Begin typing your search above and press return to search.

కేటీయార్ కు లైన్ క్లియర్ అయినట్లేనా ?

By:  Tupaki Desk   |   26 Oct 2021 9:30 AM GMT
కేటీయార్ కు లైన్ క్లియర్ అయినట్లేనా ?
X
చూడబోతే కేసీఆర్ కు లైన్ క్లియర్ చేయడం కోసమే టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించినట్లుంది. కేసీఆర్ కొడుకు, మంత్రే కాకుండా కేటీయార్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. అనధికారికంగా కేసీఆర్ సీఎం హోదాను కూడా అనుభవిస్తున్నారనే ప్రచారానికి కొదవే లేదు. ఇలాంటి నేపధ్యంలోనే టీఆర్ఎస్ ఒక్కరోజు ప్లీనరీ జరిగింది. ఈ ప్లీనరీలో 8 తీర్మానాలు చేశారు. పార్టీ బైలాస్ కు సవరణలు కూడా జరిగాయి.

తీర్మానాలు, సవరణల సంగతిని పక్కన పెట్టేస్తే బైలాస్ లో చేసిన ఒక సవరణ మాత్రం చాలా కీలకంగా మారింది. అదేమిటంటే పార్టీ ప్రెసిడెంట్ అందుబాటులో లేనప్పుడు వర్కింగ్ ప్రెసిడెంటే పార్టీ బాధ్యతలు చూసుకోవాలని సవరణలు చేశారు. దీనికి ప్లీనరీ ఏకగ్రీవంగా ఆమోదమూ తెలిపింది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా కేసీయార్ తలచుకుంటే జరగనిది ఏముంటుంది ? అందులోను కొడుకు విషయంలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు.

నిజానికి కేసీఆర్ మంత్రులకు అసలు అందుబాటులో ఉండరనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ ప్రచారం లేకపోతే ఆరోపణలు కేసీఆర్ సీఎం అయిన దగ్గర నుండి వినిపిస్తున్నదే. వారాల తరబడి మంత్రులకే కాదు ఉన్నతాధికారులకే అందుబాటులో ఉండనపుడు ఇక పార్టీ నేతల గురించి చెప్పాల్సిన పనే లేదు. కేసీయార్ సచివాలయంకు రాకపోవటం, మంత్రులు, ఉన్నతాధికారులకు అందుబాటులో ఉండని విషయంపై ప్రతిపక్షాలు ఓ రేంజిలో ఆరోపణలు చేస్తున్నాయి.

ఎవరెన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని విమర్శలు చేస్తున్నా కేసీయార్ అయితే లెక్కే చేయడం లేదు. కేసీఆర్ ఎప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తారంటే ఎన్నికలు ఉన్నపుడు మాత్రమే అనే సెటైర్లకు కొదవేలేదు. ఇపుడు వరసగా మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షలు జరుపుతున్నారన్నా, బహిరంగ సభల్లో కనబడతున్నారన్నా అందుకు కారణం హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉప ఎన్నిక అయితేపోతే మళ్ళీ కేసీయార్ తరచు దర్శనభాగ్యం ఎప్పుడో ఎవరు చెప్పలేరు.

ఇలాంటి నేపథ్యంలో పార్టీ ప్రెసిడెంట్ అందుబాటులో లేనపుడు వర్కింగ్ ప్రెసిడెంటే బాధ్యతలు చూసుకోవాలని నిర్ణయం జరిగిందంటే అది కేటీయార్ కోసమే అని అర్ధమైపోతోంది. అంటే ఇప్పటివరకు అనధికారికంగా ఉన్న హోదాను ఇకనుండి అధికారికంగా కేటీయార్ నిర్వహించేందుకు లైన్ క్లియర్ అయినట్లే అనుకోవాలి. కేసీయార్ ఎలాగూ అందుబాటులో ఉండారు కాబట్టి కేటీయారే పూర్తిస్ధాయి అధ్యక్ష బాధ్యతలు చేపడతారన్నమాట. బైలాస్ లో ఈ సవరణ చూసిన తర్వాత ప్లీనరీ కేటీయార్ కోసమే జరిగిందని ఎవరైనా అనుకుంటే అది తప్పెలా అవుతుంది ?