‌క్ష‌ల లీట‌ర్లు జ‌ల‌మండ‌లి స‌ర‌ఫ‌రా చేస్తుండ‌గా.. మ‌రో ల‌క్ష లీట‌ర్ల‌ను ప్రైవేటు కంపెనీల ద్వారా తీసుకొస్తున్నారు. 150 ట్యాంక‌ర్ల‌లో నీటిని కూక‌ట్ ప‌ల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు త‌ర‌లిస్తున్నారు. అంతేనా.. నీటి స‌మ‌స్య త‌లెత్త‌కుండా ఉండేలా స‌భాస్థ‌లికి ద‌గ్గ‌ర్లో ఫిల్లింగ్ స్టేష‌న్ ను ఏర్పాటు చేశారు.

+ స‌భ కు సంబంధించి ఏర్పాటు చేస్తున్న భారీ ఫ్లెక్సీల్లో.. కేసీఆర్ మ‌ళ్లీ రావాల‌న్న నినాదాన్ని కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించేలా ఉండ‌టం గ‌మ‌నార్హం. ముంద‌స్తు అంచ‌నాల నేప‌థ్యంలో కేసీఆర్ మ‌ళ్లీ రావాల‌న్న మాటతో.. ముంద‌స్తు విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పినట్లు ఉందంటున్నారు.

+ వాహనాలను క్రమపద్ధతిలో పార్కింగ్‌ చేసేందుకు వలంటీర్ల సేవలను వినియోగించుకుంటున్నారు. ఎంపిక చేసిన 15 పార్కింగ్‌ స్థలాల్లో వాహనదారులకు సూచనలు, సలహాలిచ్చేందుకు 400 మందిని టీఆర్ఎస్‌ రంగంలోకి దించింది.

+ అస్వస్థతకు గురైతే తక్షణమే చికిత్స అందించేందుకు 200 మంది వైద్య సిబ్బందిని రంగంలోకి దించారు.

+ ఎంపీలు మల్లారెడ్డి, బూర నర్సయ్యగౌడ్‌లకు సంబంధించిన ఆస్పత్రుల సిబ్బంది ఉచితంగా ఆరోగ్య సేవలు అందించేందుకు ముందుకొచ్చారు.

+ స‌భ‌ను ఎక్క‌డ నుంచైనా తిల‌కించేందుకువీలుగా 250 ఎల్ఈడీ స్క్రీన్ల‌ను సిద్ధం చేశారు.

+ 25వేల మంది పోలీసు సిబ్బందితో స‌భ‌కు ర‌క్ష‌ణ బాధ్య‌త‌లు చేప‌ట్టిన పోలీసుల‌కు తోడుగా 36 డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు సభా ప్రదేశాన్ని జల్లెడ పడుతున్నాయి.

+ శనివారం రాత్రికే 10 వేల ట్రాక్టర్లలో లక్ష మంది రానున్నారు. వీరి కోసం వండ‌ర్ లా స‌మీపంలోనూ.. ఫ్యాబ్ సిటీ లోప‌ల మొత్తం 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్ర‌త్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశారు. వారి వంట కోసం వంట చెరుకు.. ట్యాంక‌ర్ల‌తో నీరు.. విద్యుత్ సౌక‌ర్యాన్ని క‌ల్పించారు.

+ పార్కింగ్ స్థలాల్లో బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

+ భద్రతకు పోలీసులపైనే కాకుండా ప్రైవేటు సెక్యూరిటీని కూడా రంగంలోకి దించుతోన్నారు. 300 మంది బౌన్సర్లను సభాస్థలిలో అందుబాటులో ఉండ‌నున్నారు.

+ స‌భ కోసం వ‌చ్చే వారికి ఇబ్బంది క‌లుగ‌కుండా 300 టాయిలెట్లు నిర్మించారు.

+ సభకు వచ్చిన వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు 16 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక గ్యాల‌రీ నుంచి మ‌రో గ్యాల‌రీలోకి వెళ్ల‌కుండా ఉండేలా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఒక‌వేళ తొక్కిస‌లాట చోటు చేసుకుంటే.. ఒక గ్యాల‌రీకే ప‌రిమిత‌మ‌య్యేలా ఈ ఏర్పాటు ఉంద‌ని చెప్పాలి. తూర్పున 3 - పడమరన 3 - ఉత్తరాన 4 - దక్షిణాన 4 - మీడియా - వీఐపీలకు ఒక్కొక్కటి చొప్పున గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

+ ఖమ్మం నుంచి 1890 ట్రాక్ట‌ర్లు వినూత్నంగా ముస్తాబై స‌భ కోసం బ‌య‌లుదేరాయి.