Begin typing your search above and press return to search.

మోడీ ప‌ర్య‌ట‌న వెనుక టీఆర్ ఎస్ లెక్క‌లు వేరే

By:  Tupaki Desk   |   5 Aug 2016 11:30 AM GMT
మోడీ ప‌ర్య‌ట‌న వెనుక టీఆర్ ఎస్ లెక్క‌లు వేరే
X
తెలంగాణ రాష్ట్రంలో మొట్ట‌మొద‌టి సారిగా ప్ర‌ధానమంత్రి నరేంద్రమోడీ ప‌ర్య‌టించ‌క‌ముందే ర‌క‌ర‌కాల రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు ప్రారంభమ‌వుతున్నాయి. సాధారణంగా స్వంతపార్టీ, మిత్రపక్షాలు అధికారంలో ఉన్నచోట్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు హడావిడి చేస్తాయి. ఇతర పార్టీలు అధికారంలో ఉంటే ప్రధానమంత్రి వచ్చినా.. మొక్కుబడిగా కార్యక్రమం నిర్వహిస్తారు. ఏ విధంగా చూసినా.. టీఆర్‌ ఎస్‌ మిత్రపక్షం కాదు. ఎన్డీఏలో భాగస్వామీ కాదు. బయట నుంచి మద్దతు ఇచ్చిన పార్టీ కూడా కాదు. కానీ 2ల‌క్ష‌ల మందితో స‌భ నిర్వ‌హించాల‌ని కేసీఆర్ ప్ర‌య‌త్నించ‌డం విశేషం. బీజేపీకి ప్రతిప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న టీఆర్ఎస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో మోడీ పర్యటన ఆసక్తికరంగా మార‌ట‌మే కాకుండా ప‌లు స‌మీక‌ర‌ణాల‌కు వేదిక‌గా అవుతోంది. ఆయన పర్యటనను రాజకీయంగా వాడుకోవాలన్న‌ట్లుగా టీఆర్‌ ఎస్‌ ఏర్పాట్లు చేస్తోంద‌ని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రధాని పర్యటనలో రాష్ట్రప్రభుత్వ అధికారిక కార్యక్రమం గజ్వేల్‌ లో - బీజేపీ కార్యకర్తల సమావేశం హైదరాబాద్‌ ఎల్బీస్టేడియంలో జరగనున్నాయి. ఒకేరోజు ఈ కార్యక్రమాలు ప్రధాని షెడ్యూల్‌ లో ఉన్నాయి. తెలంగాణలో పాగా వేయాలని ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసింది. ఆ మేరకే ఇక్కడి పార్టీ నేతలు టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై ఫైర్‌ అవుతున్నారు. అయితే రాష్ట్రంలో బీజేపీకి చోటు దక్కకూడదనే రాజకీయ కారణంతో ప్రధాని పర్యటనను తమకు అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నాన్ని టీఆర్‌ ఎస్‌ భుజానికెత్తుకుంది. దీనికోసం గజ్వేల్‌ లో జరిగే బహిరంగ సభకు 2 లక్షల మంది ప్రజల్ని సమీకరించాలని నిర్ణయించి, ఆ మేరకు ఏర్పాట్లు చేపట్టింది.

ప్రధాని మోడీ ఈ నెల 7న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియోజకవర్గమైన గజ్వేల్‌ లోని కోమటిబండ వద్ద 'మిషన్‌ భగీరథ' కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అదే వేదిక నుంచి పలు అభివృద్ది పనులను ప్రారంభిస్తారు. బహిరంగసభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగిస్తారు. ఈ బహిరంగసభకు వచ్చే వారి కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ పూర్తిగా ఈ కార్యక్రమంపైనే దృష్టి సారించారు. దాదాపు రెండు లక్షల మందిని తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ శ్రేణులను ఆదేశించారు. దీనికోసం మెదక్‌ జిల్లా సహా పొరుగు జిల్లాల పార్టీ నేతలు కూడా ప్రయత్నాలు మొదలు పెట్టారు. మోడీ బహిరంగ సభకు టీఆర్‌ ఎస్‌ చేస్తున్న హడావుడి వెనుక రాజకీయ కోణం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ రాష్ట్రంలో ఎదగకుండా నిరోధించడం ప్రధానమైంది. ఈ నెల 7న 'మిషన్‌ భగీరథ' ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఘనతగా ప్రచారం చేసుకోవడం మరో ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రప్రభుత్వ అధికారిక కార్యక్రమం కావడంతో బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇక్కడి ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితి లేకుండా చేయడం కోసం భారీ జనసమీకరణకు వ్యూహా రచన చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రభావమే అదే రోజు సాయంత్రం ఎల్బీస్టేడియంలో బీజేపీ నిర్వహించే బహిరంగసభపై కూడా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు సమాచారం.

ఒకే రోజు ఒకే రాష్ట్రంలో ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయబోరనే అంచనాల్లో ప్రభుత్వం ఉంది. ధనిక రాష్ట్రం అన్న పేరుతో ఇన్ని రోజులు బింకంగా ఉన్న సీఎం కేసీఆర్‌ కు - కొత్తగా చేపట్టిన పథకాలు ఊపిరి సలపనీయడం లేదు. ఈ పథకాలను నిర్వహించాలంటే..కేంద్రం నుంచి సాయం అందాల్సిందే. దానికోసం మోడీని ప్రసన్నం చేసుకోవడం త‌ప్ప‌నిస‌రి అన్నట్టు ప్రచారం జరుగుతోంది. మ‌రోవైపు బీజేపీ రాష్ట్ర శాఖ పార్టీ కార్యకర్తల సమ్మేళనానికి కనీసం లక్ష మంది కార్యకర్తలను సమీకరించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ హడావుడిలో ఉన్న బీజేపీ నేతలు, మోడీ పర్యటనకు టీఆర్‌ ఎస్‌ చేస్తున్న హడావుడిని చూసి బిత్తరపోతున్నారు. తమ కార్యక్రమాన్ని విఫలం చేయాలని టీఆర్‌ ఎస్‌ ప్రయత్నిస్తోందని వాపోతున్నారు.