Begin typing your search above and press return to search.

సాగ‌ర స‌మ‌రంలో.. టీఆర్ ఎస్ `కుల రాజ‌కీయం`.. స‌క్సెస్ అయ్యేనా?

By:  Tupaki Desk   |   6 April 2021 5:30 PM GMT
సాగ‌ర స‌మ‌రంలో.. టీఆర్ ఎస్ `కుల రాజ‌కీయం`.. స‌క్సెస్ అయ్యేనా?
X
మ‌రో ప‌ది రోజుల్లో నాగార్జున సాగ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌ర‌గ‌నున్నఉప ఎన్నిక‌లో విజ‌యం ద‌క్కించుకునేందుకు అధికార పార్టీ టీఆర్ ఎస్ కొత్త ఎత్తులు వేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ కార్డు, సెంటిమెంటును మాత్ర‌మే న‌మ్ముకుని ముందుకు సాగిన అధికార పార్టీ ఇప్పుడు కొత్త పంథాను ఎంచుకుంది. ఎన్న‌డూలేని విధంగా కులం కార్డును ప్ర‌యోగిస్తోంది. వాస్త‌వానికి కులాల ప్రాతిప‌దిక‌న ఓట్లు, ఎన్నిక‌లు ఎక్కువ‌గా జ‌రిగే రాష్ట్రంగా ఏపీకి పేరుంది. తెలంగాణ విష‌యాన్ని తీసుకుంటే.. ఇక్క‌డ ఉద్య‌మం.. తెలంగాణ సెంటిమెంటు వంటివి కీ రోల్ పోషిస్తున్నాయి. అయితే.. ఇటీవ‌ల రెండు ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ పెద్ద దెబ్బ‌తింది.

దుబ్బాక ఉప ఎన్నిక‌లో ఓట‌మి, జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో చావు త‌ప్పిన‌ట్టుగా బొటాబొటి మెజారిటీతో విజ‌యం వంటివి.. ఆ పార్టీని తీవ్ర క‌ల‌వ‌రానికి గురి చేశాయి. ఈ క్ర‌మంలో.. కొన్ని రోజుల కింద‌ట జ‌రిగిన ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కులం కార్డును ప్ర‌యోగించి.. త‌నకు ఇటీవల కాలంలో గ‌ట్టి పోటీగా మారిన బీజేపీకి చెక్ పెట్టింది. ఇక‌, ఇప్పుడు సాగ‌ర్ స‌మ‌రంలోనూ.. ఇదే త‌ర‌హా వ్యూహానికి టీఆర్ ఎస్ మొగ్గు చూపుతోంది. కులాల వారీగా జ‌నాల‌ను విడ‌దీసి.. సామాజిక వ‌ర్గం సెంటిమెంటును ర‌గిలించి.. ఓట్లు దండుకునే ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఈ క్ర‌మంలో ఈ కులాల స‌మీక‌ర‌ణ‌లు సాధించేందుకు ఏకంగా ఎమ్మెల్యేల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం ఇక్క‌డ పెద్ద ట్విస్ట్‌!

అధినేత కేసీఆర్ నుంచి ఆదేశాలు రాగానే ఎమ్మెల్యేలు.. రంగంలోకి దిగిపోయారు. కొంద‌రిని ఇంచార్జ్‌లుగా కూడా నియ‌మించ‌డం తో.. వారంతా.. త‌మ త‌మ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌ల‌ను, స్థానికంగా ప‌ట్టున్న నేత‌ల‌ను ప‌నిగ‌ట్టుకుని పిలుస్తూ.. విందులు ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలోనే `మ‌నోళ్లంతా.. కారెక్కాలి!`` అని నేరుగా ఓటు ఎవ‌రికి వేయాలో స్ప‌ష్టం చేస్తున్నారు. ఈ విష‌యంలో ఎమ్మెల్యేలు దూకుడుగానే ఉన్నారు. ఎస్ టి లు ఎక్కువగా ఉన్న త్రిపురారం, తిరుమలగిరి మండలాలకు ఎస్ టి వర్గాలకు చెందిన వారిని ఇన్ చార్జిగా నియమించడం వెనుక ఉన్న వ్యూహం ఇదే. సాగ‌ర్ నియోజకవర్గంలో యాదవ, రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉండడంతో ఆ వర్గం వారిని ఎక్కువ‌గా రంగంలోకి దించారు. ప్రతి మండలంలోనూ సామాజిక వర్గంలో బలమైన వారితో కలిసి, ఓట్లుగా మార్చుకునేలా చర్చలు చేస్తున్నారు.

గ‌త దుబ్బాక ఉప పోరులో అధికార పార్టీ వ‌ర్సెస్ బీజేపీకి మ‌ధ్య స‌మ‌రం హోరాహోరీ జ‌ర‌గ్గా .. ఇప్పుడు సాగ‌ర్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి.. మాజీ మంత్రి జానారెడ్డికి, టీఆర్ ఎస్‌కు తీవ్ర‌స్థాయిలో యుద్ధం సాగుతోంది. ఈక్ర‌మంలో జానారెడ్డికి సెంటిమెంటు ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన అధికార పార్టీ.. ఈ సెంటిమెంటును .. కులం కార్డును ప్ర‌యోగించి.. ప‌క్క‌కు త‌ప్పించ‌డం ద్వారా.. గెలుపు గుర్రం ఎక్కాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. వాస్త‌వానికి.. ఇది టీఆర్ ఎస్ ఇప్ప‌టి వ‌ర‌కు అవలంభించిన అనేక విష‌యాల‌ను భిన్న‌మే అయినా.. ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితులు ఎదురవుతాయోన‌ని.. ఈ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు విశ్లేష‌కులు భావిస్తున్నారు. కులం వారీగా ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొంటే.. తిరుగు ఉండ‌ద‌న్న ఈ వ్యూహం టీఆర్ ఎస్‌కు ఏమేర‌కు క‌లిసి వ‌స్తుందో చూడాలి.