Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ప్రతిపక్షాలకు ‘చోటు’ లేదు

By:  Tupaki Desk   |   1 Jan 2016 5:30 PM GMT
హైదరాబాద్ లో ప్రతిపక్షాలకు ‘చోటు’ లేదు
X
జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రతిపక్షాలకు ఏమాత్రం చోటు లేకుండా చేయాలని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి కంకణం కట్టుకున్నట్లుంది. ఆయా పార్టీల ప్రచారానికి నిలువ నీడ లేకుండా చేయాలని భావిస్తున్నట్లుంది. అందుకే హైదరాబాద్ మొత్తం ఆ పార్టీయే ఆక్రమిస్తోంది.

హైదరాబాద్ లోని మొత్తం భారీ హోర్డింగులను అధికార పార్టీ గత రెండు నెలల కిందటే గుత్తకు తీసుకున్న విషయం తెలిసిందే. వాటన్నిటిలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన ప్రభుత్వ పథకాల ప్రచారాన్ని విస్తృతం చేసింది. అదే సమయంలో హైదరబాద్ లోని మెజారిటీ బస్టాండ్ల హోర్డింగులనూ అధికార పార్టీ కైవసం చేసుకుంది. వాటన్నిటి మీదా ప్రభుత్వ అనుకూల ప్రచారం షురూ చేసింది. తాజాగా మెట్రో రైలు స్తంభాలను కూడా టీఆర్ ఎస్ గుత్తకు తీసేసుకుంది. హైదరాబాద్ అంతటా మెట్రో రైలు స్తంభాలపై అధికార పార్టీ ప్రచారం - ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాలతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ అభివృద్ధికి కేసీఆర్ కు మద్దతు ఇవ్వండి అంటూ నినాదాలు చేస్తోంది.

ప్రస్తుతం హయత్ నగర్ నుంచి మియాపూర్ వరకూ.. నాగారం నుంచి రాజేంద్ర నగర్ వరకూ ఎక్కడ చూసినా కేవలం అధికార పార్టీ హోర్డింగులు - పోస్టర్లు మాత్రమే దర్శనం ఇస్తున్నాయి. కేసీఆర్ చిత్రాలు అడుగడుగునా కనిపిస్తున్నాయి. కానీ, ప్రతిపక్షాలకు సంబంధించిన ఒక్క పోస్టర్ కానీ హోర్డింగ్ కానీ లేదు. రాబోయే నెల రోజులపాటు ఉండే పరిస్థితి కూడా లేదు. జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలకు ప్రచారానికి కూడా చోటు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే అధికార పార్టీ ఈ ఎత్తు వేసిందని చెబుతున్నారు.