Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల్లో గులాబీ బ్యాచ్ నినాదం ఇదేన‌ట‌!

By:  Tupaki Desk   |   11 Aug 2018 6:44 AM GMT
ఎన్నిక‌ల్లో గులాబీ బ్యాచ్ నినాదం ఇదేన‌ట‌!
X
గుర్తుందా?.. కేసీఆర్ కు సారు.. దొర మాట‌లంటే అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ ఎస్ స‌ర్కారు కొలువు తీరిన మొద‌ట్లో.. చాలామంది ఆయ‌న్ను సారూ అని.. దొర అన్న మాట‌ల్ని ప్రేమ‌తో పిలిచేవారు. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు మాత్రం ఆ మాట‌ల్నే ఆయుధాలుగా మ‌ల్చుకొని టీఆర్ ఎస్ అధినేతపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డేవారు.

ఈ ప‌దాల ప్ర‌యోగం పెరిగే కొద్దీ. త‌న‌కు ఇబ్బంది అన్న విష‌యాన్ని గుర్తించిన కేసీఆర్‌.. ఈ రెండు ప‌దాల‌తో త‌న‌ను విల‌వొద్ద‌ని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. మీడియాలో వ్యంగ్యంగా ఎప్పుడైనా ఈ ప‌దాల్ని వాడితే ఊరుకునేది లేద‌న్న మాట‌ను కూడా ఆయ‌న నోటి నుంచి వ‌చ్చేది.

అస‌లే కేసీఆర్‌. అందునా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న ఆయ‌న‌తో పెట్టుకొని పోరాడే శ‌క్తి.. యుక్తి ఉన్న మీడియా సంస్థ‌లు లేని నేప‌థ్యంలో సారు చెప్పిన చందంగా.. ఆయ‌న మాట‌ను శిలాశాస‌నంగా భావిస్తూ.. ఆ ప‌దాల్ని వాడ‌ట‌మే మానేశారు.

వాస్త‌వంగా అయితే.. ఏ విష‌య‌మీద‌నైనా ఏ ముఖ్య‌మంత్రి అయినా ఇదే త‌ర‌హాలో వ్యాఖ్య‌లు చేస్తే.. అదే ప‌నిగా వాడుతూ.. ఇరిటేట్ చేయ‌టం.. ఒక‌వేళ అలాంటి ప్ర‌యోగాల్ని త‌ప్పు ప‌డితే.. మీడియాకు స్వేచ్ఛ లేదా? సీఎం త‌మ భావ‌స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేసే వారు. కానీ.. సీఎం కుర్చీలో కూర్చున్న‌ది కేసీఆర్ కావ‌టంతో చ‌ప్పుడు చేసేందుకు ఇష్ట‌ప‌డ‌ని ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. రానున్న ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ పార్టీ ఎన్నిక‌ల నినాదాన్ని రెఢీ చేసేశారు. ప్ర‌జ‌ల్లోకి ఇట్టే వెళ్ల‌టంతో పాటు.. ఈ నినాద‌మే రానున్న ఎన్నిక‌ల్లో ఆయుధంగా మార‌నుంది. కేసీఆరే మా సారు అన్న నినాదంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా చెబుతున్నారు.

త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో అమ‌లు చేసిన ప‌థ‌కాలు.. వాటిపై ప్ర‌జ‌ల్లో ఉన్న ప్ర‌భావంపై ఇప్ప‌టికే ప‌లుమార్లు స‌ర్వేలు చేయించిన కేసీఆర్‌.. ఇప్పుడున్న సానుకూల‌త‌ల దృష్ట్యా షెడ్యూల్ కంటే ముందుగా ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఈ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ నినాదంగా కేసీఆరే మా సారు అన్న మాట‌నే ఆయుధంగా మార్చుకోవాల‌ని భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమంటే.. కేసీఆర్ కు ఏ మాత్రం న‌చ్చ‌ని మాట‌నే రానున్న ఎన్నిక‌ల నినాదంగా కేసీఆర్ సిద్ధం చేసుకోవ‌టం. కాలంతో పాటు అభిప్రాయాలు మారిన‌ట్లే.. సారూ పదం మీదా దొర‌వారికి మ‌న‌సైన‌ట్లుంది!