Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు హరీశ్ బర్త్ డే గిఫ్టుగా 'ఖేడ్'బరీ

By:  Tupaki Desk   |   16 Feb 2016 7:01 AM GMT
కేసీఆర్ కు హరీశ్ బర్త్ డే గిఫ్టుగా ఖేడ్బరీ
X
తెలంగాణ సీఎం, టీఆరెస్ అధినేత కేసీఆర్ కు పుట్టిన రోజుకు ఒక రోజు ముందుగా ఆయన మేనల్లుడు, తెలంగాణ మంత్రి హరీశ్ రావు అద్భుతమైన కానుక ఇచ్చారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డిని తిరుగులేని మెజారిటీతో గెలిపించి మామను ఖుషీ చేశారు. బుధవారం పుట్టిన రోజు జరుపుకొంటున్న కేసీఆర్ కు హరీశ్ రావు ''ఖేడ్''బరీ కానుకగా ఇచ్చారు.

నారాయణఖేడ్‌ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి భూపాల్‌రెడ్డి 53,625 ఓట్ల మెజార్టీతో సమీప కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. 21 రౌండ్ల పాటు సాగిన ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌లోనూ టీఆర్‌ ఎస్‌ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్లింది. దీంతో ప్రతిపక్షాలకు అందనంత దూరంలో ఆధిక్యాన్ని కనబరుస్తూ భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్‌ గెలుపొందింది. టీఆర్‌ ఎస్‌ విజయం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా తామిచ్చే కానుకని మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఉప ఎన్నికలో టీఆర్‌ ఎస్‌ విజయం సాధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నారాయణఖేడ్‌ ప్రజలు సానుభూతి పవనాలను పక్కనబెట్టి అభివృద్ధికే పట్టం కట్టారని అన్నారు. గొప్ప విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కాగా ఈ ఉప ఎన్నికలో టీడీపీ డిపాజిట్‌ గల్లంతయ్యింది. 21 రౌండ్ల పాటు సాగిన ఓట్ల లెక్కింపులో టీఆర్‌ ఎస్‌ 93,076 ఓట్లు, కాంగ్రెస్‌ 39,451 ఓట్లు, టీడీపీ 14,787 ఓట్లు దక్కించుకున్నాయి. దీంతో టీఆర్‌ ఎస్‌ అభ్యర్థి భూపాల్‌ రెడ్డి 53,625 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. కాగా సిట్టింగ్‌ స్థానమైన కాంగ్రెస్‌ డిపాజిట్‌ సాధించడంతో కొంత మేరకు పరువు దక్కించుకుంది. ఇక తెలుగుదేశం పార్టీ డిపాజిట్‌ సైతం కోల్పోయి మూడో స్థానానికి పరిమితమైంది.