Begin typing your search above and press return to search.

నంద్యాల సీన్‌...సింగ‌రేణిలో రిపీట్ అయ్యిందే!

By:  Tupaki Desk   |   6 Oct 2017 4:22 AM GMT
నంద్యాల సీన్‌...సింగ‌రేణిలో రిపీట్ అయ్యిందే!
X
తెలంగాణ స‌ర్కారుకు చేతి నిండా ఆదాయం తెచ్చిపెడుతున్న సింగ‌రేణి కాల‌రీస్‌ లో అధికార పార్టీగా టీఆర్ ఎస్ త‌న స‌త్తాను చాటుకుంది. సింగ‌రేణి కాల‌రీస్ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అనుబంధ కార్మిక సంఘం తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఘ‌న విజ‌యం సాధించింది. నిన్న ఉద‌యం నుంచి ప్రారంభ‌మైన పోలింగ్ సాయంత్రి దాకా నిర్విరామంగా కొన‌సాగింది. ఆ త‌ర్వాత రాత్రి పొద్దు పోయేదాకా కౌంటింగ్ జ‌గ‌ర‌గా...కాల‌రీస్‌లోని అన్ని విభాగాలు - ప్రాంతాల్లో టీబీజీకేఎస్ స్ప‌ష్ట‌మైన ఆధిక్యాన్ని సాధించింది. మొత్తం 11 ప్రాంతాల‌కు సంబంధించి విడివిడిగానే ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా, ఒక్క చోట మిన‌హా మిగిలిన 10 ప్రాంతాల్లో గులాబీ జెండానే రెప‌రెప‌లాడింది. ఒక్క మంద‌మ‌ర్రిలో మాత్రం సీపీఐ అనుబంధ కార్మిక సంఘంగా బ‌రిలోకి దిగిన ఏఐటీయూసీ విజ‌యం సాధించింది.

అయినా ఈ ఎన్నిక‌ల్లో ఇంత‌కు మించిన ఫ‌లితం వ‌స్తుంద‌ని ఏ ఒక్క‌రూ ఆశించ‌లేదు. అస‌లు టీబీజీకేఎస్ త‌ప్ప మిగిలిన కార్మిక సంఘాలు అస‌లు క‌నీస సంఖ్య‌లో ఓట్లు కూడా సాధించ‌డం దుస్సాధ్య‌మేన‌న్న వాద‌న కూడా వినిపించింది. ఎందుకంటే... తెలంగాణ ఉద్యమం ఫ‌లితాన్ని రాబ‌ట్టిన పార్టీగా టీఆర్ ఎస్‌ కు ప్ర‌జ‌ల్లో మంచి గుర్తింపే ఉంది. అంత‌కుమించి గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో పార్టీ అధికారంలో లేకున్నా కూడా టీబీజీకేఎస్ స‌త్తా చాటింది. బ‌రిలోకి దిగిన తొలి ఎన్నిక‌ల్లోనే టీబీజీకేఎస్ ఘ‌న విజ‌యం సాధించింది. నాడు తెలంగాణ ఉద్య‌మం పీక్ స్టేజ్‌ లో జ‌రుగుతున్న నేప‌థ్యం నాడు ఆ సంఘానికి తోడ్పాటును అందించగా, ఇప్పుడు పార్టీనే అధికారంలోనే ఉండ‌టంతో అస‌లు టీబీజీకేఎస్ ఓడిపోతుంద‌ని ఏ ఒక్క‌రు కూడా అంచ‌నా వేయ‌రు క‌దా. అంతా అనుకున్న‌ట్లుగానే ఫ‌లితం రాగా.. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌స్తావించుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఆ వివ‌రాల్లోకి వెళితే... తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఆవిర్భ‌వించిన త‌ర్వాత సింగ‌రేణి కాల‌రీస్‌ లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక‌లు ఇవే ప్రథ‌మం. ఈ ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ ఎస్‌ తో పాటు ఆ పార్టీ కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ ను ఎలాగైనా మ‌ట్టి క‌రిపించాల‌ని నిర్ణ‌యించుకున్న కాంగ్రెస్ - టీడీపీలు త‌మ సిద్ధాంతాల‌ను ప‌క్క‌కు పెట్టి మరీ చేతులు క‌లిపాయి. ఈ రెండు పార్టీల‌తో సీపీఐ కూడా చేతులు క‌లిపేసింది. వెర‌సి మూడు ప్ర‌ధాన పార్టీలు క‌లిసిపోయి... టీఆర్ ఎస్ స్పీడుకు బ్రేకులు వేసేందుకు య‌త్నించాయ‌న్న మాట‌. అయితే ప్ర‌జ‌ల నాడీని ప‌ట్టుకోవ‌డంలో సిద్ధ‌హ‌స్తుడిగా పేరున్న టీఆర్ ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు వ్యూహాల ముందు ఈ మూడు పార్టీల ఎత్తులు చిత్తులైపోక త‌ప్ప‌లేదు. అస‌లు త‌మ పార్టీలు ఏ ఉద్దేశాల‌తో అయితే పుట్టాయో... ఆ ఉద్దేశాల‌ను ప‌క్క‌న‌ప‌డేసి మ‌రీ.. కేసీఆర్‌ ను ఓడించ‌డ‌మ‌నే ఒకే ఒక్క అజెండాతో ఆ మూడు పార్టీలు జ‌ట్టుక‌ట్టిన వైనాన్నియ సింగ‌రేణి కార్మికులు జీర్ణించుకోలేక‌పోయార‌నే చెప్పాలి. ఫ‌లితంగానే రెండో ప‌ర్యాయం వారు టీబీజీకేఎస్‌ కే ప‌ట్టం క‌ట్టారు.

అయినా ఈ ఎన్నిక‌ల‌ను కేసీఆర్ కూడా అం ఈజీగా ఏమీ తీసుకోలేద‌నే చెప్పాలి. ఎందుకంటే మూడున్న‌రేళ్ల పాల‌న‌తో త‌మపై ప్ర‌జ‌ల్లో ఎంతో కొంత వ్య‌తిరేక‌త ఉంటుంద‌న్న‌ విష‌యాన్ని కేసీఆర్ ఎప్పుడో ప‌సిగ‌ట్టేశారు. ఆ వ్య‌తిరేక‌త‌ను సానుకూల‌త‌గా మ‌ల‌చుకోవ‌డంతో పాటు స‌ద‌రు సానుకూల‌త‌ను బ్యాలెట్ బాక్సుల్లోకి ర‌ప్పించుకునేందుకు కేసీఆర్ చాలా ప‌క్కా ప్లానే వేశార‌ని చెప్పాలి. ఇందులో భాగంగానే ఎన్న‌డూ లేనిది... ఒకేసారి రెండు పండుగ‌ల బోన‌స్‌ల‌తో పాటు సింగ‌రేణి లాభాల్లోకార్మికులు ఇస్తున్న వాటాను ఓ రెండు శాతం పెంచేసి 25 శాతం మేర ఫ్రాఫిట్ షేర్‌ను పండుగ‌ల బోన‌స్‌ల‌తో క‌లిపి కార్మికుల ఖాతాల్లోప‌డేశారు. ఈ జ‌మా బందీ మొత్తం ఎన్నిక‌ల‌కు ఓ నాలుగు రోజులు ముందుగా జ‌రిగేలా చూసుకోవ‌డంలోనూ కేసీఆర్ త‌న ప్లాన్‌ను ప‌క్కాగా అమ‌లు చేసేశార‌నే చెప్పాలి. వెర‌సి క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు వ్య‌వ‌హరించిన తీరు మాదిరిగానే ముందుకు సాగిన కేసీఆర్‌.. సింగ‌రేణి కాల‌రీస్‌పై త‌న పార్టీ జెండాను ఎగుర‌వేయ‌డంలో కృత‌కృత్యుల‌య్యార‌నే చెప్పాలి.

ఇక చివ‌రి అంశంగా సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ మంద‌మ‌ర్రిలో టీబీజీకేఎస్‌ను మ‌ట్టిక‌రిపించిన వైనాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించుకోవాలి. ఎందుకంటే... గ‌తంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ టీబీజీకేఎస్ నేత‌లే విజ‌యం సాధించారు. అయితే ఈ ద‌ఫా మంద‌మ‌ర్రిలో మాత్రం టీబీజీకేఎస్‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. టీడీపీ, కాంగ్రెస్ అనుబంధ సంఘాల‌తో క‌లిసి బ‌రిలోకి దిగిన ఏఐటీయూసీ సాధించిన ఈ చిన్న‌పాటి విజ‌యాన్ని అంత పెద్ద‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏమీ లేకున్నా.. ఓ మూడు పార్టీలు జ‌ట్టుక‌డితేనే 11 స్థానాల్లో ఓ స్థానంలో ఓట‌మి చెంద‌డం టీఆర్ ఎస్ చాలా సీరియ‌స్‌ గా తీసుకోవాల్సిన ప‌రిణామ‌మే అని చెప్ప‌క త‌ప్ప‌దు. అంటే ఏడాదిన్న‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఇదే మూడు పార్టీలు జ‌ట్టు క‌డితే... టీఆర్ ఎస్ కు భారీ న‌ష్టం త‌ప్ప‌ద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. సో... సింగ‌రేణి గుర్తింపు కార్మిక సంఘం ఫ‌లితాల‌ను ఆయా పార్టీలు ఏ కోణంలో చూస్తాయ‌న్న విష‌యం ఇప్పుడు ఆస‌క్తి రేకెత్తిస్తోంది.