Begin typing your search above and press return to search.

మూడు స్థానాల కోసం మొహ‌రించిన గులాబీ సైన్యం!

By:  Tupaki Desk   |   30 May 2019 5:09 AM GMT
మూడు స్థానాల కోసం మొహ‌రించిన గులాబీ సైన్యం!
X
ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా వ‌స్తున్న ఎన్నిక‌ల్లో విజ‌యాన్ని వ‌రుస పెట్టి సాధించ‌టం ఎవ‌రికైనా క‌ష్ట‌మే. కానీ.. అలాంటి ఇబ్బందిని ప‌ట్టించుకోకుండా.. ఎన్నిక‌ల్లో వరుస విజ‌యాల్ని సాధిస్తున్న గులాబీ ద‌ళానికి.. తాజాగా వెలువ‌డిన లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు దిమ్మ తిరిగిపోయేలా షాకిచ్చాయి.

మితిమీరిన గెలుపు ధీమాతో పాటు.. ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న అసంతృప్తిని గుర్తించే విష‌యంలో దొర్లిన పొర‌పాట్లే తమ ఓట‌మికి కార‌ణ‌మ‌న్న విష‌యాన్ని గుర్తించిన గులాబీ బాస్ ఇప్పుడు అలెర్ట్ గా ఉంటున్నారు. తాజాగా మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు స్థానిక సంస్థ‌ల ద్వారా ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ గెలుపు ప‌క్కా అయిన‌ప్ప‌టికీ.. ఛాన్స్ తీసుకోవ‌టానికి ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌టం లేదు కేసీఆర్‌.

రంగారెడ్డి.. వ‌రంగ‌ల్.. న‌ల్గొండ స్థానిక సంస్థ‌ల ద్వారా ఎన్నిక‌య్యే ఎమ్మెల్సీ స్థానాల్ని త‌మ ఖాతాలో ప‌డాల‌ని.. ఎలాంటి త‌ప్పు చోటు చేసుకోకూడ‌ద‌న్న గులాబీ బాస్ ఆదేశాల నేప‌థ్యంలో టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వ‌యంగా రంగంలోకి దిగారు. పార్టీ అభ్య‌ర్థుల గెలుపుకోసం ఆయ‌న ప‌క్కా వ్యూహాన్ని సిద్ధం చేశారు.

ఇందులో భాగంగా ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఎన్నిక‌ల బాధ్య‌త‌ను ప‌లువురు టీఆర్ ఎస్ నేత‌ల‌కు అప్ప‌గించారు. ఒక్కొక్క‌రికి ఒక్కో ప‌ని అప్ప‌జెప్పి.. వారంతా స‌మ‌న్వ‌యంతో పని చేయాల‌ని ఆదేశించారు. దాదాపుగా అన్ని జిల్లాల మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ఎన్నిక‌లు జ‌రుగుతున్న మూడు జిల్లాల్లో మొహ‌రించారు. ఈ ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు అయిన ఎంపీటీసీలు.. జెడ్పీటీసీలు..కార్పొరేట‌ర్లు.. కౌన్సిల‌ర్లు ఓట‌ర్లు అయిన నేప‌థ్యంలో వారంద‌రికి ఓటు ఎలా వేయాల‌న్న అంశంపై అవ‌గాహ‌న క‌ల్పించ‌టం గ‌మ‌నార్హం.

ఈ ఎన్నిక‌ల్లో పార్టీ గుర్తులేమీ ఉండ‌వు. కేవ‌లం అభ్య‌ర్థుల ఫోటోలు మాత్ర‌మే ఉంటాయి. అంకెల ప్రాతిప‌దిక‌న ఓట్లు వేయాల్సి ఉంటుంది. ప‌లువురు నేత‌లకు ఈ త‌ర‌హా ఎన్నిక‌లు కొత్త కావ‌టంతో వారంద‌రికి న‌మూనా పోలింగ్ ఏర్పాటు చేసి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. తాజా ఎన్నిక‌ల విష‌యంలో టీఆర్ఎస్ అప్ర‌మ‌త్త‌త చూస్తే.. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఫ‌లితం తేడా రాకూడ‌ద‌న్న పట్టుద‌ల కొట్టొచ్చిన‌ట్లుగా కనిపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇదిలా ఉంటే.. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ గెలుపు అవ‌కాశాలు చూస్తే.. దండిగా ఉన్నాయ‌నే చెప్పాలి. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో 812 ఓట్లు ఉంటే.. ఇందులో టీఆర్ ఎస్ వి 650.. న‌ల్గొండ‌లో 1086 ఓట్ల‌కు 730 ఓట్లు గులాబీ ద‌ళానివే. ఇక‌.. వ‌రంగ‌ల్ జిల్లాలో 905 ఓట్ల‌కు 742 ఓట్లు కేసీఆర్ పార్టీవే. గెలుపు అవ‌కాశాలు భారీగా ఉన్నా.. మొన్న‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితం నేప‌థ్యంలో అత్యంత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇంత జాగ్ర‌త్త‌గా ఉన్నాక‌.. గెల‌వ‌కుండా ఉంటారా?